మా అమ్మ ఎంపిక లాగా ఉంది

అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’ విడుదల సందర్భంగా విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లోని ట్రెండ్‌సెట్‌ మాల్ లో సావిత్రి కుమార్తె చాముండేశ్వరి, చిత్ర నిర్మాత అశ్వినిదత్ సందడి చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన చాముండేశ్వరి.. అమ్మ చిన్నతనం నుంచి అగ్రకథానాయికగా ఎదిగిన తీరు ఇలా సినిమా రూపంలో చూడటం ఆనందంగా ఉందన్నారు. అమ్మే నాలో ఉండి తన కథని ఇలా చిత్ర రూపంలో చేయించుకుందనిపిస్తోందని పేర్కొన్నారు. అమ్మ పాత్రలో కీర్తి సురేష్‌ చక్కగా ఒదిగి పోయి నటించిందని.. అమ్మే కీర్తిని తన పాత్రకు ఎంచుకుందేమో అనిపించిందని చెప్పారు. నిజమైన అమ్మ కథ ఇప్పుడు అభిమానులకు తెలుస్తుందని.. ఇప్పటి వరకూ తెలిసింది నిజం కాదని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. సావిత్రి సినిమా అనుకున్న దానికి మించి అద్భుతంగా ఉందని కొనియాడారు. తెలుగు చిత్ర పరిశ్రమతోపాటు తెలుగువారి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మహానటి సావిత్రి జీవిత కథను చిత్రీకరించడం చాలా పెద్ద కోరికని.. దాన్ని విజయవంతంగా నెరవేర్చుకోగలిగామని చిత్ర నిర్మాత అశ్వినిదత్ ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యుల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. 18 నెలల కృషి ఫలితం ఇప్పుడు అవిష్కృతమైందని తెలిపారు. సావిత్రి కట్టు, బొట్టు అన్ని అంశాలలో కుటుంబసభ్యులు సహకరించారని, అందుకు తగ్గట్టుగానే కీర్తి సురేష్ నటన అమోఘంగా సాగిందని.. సావిత్రిని మరపించే విధంగా నటించిందని కొనియాడారు. జర్నలిస్టు పాత్రలో ఒదిగిపోయి నటించిన సమంతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అశ్వినిదత్.. ఇప్పటికే ఓవర్సీస్‌లో ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోందని వెల్లడించారు. ఆ మహానటి ఆత్మే ఈ చిత్రాన్ని దగ్గరుండి పూర్తి చేయించుకుందని అభిప్రాయపడ్డారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com