మహీంద్రగిరుల అందం చూద్దాం రండి

తూర్పుకనుమల్లో అందాలు నెలకొన్న కొండలు మహేంద్రగిరులు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పర్వత శ్రేణులపై ప్రకృతి ఎప్పుడూ పరవశిస్తూ ఉంటుంది. చెట్లు, చేమలతో పచ్చలపేరులా మెరిసిపోతున్న మహేంద్రగిరుల్లో.. అక్కడక్కడా వజ్రాలు పొదిగినట్టుగా అపురూప ఆలయాలు దర్శనమిస్తాయి. ముత్యాలు కుమ్మరించినట్టుగా నీటి చెలమలు కనిపిస్తాయి. ఈ గిరులకు ఏడాదంతా పర్యాటకుల తాకిడి ఉంటుంది. ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా వేల మంది భక్తులు తరలి వస్తారు. ఇక్కడి పాండవుల ఆలయాలను సందర్శిస్తారు. ఆ చుట్టుపక్కల వాళ్లు ప్రతిష్ఠించిన మహాలింగాలను భక్తితో పూజిస్తారు.
శ్రీకాకుళం జిల్లా మందస మండలం సింగుపురం సమీపంలో ఉంటాయి మహేంద్రగిరులు. సముద్ర మట్టానికి ఐదువేల అడుగుల ఎత్తులో ఉన్నాయివి. అరుదైన వృక్షసంపద వీటి సొంతం. వనవాసకాలంలో పాండవులు మహేంద్రగిరులపై కొంతకాలం గడిపారని చెబుతారు. ఆ సమయంలో ఒక్కొక్కరూ ఒక్కో మందిరాన్ని నిర్మించుకొన్నారని స్థానిక కథనం. అందుకు తగ్గట్టుగా ఇప్పుడు అక్కడ పాండవుల పేరిట ఆలయాలు కనిపిస్తాయి. ధర్మరాజు, కుంతీదేవి ఆలయాలు ఒక ప్రదేశంలో ఉండగా.. భీమసేనుడి ఆలయం ఎత్తయిన శిఖరంపై కనిపిస్తుంది. అక్కడికి కొంత దూరంలో అర్జునుడు, నకుల, సహాదేవుల ఆలయాలు ఉన్నాయి. వీటి పరిసర ప్రాంతాల్లో పాండవులు ప్రతిష్టించారని భావించే లింగాలు కనిపిస్తాయి.
*****కాలప్రవాహంలో ఆలయాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. అయినా.. వాటి ప్రాశస్త్యం మాత్రం తగ్గలేదు. ఏటా శివరాత్రి సందర్భంగా మహేంద్రగిరులపై జరిగే ఉత్సవాలకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కూడా భక్తులు వస్తుంటారు. పిల్లలు, పెద్దలు వ్యయప్రయాసలకోర్చి సాహసయాత్రకు పూనుకుంటారు. శివరాత్రికి ఒకరోజు ముందుగానే భక్తులంతా గిరులపైకి చేరుకుంటారు. పూజాసామగ్రి, మంచినీళ్లు, ఆహారం, పళ్లు అన్నీ వెంట తెచ్చుకుంటారు. శివరాత్రి ఉపవాస దీక్షలో ఉంటారు. భజనలతో రాత్రంతా జాగరణ చేస్తారు. మర్నాడు భోజనాలు చేసుకొని తిరుగు ప్రయాణం అవుతారు. శివరాత్రి సందర్భంగా జనంతో కిటకిటలాడే మహేంద్రగిరులు ఆ తర్వాత బోసిపోతాయి. సాహస యాత్రికులు మాత్రం తరచూ ఇక్కడికి వస్తుంటారు.
*****ఇలా వెళ్లాలి..
* మహేంద్రగిరుల యాత్రకు సాహసంతో పాటు ఓపిక కూడా ఉండాలి. ముందుగా శ్రీకాకుళం, ఇచ్ఛాపురం నుంచి బస్సుల్లో మందస మండలం సింగుపురం చేరుకోవాలి.
* మహేంద్రగిరులకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌ పలాస. ఇక్కడి నుంచి మందస మీదుగా సింగుపురం చేరుకోవచ్చు. బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.
* సింగుపురం నుంచి వాహనాల్లో.. చొంపాపురం మీదుగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామమైన రాజబసకు వెళ్లాలి. ఆపై కాలినడక మొదలవుతుంది. దాదాపు 28 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. చల్లని గాలులు, ప్రకృతి సౌందర్యం, గలగల పారే సెలయేళ్లు.. యాత్రికులకు అలసట తెలియనివ్వవు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com