మీ ఫోన్ హ్యాక్ అయిందా?

ఫోన్‌ హ్యాక్ అయితే కనిపించే 7 సంకేతాలు , వాటికి పరిష్కారాలు ఏమిటో చూద్దాం.

1. ఫోన్ వేగం

మీ ఫోన్ సాధారణ స్థాయి కంటే తక్కువ వేగంతో పనిచేస్తోందంటే ఏదైన హానికరమైన వైరస్ అందులో చేరిందని అర్థం.

ఇలాంటి హానికమైన వైరస్‌లు ఫోన్ పనితీరును తగ్గించి, వినియోగదారులను ఇబ్బంది పెడతాయి.

కానీ, ఒక విషయం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. మీ ఫోన్‌లో ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్) ఎప్పుడూ అప్‌డేట్ అవుతుంటే కూడా స్పీడ్, పనితీరు తగ్గొచ్చు.

ఈ మధ్యనే యాపిల్ ఐఫోన్ పాత వెర్షన్ స్పీడ్ తగ్గిన విషయాన్ని ఒప్పుకుంది.

2. బాగా వేడెక్కిపోవడం

మీరిది గమనించే ఉంటారు. అప్పుడప్పుడు ఫోన్ చాలా అధికంగా వేడెక్కిపోతూ ఉంటుంది.

అమెరికాకు చెందిన ఇంటెల్ నిపుణులు “మీ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా మాల్‌వేర్ వైరస్ రన్ అవుతూ ఉండటం దీనికి కారణం కావొచ్చు” అని అంటున్నారు.

కొన్ని యాప్‌లను సరిగ్గా క్లోజ్ చేయకపోవడం కూడా ఫోన్ వేడెక్కడానికి కారణం కావొచ్చు.

3. బ్యాటరీ లైఫ్

ఫోన్ ఎక్కువగా వేడెక్కడం బ్యాటరీ మన్నిక మీద కూడా ప్రభావం చూపిస్తుంది.

దాంతో బ్యాటరీ తొందరగా చెడిపోతుంది.

కానీ ఇక్కడ అసలు కారణం సిస్టం అప్‌డేట్ అవుతుండడం.

మొబైల్ జోన్ వెబ్‌సైట్ ప్రకారం అప్‌డేట్లు కొత్తవి లేదా ముఖ్యమైనవి అయితే ఇబ్బంది ఏమీ ఉండదు.

4. అజ్ఞాత మెసేజ్‌లు

ఒక్కోసారి మీ ఫోన్ హ్యాక్ అయినట్టుగా మీకన్నా ముందు మీ కాంటాక్ట్‌లలో ఉన్నవారికి తెలిసిపోతుంది.

ఒక్కోసారి మీకు తెలియని నంబర్ల నుంచి మెసేజ్ రావడం లేదా మీ ఫోన్ నుంచి మీ ప్రమేయం లేకుండానే మెసేజ్‌లు వెళ్ళడం మీరు గమనించే ఉంటారు.

మీ మిత్రులకు, మీ కుటుంబ సభ్యులకు ఎంఎంఎస్ లు లేదా వాట్సాప్‌ ద్వారా మీకు తెలియకుండానే ఈ మెసేజ్‌లు వెళిపోతుంటాయి.

సందేహం లేదు, ఇది కచ్చితంగా హ్యాకర్ల పనే!

అలాంటప్పుడు, వీలైతే ఆ మెసేజ్ తెరచి చూడకుండా వెంటనే డిలీట్ కొట్టడం ఉత్తమం.

ఇలాంటి ఈమెయిల్స్ ద్వారా కూడా రావొచ్చు. వాటిని కూడా వెంటనే డిలీట్ చేసేయాలి.

వేర్వేరు డివైజ్‌లతో ఫోన్ కనెక్ట్ చేయడం వల్ల కూడా వైరస్ చేరవచ్చు.

