మాంటిస్సోరి కోటేశ్వరమ్మకు సరైన గౌరవం

ఆడపిల్లలు చదవుకుంటేనే గుర్తింపు.. పురుషులతో సమానంగా రాణిస్తారని నమ్మి వేల మందిని తీర్చిదిద్దిన ఉక్కు సంకల్పం మాంటిస్సోరి కోటేశ్వరమ్మది. తాను బాగా చదువుకోవాలని చిన్నప్పటి నుంచి దానికి తగ్గట్టుగా ప్రయత్నించి సాధించిన మహిళామూర్తి ఆమె. చదువు ఒక్కటే అన్ని సమస్యలకూ పరిష్కారమని భావించి.. అలుపెరగకుండా కృషి చేస్తున్నారు. ఆరు దశాబ్దాల తన విద్యా ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు.. మరెన్నో పురస్కారాలు సొంతం చేసుకున్నారు. అయితే.. వాటన్నిటికంటే.. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలోనే తనకు ఆనందం ఉందని చెబుతారామె. సమాజాభివృద్ధి జరగాలంటే.. ఆడపిల్ల చదువుకోవాల్సిందేనని పట్టుబట్టి.. మరీ విద్యార్థినులను పాఠశాలకు రప్పించారామె. ఆమె చిన్నతనంలో ఆడ పిల్లలను బడికి పంపేవాళ్లు కాదు. పల్లెల్లో మరీ కట్టుబాట్లు ఉండేవి. గడపదాటకుండా కట్టడి చేసేవారు. ఆ రోజుల్లో కొమర్రాజు అచ్చమాంబ వంటి ప్రముఖులు మహిళా సాధికారత కోసం పాటుపడేవారు. ఆడ పిల్లలకు బయటి ప్రపంచం తెలిసేలా చేయాలని సూచించేవారు. అచ్చమాంబ స్ఫూర్తిగా తీసుకునే తాను ఈ స్థాయికి చేరానంటూ కోటేశ్వరమ్మ గర్వంగా చెబుతుంటారు. తానూ మహిళల కోసం ఏదైనా చేయాలని భావించి ఉపాధ్యాయురాలి శిక్షణ పూర్తిచేసిన వెంటనే నెల్లూరు కస్తూరిదేవి బాలికల హైస్కూల్‌లో చేరారు. 1947 నుంచి 54 వరకూ అక్కడే పనిచేశారు. అనంతరం విజయవాడలోనూ కొన్నాళ్లు పనిచేశారు. ఆమె భావాలకు తగ్గట్టుగా విద్యను అందించాలంటే కచ్చితంగా ఓ పాఠశాలను నెలకొల్పాలని భావించారు. 1955లో బందరు కాలువ ఒడ్డున మాంటిస్సోరి పేరుతో పాఠశాలను నెలకొల్పారు. మొదట్లో అందులో పది మంది విద్యార్థులే ఉండేవారు. ఆడపిల్లలను పాఠశాలలకు పంపించేవాళ్లు కాదు. దీంతో ఆమె సంకల్పం మరింత దృఢంగా మారింది. పట్టుదలగా ప్రయత్నించి తల్లిదండ్రులను ఒప్పించి.. పాఠశాలలో చేర్పించేలా చేసేవారు. దానికోసం తొలినాళ్లలో ఆమె ఎంతో శ్రమ పడ్డారు. ఒక్క బాలిక చదువుకుని జీవితంలో స్థిరపడితే చాలని, తన కష్టం వృథా కాదని కోటేశ్వరమ్మ మరింత ఉత్సాహంగా ముందుకెళ్లేవారు. ఆ సంకల్పం వేయింతలైంది. పది మందితో ప్రారంభమైన పాఠశాల.. ప్రాథమికోన్నత, ఇంటర్‌, డిగ్రీ, పీజీ కళాశాలలుగా ఎదిగింది. ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులూ ప్రారంభమయ్యాయి. మాంటిస్సోరి అంటే.. ఉన్నతమైన, విలువలున్న విద్యకు చిరునామాగా మారిపోయింది. ఆడపిల్లలు చదవాలంటే.. తొలి ప్రాధాన్యం మాంటిస్సోరికే అన్న స్థాయిలో పేరుగాంచింది. అయినా.. కోటేశ్వరమ్మకు విశ్రాంతి లేదు. అలుపెరగక నేటికీ.. కళాశాలను పర్యవేక్షిస్తూ.. మరిన్ని లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకుసాగుతూనే ఉన్నారు. కోటేశ్వరమ్మ లక్ష్యం నుంచి ఉద్భవించిన అనేక మంది యువతులు నేడు అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వంటి దేశాలు, ముంబయి, హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. వైద్యులుగా, ఇంజినీర్లుగా, పరిశ్రమల దిగ్గజాలుగా రాణిస్తున్నారు. ఇప్పటికీ.. వారందరికీ కోటేశ్వరమ్మ అంటే ఎనలేని గౌరవం. కళాశాలకు సంబంధించిన ఏ నిర్ణయానికైనా ‘మేము సైతం’ అంటూ వెన్నంటే ఉంటారు. అదీ.. విద్యార్థులతో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా కోటేశ్వరమ్మకున్న అనుబంధం. తాను కన్న కలలన్నీ నిజమయ్యాయని, మాంటిస్సోరిని విశ్వవిద్యాలయంగా మార్చాలన్నదే తన తర్వాత లక్ష్యమని ఆమె అంటున్నారు. ఈ కల సాకారమైతే.. తన జీవితం ధన్యమవుతుందని, కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని 90 ఏళ్ల వయసులోనూ దృఢ సంకల్పంతో చెప్పడం ఆమెకే సాధ్యం. కమ్యూనిస్టు నేతలు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావులంటే ఆమెకు ఎంతో అభిమానం. ధనవంతుల ఇంట పుట్టినా.. ఆదర్శవంతమైన జీవనం కోసం దారిద్య్రాన్ని అనుభవించిన మహనీయులు వారని కోటేశ్వరమ్మ ఎన్నో వేదికలపై కొనియాడేవారు. తాను ఉన్నత చదువు చదివి విద్యారంగంలో అడుగుపెట్టడానికి వీరిద్దరూ స్ఫూర్తేనంటూ చెప్పేవారు. కోటేశ్వరమ్మ తన భర్త వి.వి.కృష్ణారావు ప్రోత్సాహంతోనే తాను ఇదంతా సాధించగలిగానని గర్వంగా చెబుతుంటారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. 1971లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా పురస్కారం అందుకున్నారు. 1980లో రాష్ట్రస్థాయి బెస్ట్‌ కలేజియేట్‌ ఉపాధ్యాయురాలిగా, జీన్‌హారిస్‌, వంశీ పురస్కారాలు, ప్రపంచ తెలుగు వైభవవం, జ్యూయల్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ ఉద్యోగ్‌ ఎక్స్‌లెన్స్‌, లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌, ఇందిరాగాంధీ ఎక్స్‌లెన్స్‌, జ్ఞానభారతి రాష్ట్రీయ సమాన్‌, విశిష్ఠ మహిళ, రాష్ట్రీయ విద్యా సరస్వతి, విద్యా రత్న, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులు వంటి ఎన్నో పురస్కారాలను కోటేశ్వరమ్మ అందుకున్నారు. ప్రస్తుతం పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com