మహిళల జోలికి వస్తే ఖబడ్దార్

గుంటూరులో జరిగిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్ అధికారులతో ఈమేరకు తన నివాసంలో సమావేశమయ్యారు. ఆడపిల్లల జోలికి వచ్చేవారిని ఉపేక్షించవద్దని, నిందితులను కఠినంగా శిక్షించాలని తేల్చిచెప్పారు. బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆడబిడ్డలకు అన్యాయం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒకరిద్దరిని కఠినంగా శిక్షిస్తే మిగిలినవారికి బుద్ది వస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఆడబిడ్డలకు రక్షగా ఉండాలన్న ప్రచారం విస్తృతంగా జరగాలని.. నేరాలకు పాల్పడితే జీవితాలు నాశనం అవుతాయన్న ఇంగితం ప్రజల్లో పెరగాలని హితబోధ చేశారు. పాత గుంటూరులో పరిస్థితులను గురించి వాకబు చేసిన సీఎం చంద్రబాబు.. అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అశాంతి, అభద్రత సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితురాలి కుటుంబానికి అధికారులు అండగా నిలవాలని సూచించారు. పాత గుంటూరులో ఓ యువకుడు మైనర్‌ బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి దిగడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పాతగుంటూరు బాలాజీనగర్‌లోని ఓ ప్రాంతంలో ఉండే బాలిక రెండో తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన రఘు(20) మంగళవారం ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. వెంటనే కేకలు వేస్తూ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఈ బాలికను స్థానికులు ఏం జరిగిందన్నది అడగడంతో జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో కోపోద్రిక్తులైన వారు ఆ యువకుడిని పట్టుకోవడానికి వెంటపడ్డారు. అతను అక్కడి నుంచి పారిపోయి పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ సమాచారం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు పెద్దసంఖ్యలో రహదారులపైకి చేరి ఆందోళనకు దిగారు. మరికొందరు పోలీసుస్టేషన్‌కు వెళ్లి యువకుడిని తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమాచారం అందిన వెంటనే పాతగుంటూరు సీఐ బత్తుల శ్రీనివాసరావు హుటాహుటిన స్టేషన్‌కు చేరుకొని సిబ్బందిని అప్రమత్తం చేశారు. తూర్పు డీఎస్పీ కండే శ్రీనివాసులు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. అర్బన్‌ ఎస్పీ విజయరావు అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించారు. అయినప్పటికి ఆందోళనకారులు ఒక్కసారిగా పోలీసుస్టేషన్‌పైకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఆగ్రహావేశాలతో ఉన్న నిరసనకారులు నూతనంగా నిర్మించిన ఆదర్శ పోలీసుస్టేషన్‌పై రాళ్లవర్షం కురిపించగా దాని అద్దాలు పగిలాయి. వారిని నిలువరించే ప్రయత్నంలో పోలీసులు లాఠీఛార్జి చేశారు. రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. రాళ్లదాడి ఆపకపోవడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com