5. విండో ఓపెన్ చెయ్యడం వలన

ఒక్కోసారి కొన్ని రకాల వైరస్‌లు హఠాత్తుగా మన ఫోన్‌లో తెరపైకి వస్తుంటాయి.

కొన్నిసార్లు రిక్వెస్ట్‌ల రూపంలో వస్తుంటాయి.

కొన్నిసార్లు వేరే విండో లేదా ట్యాబ్ ఓపెన్ అయి తద్వారా వైరస్ వచ్చి చేరుతుంటుంది. కంప్యూటర్ భాషలో వీటిని పాప్-అప్స్అంటారు.

“ఎలాగైతే కంప్యూటర్‌లో ఇంటర్నెట్ వల్ల కొత్త ట్యాబ్‌లు ఓపెన్ అవుతుంటాయో, అలాగే ఫోన్లోనూ ఈ ట్యాబ్‌లు ఓపెన్ అవుతూ ఉంటాయి. వీటి గురించి జాగ్రత్త వహిస్తూ, అలా వచ్చిన వెంటనే క్లోజ్ చేసేయడం బెటర్. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది” అని సైబర్ సెక్యూరిటీ నిపుణులు జోసెఫ్ స్టిన్‌బర్గ్ చెబుతున్నారు.

6. కొత్త యాప్స్

యాప్‌లను ఎక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు? అవి ఎలాంటి యాప్‌లు? అన్నది చాలా ముఖ్యం.

చాలాసార్లు మీ ఇంటర్నెట్ డాటా, మెమొరీ తొందరగా అయిపోతుంటాయి. ఎందుకంటే కొన్ని యాప్‌లు చాలా డాటాను వాడేసుకుంటూ ఉంటాయి. అలాగే ఎక్కువ మెమొరీని తీసుకుంటాయి.

“ఫోన్‌ను అప్‌డేట్ చేసుకుంటూ ఉండటం మంచిదే. కానీ ఈ యాప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సోర్స్ ఏమిటి? అన్నది గమనిస్తూ ఉండాలి. ఒరిజినల్ ప్రొవైడర్ దగ్గర నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడమే ఉత్తమం” అని నిపుణులు సూచిస్తున్నారు.

మీరు ఏ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవలనుకున్నా, మొదట దాని గురించి ఇంటర్నెట్‌లో వెతికి, రివ్యూలు చూడటం మేలు. లేదంటే ఈ యాప్‌ల ద్వారా హ్యాకర్లు మన ఫోన్‌ను హ్యాక్ చెయ్యడానికి ప్రయత్నించవచ్చు.

7. బ్యాక్‌గ్రౌండ్‌లో శబ్దాలు…

ఇంటర్నెట్‌లో ఏవైనా చూస్తున్నప్పుడు కొన్నిసార్లు వింత వింత శబ్దాలు వస్తుంటాయి. హఠాత్తుగా అవసరంలేని లేదా విభ్రాంతి కలిగించే అంశాలు కనిపిస్తుంటాయి.

దానర్థం దూరంగా ఎక్కడో కూర్చుని హ్యాకర్ మీ ఫోన్‌ను కంట్రోల్ చేస్తున్నాడని.

ఫలితంగా అర్థంపర్థం లేని విధంగా మీ ఫోన్‌లో శబ్దాలు, చిత్రాలు వస్తుంటాయి. మీకు అర్థం కానట్టు ఉంటుంది మీ ఫోన్ ప్రవర్తన.

అన్నిటికన్నా ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటంటే, మీరు ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా వింత శబ్దం వినిపిస్తే, దానర్థం మీ సంభాషణలను ఎవరో రికార్డ్ చేస్తున్నారని.

బీప్ గానీ, ఒకే రకమైన శబ్దం మళ్ళీ మళ్ళీ వినిపించడంగానీ జరిగితే అది కచ్చితంగా రికార్డ్ చేస్తున్న శబ్దమే!

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com