మిరపకాయలు ఏరి పారేయకుండా తప్పకుండా తినాలి

కారం మీద ఎంత మమకారం లేకపోతే ‘మిర్చీమిర్చీ… మిర్చి’ అని పాటలు రాసుకుని మన ఘాటు ప్రేమని తెలియచేస్తాం. ఈ రోజు… ఆరోజు అని కాదు ఏడాదిపొడవునా మన వంటకాల్లో కారం ఉండాల్సిందే! అందులోనూ చలి చంపేసే ఈ వేళ మిర్చిబజ్జీలూ, చిల్లీచికెన్‌లు రారమ్మంటున్న సమయాన పచ్చిమిర్చి ముచ్చట్లు మరిన్ని..
**రోటిపచ్చళ్లతో మొదలుపెట్టి… చల్లమిరపతో ముడిపెట్టి.. కళ్లలో కాసిని నీళ్లు తిప్పేసే కారం లేనిదే మనకు ముద్ద దిగదు అనే మాట నిజం. నిజానికి మనకంటే కూడా మిర్చీలకూ… మెక్సికన్లకు ఉన్న అవినాభావ సంబంధం ఈనాటిది కాదు. వేల సంవత్సరాల నాటిది. కానీ అత్యధికంగా వాడటంలో మాత్రం చైనా తర్వాతి స్థానం మనదే. ప్రపంచవ్యాప్తంగా నాలుగువందల మిర్చీ రకాలు లభ్యమవుతున్నా.. మన వంటల్లో మాత్రం ఎనిమిది రకాల మిర్చీలకు ప్రాధాన్యత ఉంది. సిమ్లామిర్చీ, సీమమిర్చి, గుంటూరు మిర్చీ, బుట్టమిర్చి అంటూ మనం సందర్భానికి తగిన విధంగా వంటల్లో మిర్చీని వాడుతూనే ఉంటాం. కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఈశాన్య రాష్ట్రాల్లో వాడే మిర్చీ మనం తినే వాటికంటే మహాఘాటు. భూత్‌జలోకియా రకం అయితే ప్రపంచవ్యాప్తంగానే పేరొందింది. అలవాటు లేని వాళ్లు తింటే రెండు రోజుల పాటూ కోలుకోరు అంటే ఆశ్చర్యంగా ఉన్నా నిజం. అలాంటి మిర్చీని వాళ్లు చికెన్‌లోకి, వెదురు సూపుల్లోకి వేసుకుని తినేస్తుంటారు.
**ఆరోగ్య ప్రయోజనాలు
* మిర్చీ నుంచి అందే కెలొరీలు 0. అయితే వంటకు రుచిని అందించడం మాత్రమే మిర్చి చేసే పని అనుకుంటే పొరపడినట్టే! జీవక్రియల వేగాన్ని పందుకునేట్టుగా చేయడం మిర్చీ ప్రధాన బాధ్యత. మామూలు వంటకాలతో పోలిస్తే మిర్చీవేసి చేసిన వంటకాలు జీవక్రియల వేగాన్ని 50 శాతం పెంచుతాయి.
* యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే మిర్చీలని సహజసిద్ధ శుభ్రతా కారకాలు అనొచ్చు. ఎందుకంటే శరీరంలోని వ్యర్థాలని బయటకు నెట్టేసి ఎటువంటి అనారోగ్యాలు తలెత్తకుండా చేస్తాయి.
* శరీరంలో ఫైబ్రినాలిటిక్‌ అనే రసాయన చర్య జరగడానికి మిర్చీలు సహకరిస్తాయి. ఈ చర్య జరగడం వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టే పరిస్థితి రాదు. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.
* మిర్చీలోని ప్రధాన రసాయనం క్యాప్సియాసిన్‌ కారణంగానే మిర్చీకి ఆ కారపు రుచి వచ్చింది. మిర్చీ.. రుచిలో మంటెత్తించినా శరీర ఉష్ణోగ్రత సమంగా ఉండటానికి ఈ రసాయనమే కారణం. జీర్ణశక్తిని పెంచుతుంది. వీటిల్లోని ఎండార్ఫిన్లు… మనలోని ఉద్వేగాలని అదుపులో ఉంచుతాయి.
* కళ్లు, చర్మ ఆరోగ్యానికి మిర్చిలోని విటమిన్‌ సి, బీటాకెరొటిన్‌లు ఎంతగానో ఉపకరిస్తాయి. రక్తహీనత, ఆస్టియోపొరోసిస్‌ ఉన్నవారు తాజా పచిమిర్చిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com