మిస్టర్ ప్రెసిడెంట్…నా బెస్ట్ ఫ్రెండ్‌ను కాల్చి చంపారు. మీరేం చేస్తున్నారు?

తుపాకీ కాల్పుల్లో ప్రాణ స్నేహితుడిని కోల్పోయిన ఓ చిన్నారి.. పిల్లల రక్షణకు ఎలాంటి చర్యలు తీసకుంటారు అని ప్రశ్నిస్తూ ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఉత్తరం రాసింది. దానికి ట్రంప్ సమాధానం పంపించారు. సౌత్‌ కరొలినాలోని టౌన్‌విల్లే పట్టణంలో ఎవా ఓస్లేన్‌ అనే చిన్నారి.. ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడం చూసింది. ఆమె చదువుకునే పాఠశాల వద్ద 14ఏళ్ల అబ్బాయి జరిపిన కాల్పుల్లో ఎవా స్నేహితుడు జాకోబ్‌ సహా ముగ్గురు మరణించారు. పాఠశాల ఆటస్థలంలో ఆడుకుంటున్న జాకోబ్‌ తీవ్రంగా గాయపడి మూడు రోజుల తర్వాత మరణించాడు. ఈ ఘటన 2016 సెప్టెంబరులో జరిగింది. ఆ ఘటన తర్వాత ఎవా మానసికంగా బాగా కుంగిపోయింది. పాఠశాలకు కూడా పోలేని పరిస్థితి. వైద్యులు ఆమెకు ఇంటి వద్దే చదువు చెప్పించమని సూచించారు. స్నేహితుడి మరణాన్ని మర్చిపోలేని ఎవా 2017 ఆగస్టులో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు లేఖ రాసింది. ‘డియర్‌ మిస్టర్‌ ప్రెసిడెంట్‌, నా పేరు ఎవా రోస్‌ ఓస్లేన్‌. నాకు ఏడేళ్లు. రెండో తరగతి చదువుతున్నాను. గత ఏడాది టౌన్‌విల్లే ఎలిమెంటరీ స్కూల్‌ దగ్గర జరిగిన కాల్పుల్లో నా స్నేహితుడు జాకోబ్‌ ప్రాణాలు కోల్పోయాడు. అది చూసి నేను చాలా భయపడ్డాను. జాకోబ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఏదో ఒక రోజు మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నాకు తుపాకులు అంటే అసహ్యం. అది నా జీవితాన్ని నాశనం చేసింది. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ని కోల్పోయాను. మీరు చిన్నారులకు రక్షణ కల్పిస్తారా? మమ్మల్ని ఎలా కాపాడుతారు? దయచేసి ఇలాంటిది ఎప్పటికీ జరగనివ్వకండి’ అంటూ లేఖలో పేర్కొంది. ఎవా ఉత్తరాన్ని చూసి చలించిపోయిన అధ్యక్షుడు ట్రంప్‌ ఆమెకు సమాధానం పంపించారు. ‘డియర్‌ ఎవా, నీ స్నేహితుడు జాకోబ్‌ మరణం గురించి నేను, మిసెస్‌ ట్రంప్‌ చాలా బాధపడుతున్నాం. నీ గురించి, నీ కుటుంబం గురించి, జాకోబ్‌ కుటుంబం గురించి మేము ప్రార్థిస్తున్నాం. చిన్నారులు అన్ని విషయాలు నేర్చుకునేది, స్నేహితులతో కలిసి పెరిగేది పాఠశాలలోనే. ఇక్కడ భయం ఉండకూడదు. అమెరికాలో చిన్నారులు సురక్షితమైన వాతావరణంలో పెరిగేలా చేయడమే నా లక్ష్యం. అమెరికన్ల రక్షణ గురించి, దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి మరింత కృషి చేస్తాను. ఏదైమైనప్పటికీ.. నీ జీవితంలో ఎంతో మంది నిన్ను ప్రేమించేవారు ఉన్నారు. నీకు సపోర్ట్‌ చేసే వారు ఉన్నారు. నీ కలలు సాకారమైతే చూడాలనుకునే వారు ఉన్నారు.’ అని ట్రంప్‌ ఆ చిన్నారికి ఉత్తరం రాసి సంతకం చేసి పంపించారు. ట్రంప్‌ నుంచి వచ్చిన సమాధానం చూసి ఎవా చాలా సంతోష పడింది. కొద్ది రోజుల వరకు ఆనందపడింది. అయితే ఆ లేఖలో పిల్లల రక్షణ కోసం ఏయే చర్యలు తీసుకుంటారో చెప్పలేదు కదా అనే ప్రశ్న ఆ చిన్నారిలో మెదిలింది. వెంటనే ట్రంప్‌కు మరో ఉత్తరం రాసింది. పిల్లల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో తనకు తోచిన విధంగా ఐడియాలను రాసి మరో లేఖను పంపించింది. అమెరికాలో ఎక్కడ కాల్పుల ఘటనలు గురించి విన్నా ఎవా బాగా కంగారు పడిపోతోందట. దీంతో ఆమె తల్లి ఎవాకు అలాంటి వార్తలేవీ తెలియకుండా జాగ్రత్త పడుతుందట. అసలు టీవీ కూడా పెట్టడం మానేసిందట.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com