మరో సంచలన నిజం బయటకు వచ్చింది

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొన్ని రోజుల క్రితం ఆమె వ్యక్తిగత డ్రైవర్‌ చెప్పిన కొన్ని వాస్తవాలు సంచలనం రేపగా తాజాగా అపోలో ఆసుపత్రికి చెందిన ఈసీజీ (ఎలక్ట్రో కార్డియో గ్రాఫ్‌) ఆపరేటర్‌… ఆర్ముగస్వామి కమిషన్ ఎదుట చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘అమ్మ’కు 2016 డిసెంబర్‌ 4న సాయంత్రం 3:50గంటలకు ఈసీజీ టెస్ట్‌ చేశారని ఆపరేటర్‌ తెలిపారు. జయలలిత మృతిపై నిజానిజాలు తేల్చాల్సిందిగా విచారణ కమిషన్‌ చట్టం 1952 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం.. మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి‌ ఎ. ఆర్ముగస్వామి ఆధ్వర్యంలో గతేడాది సెప్టెంబర్‌ 25న కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అప్పటినుంచి ఈ కేసులో కీలక వ్యక్తులను విచారిస్తూ వస్తున్న కమిషన్‌.. అనారోగ్యంతో ‘అమ్మ’ చేరిన అపోలో ఆసుప్రతిలోని ఈసీజీ ఆపరేటర్‌ నళినిని కూడా విచారించింది.

ఈ సందర్భంగా నళిని మాట్లాడుతూ… ‘అమ్మ’కు 2016 డిసెంబర్‌ 4న సాయంత్రం 3:50గంటలకు ఈసీజీ టెస్ట్‌ చేశారు. అది నా సమక్షంలోనే జరిగింది.’ అని తెలిపారు. ‘అమ్మ’కు గుండెపోటు వచ్చినట్లు డిసెంబరు 4న సాయంత్రం 4గంటలకు తనకు ఫోన్‌కాల్‌ వచ్చిందని, అప్పుడే ఆమె పరిస్థితి విషమించిందని డయాబెటాలజిస్ట్‌ జయశ్రీగోపాల్‌ తెలిపారు. అయితే, అధికారిక రికార్డుల్లో మాత్రం జయను 2016 సెప్టెంబర్‌ 22న ఆసుపత్రిలో చేర్చారని, 2016డిసెంబరు 4 సాయంత్రం 4:20గంటలకు ఆమెకు గుండెనొప్పి వచ్చిందని ఆ మరుసటి రోజే జయ మృతి చెందారని నమోదైంది. అందులోనూ జయకు గుండెపోటు రావడానికి ముందు వరకూ ఆమె టీవీ చూస్తూ ఉన్నారని జయలలిత నెచ్చెలి వీకే శశికళ పేర్కొనడం గమనార్హం.

ఈసీజీ ఆపరేటర్‌ నళిని, వైద్యురాలు జయశ్రీ చెప్పిన వివరాలకు… రికార్డుల్లో నమోదైన వివరాలకు ఎంతమాత్రం పొంతనలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విచారణ కమిషన్‌ ఎదుట హాజరైన దివాకరన్‌ కుమారుడు: జస్టిస్‌ ఆర్ముగ స్వామి విచారణ కమిషన్‌ సమక్షంలో శశికళ సోదరుడు దివాకరన్‌ కుమారుడు హాజరయ్యారు. బుధవారం జయలలిత సహాయకులు పూంగుండ్రన్‌, కార్తికేయన్‌ ఆ కమిషన్‌ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందిన ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ దివాకరన్‌ కుమారుడు జై ఆనంద్‌ గతంలో తెలిపారు. దీంతో విచారణ కమిషన్ ఎదుట హాజరుకావాలంటూ ఆయనకు సమన్లు అందాయి. ఆ మేరకు గురువారం ఉదయం ఆయన కమిషన్‌ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ… 2011లో జయలలిత కొడనాడు వచ్చినప్పుడు ఆమెను చూశానని తెలిపారు. తర్వాత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా స్పృహలోకి వచ్చిన ఆమెను చూసినట్లు పేర్కొన్నారు. జయలలితకు అందించిన చికిత్సకు సంబంధించిన వీడియో గురించి కమిషన్‌ తనను ఏమీ ప్రశ్నించలేదని తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com