మక్కా మసీదుఫై దాడి కేసులో నిందితులంతా నిర్దోషులే అంట…!

భాగ్యనగరంలో సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురు నిందితులను ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.నిందితులుగా ఉన్న దేవేందర్‌గుప్తా, లోకేశ్‌ శర్మ, స్వామి అసీమానంద, భరత్‌ భాయి, రాజేందర్‌చౌదరిపై అభియోగాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రత్యేక న్యాయస్థానం తీర్పుపై ఎన్‌ఐఏ.. హైక్టోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2007 మే 18న మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో చార్మినార్‌ సమీపంలోని మక్కామసీదు ఆవరణలోగల వజూఖానా వద్ద ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్ ప్లోజివ్‌ డివైజ్‌(ఐఈడీ) బాంబు పేలడంతో తొమ్మిది మంది మరణించగా.. 58 మంది గాయపడ్డారు. అక్కడికి సమీపంలోనే పేలని మరో ఐఈడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో మసీదులో ప్రార్థనలు జరుగుతుండటంతో సుమారు అయిదువేల మందికి పైగా ఉన్నారు. పేలుడు అనంతరం జరిగిన అల్లర్లను అణిచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో 9 మంది మృతిచెందారు. ఈ ఘటనలపై తొలుత హుస్సేనీఆలం ఠాణాలో కేసులు నమోదయ్యాయి. ఘటన తీవ్రత దృష్ట్యా కేసుల దర్యాప్తును సీబీఐ చేపట్టింది. అయితే ఉగ్రవాద దుశ్చర్య కావడంతో భారత హోంమంత్రిత్వ శాఖ కేసు దర్యాప్తు బాధ్యతను 2011 ఏప్రిల్‌ 4న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కి అప్పగించింది. అప్పట్లో రెండు కేసుల్ని తిరిగి నమోదు చేసిన ఎన్‌ఐఏ మొత్తం పదిమంది నిందితుల్ని గుర్తించింది. సీబీఐ ఒకటి, ఎన్‌ఐఏ రెండు అభియోగపత్రాల్ని న్యాయస్థానంలో నమోదు చేశాయి. 2014 ఫిబ్రవరి 13న నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com