మరోసారి క్యాసెట్ వేసిన జైట్లీ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మళ్లీ మళ్లీ చెప్పిందే చెప్పారు. బడ్జెట్‌పై చర్చకు సంబంధించి ఏపీకి ఇచ్చిన హామీలపై స్పష్టత, గడువు గురించి రాజ్యసభలోనైనా ప్రకటన చేస్తారని ఆశించిన ఆంధ్ర ఎంపీలకు మరోసారి నిరాశే ఎదురైంది. గురువారం లోక్‌సభలో ఏదైతే చెప్పారో మళ్లీ రాజ్యసభలోనూ అదే విషయాన్ని చెప్పారు. గత కొన్ని రోజులుగా ఏపీ ఎంపీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో మాట్లాడుతూ.. ‘రాజధాని, నిర్మాణానికి, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి నిధులు సమకూరుస్తూనే ఉన్నాం. రెవెన్యూలోటుకు సంబంధించి కొంత ఇచ్చాం. బకాయిలపై చర్చించి చెల్లిస్తాం. ఉక్కు కర్మాగారం, ఓడరేవులు తదితర అంశాలకు సంబంధించి సంబంధిత శాఖలు పనిచేస్తున్నాయి. మరోవైపు పోలవరం పనులు కొనసాగుతున్నాయి. ఏపీ విభ‌జ‌న స‌మ‌యంలో అధిక ఆదాయాన్ని తెలంగాణ పొందింది. ఏపీ కోల్పోయిన లోటును భ‌ర్తీ చేయాల్సి ఉంది. రైల్వేజోన్‌, స్టీల్ ప్లాంట్, దుగ‌రాజ‌ప‌ట్నం పోర్టు, కడపలో స్టీల్‌ ప్లాంట్‌, పెట్రోలియం క్రాకర్‌ కాంప్లెక్స్‌, విశాఖ రైల్వే జోన్‌, విశాఖ-చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ పరిశీలనలో ఉన్నాయి. ఏపీకి సంబంధించిన అంశాలను పరిశీలించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని శాఖలకు చెప్పాం. రాజ‌ధాని, పోల‌వ‌రం నిర్మాణం కోసం నిధులిచ్చాం. 2014-15 సంవ‌త్సరానికి ఏపీకి రూ.3,979 కోట్లు సాయం చేశాం’ అంటూ లోక్‌సభ తరహాలోనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. అంతకుముందు గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న ఎంపీలు రాజ్యసభలో జైట్లీ ప్రకటన చేస్తున్నప్పుడు మాత్రం నిరసన తెలుపలేదు. అయితే, ఇది చర్చలకు వేదిక అని, ఆందోళనలు చేయడానికి కాదని, సభ్యులు హుందాగా వ్యవహరించాలంటూ జైట్లీ ప్రసంగానికి ముందు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభ్యలను కోరారు. అంతకుముందు పార్లమెంట్‌లో తెదేపా ఎంపీలు చేస్తున్న ఆందోళనకు ముగింపు పలికేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్య చొరవ తీసుకున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత సుమారు రెండున్నర గంటల పాటు చర్చించారని తెలిసింది. చర్చలో జైట్లీ, అమిత్‌ షా, సుజనా చౌదరి, ఇతర ఎంపీలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే, ఎంపీల ఆందోళన విరమించేందుకు కృషి చేశారే తప్ప వారిని సంతృప్తి పరిచే రీతిలో ప్రకటన చేయడంలో మాత్రం జైట్లీ మరోసారి విఫలమయ్యారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com