ముందు కేసు మాఫీ సంగతి సక్కా చూసుకో!

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పేరిట భారీ అవినీతి జరుగుతోందని, దానిని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెదేపా తెలంగాణ కార్యాధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఎవరితోనైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. శుక్రవారం ఎన్టీఆర్‌భవన్‌లో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల కోసం పిలిచిన టెండర్లను అధికారికంగా వెల్లడించక ముందే ఎవరికి ఇవ్వనున్నారో చెప్పగలమని చెప్పారు. ఈ ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిపై అవసరమైతే ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. గత వై.ఎస్‌. ప్రభుత్వం మాదిరిగానే తెరాస ప్రభుత్వం కూడా ధనయజ్ఞాన్ని కొనసాగిస్తోందని ఆరోపించారు. అప్పట్లో వై.ఎస్‌.కు ఆత్మలా వ్యవహరించిన కేవీపీ రామచంద్రరావు ఇప్పుడు కేసీఆర్‌కు కూడా ఆంతరంగికుడిగా మారారని, ఆయన కనుసన్నల్లోనే తెలంగాణ కాంట్రాక్టులను ఆంధ్రా కంపెనీలకు కేటాయిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు జలదృశ్యం పేరిట వేసిన ప్రశ్నలకు కేసీఆర్‌, హరీశ్‌రావులు సమాధానమివ్వకుండా తెలివిగా ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌తో చెప్పించారని ఆరోపించారు. తెలంగాణకు ఎనలేని నష్టం చేసిన వై.ఎస్‌.ను పొగుడుతూ ప్రాజెక్టుల్లో అవినీతిపై ప్రశ్నించిన కోదండరామ్‌ తప్పు చేశారంటూ విమర్శిస్తున్న విద్యాసాగర్‌రావు నిబద్ధతపై తమకు అనుమానం కలుగుతోందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి, ప్రభుత్వ ప్రతినిధులలో ఎవరితోనైనా బహిరంగ చర్చకు తాము సిద్ధమని రేవంత్‌రెడ్డి తెలిపారు. తెరాసలో ఇటీవల చేరిన ఇతర పార్టీ ఎంపీ కంపెనీకి ప్రాజెక్టు పనులు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ఇవ్వలేదని చెబితే ఆ కంపెనీకి ప్రాజెక్టు పనుల్లో ఎంత విలువైన కాంట్రాక్టు ఇచ్చారో బయటపెడతామన్నారు. అవినీతిలో కాంగ్రెస్‌, తెరాసలు పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. పార్టీ నేతలు బొల్లం మల్లయ్య యాదవ్‌, మేడిపల్లి సత్యంలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై తెరాస, కాంగ్రెస్‌ పార్టీలు అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని మోసగిస్తున్నాయని తెలంగాణ రైతు సంఘం విమర్శించింది. ప్రాజెక్టుల నిర్మాణంలో గతంలో అవకతవకలు జరిగాయని తెరాస, తమ హయాంలోనే 94 లక్షల ఎకరాలకు ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి వసతి కల్పించామని కాంగ్రెస్‌ పోటాపోటీగా దృశ్యరూప ప్రదర్శనలిచ్చాయన్నారు. ఇరుపార్టీల దృశ్యరూప ప్రదర్శనలకు ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్‌ అంచనాలే కీలకంగా మారాయన్నారు. గతంలో వ్యాప్కోస్‌ అంచనాలను నమ్మిన కాంగ్రెస్సే ఇప్పుడు ఆ సంస్థపై కేసు వేస్తానంటోందని రైతుసంఘం విమర్శించింది. 2005 నుంచి నేటికీ పనులు కాకపోవడానికి కారణమైన పాలకులే తాము సాగునీటి వనరులపై దృష్టిపెట్టామని పోటీలు పడిచెప్పడం దురదృష్టకరమని రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పి.జంగారెడ్డి, బి.చంద్రారెడ్డి, ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com