మా మీదకు కుక్కలని వదిలింది

అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’. తమిళంలో ‘నడిగయర్ తిలగం’ పేరిట మే9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్నాపెద్దా తేడా లేకుండా ఈ చిత్రం అందరినీ మెప్పించింది. కానీ ఈ సినిమాలో తన తండ్రి జెమిని గణేశన్‌ పాత్రను తప్పుగా చూపించారని అంటున్నారు ఆయన కుమార్తె కమలా సెల్వరాజ్. ఈమె గణేశన్‌, అలిమేలు దంపతుల కుమార్తె. ఇటీవల ఈ సినిమా చూసిన కమల మీడియా ద్వారా చిత్ర బృందంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సినిమాలో మా నాన్న పాత్రను తప్పుగా చూపించారు. సినిమాలో జెమిని గణేశన్‌‌ అలిమేలుని కాకుండా సావిత్రినే ఎక్కువగా ప్రేమించినట్లు ఎలా చూపిస్తారు? అలిమేలు, గణేశన్‌లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాంటప్పుడు అలిమేలుపై ప్రేమే లేదన్నట్లుగా చూపించారు. ఆ విషయం మీకెలా తెలుసు? అదీకాకుండా సావిత్రికి మద్యం అలవాటు చేసింది జెమిని గణేశనే అన్నట్లు చూపించారు. సావిత్రి కష్టాల్లో ఉన్నప్పుడు పేరున్న నటులు ఆమెను పట్టించుకోలేదని చూపించారు. అది తప్పు. సినిమా మొత్తంలో జెమిని గణేశన్‌ను ప్రతినాయకుడిగా చూపించారు. కానీ అందులో ఏమాత్రం నిజంలేదు. నాకు తెలిసినంతవరకు సావిత్రికి మా నాన్న అంటే అసలు ఇష్టం లేదు. చెప్పాలంటే.. ఓ సారి మేము సావిత్రి ఇంటికి వెళ్లినప్పుడు ఆమె మా మీదకు తన పెంపుడు కుక్కల్ని వదిలారు. ఓ మనిషి జీవితం గురించి మూడు గంటల్లో ఎలా చెప్పేస్తారు?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు కమల. కమల గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. దక్షిణాదిన 1990లో తొలి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీని సృష్టించిన వైద్యురాలు ఆమే కావడం విశేషం. 1993లో ఉత్తమ వైద్యురాలిగా అవార్డు కూడా అందుకున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com