మైలవరంలో మంత్రి ఉమా దూకుడుకు ముకుతాడు-TNI ప్రత్యేకం

రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి తరువాత కీలకపాత్ర పోషిస్తున్న జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీను ఎదుర్కోబోతున్నారు. 2014లో నందిగామ నుండి వలస వచ్చి కేవలం ఏడువేల ఓట్ల మెజారిటీతో ఉమా గెలుపొందారు. అప్పట్లో స్వతంత్ర అభ్యర్ధిగా నిలబడిన బొమ్మసాని సుబ్బారావు వైకాపాకు చెందిన దాదాపు పన్నెండు వేల ఓట్లు చీల్చడంతో దేవినేని ఉమా విజయం సాధించారని ఆ నియోజకవర్గంలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పర్యాయం మంత్రి వ్యవహార శైలి పట్ల స్థానిక తెలుగుదేశం పార్టీలోనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
*** అధికార దర్పం, అహంభావం-ఇవే శత్రువులు
దేవినేని ఉమామహేశ్వరరావు శాసనసభ్యుడిగానూ, ప్రతిపక్షంలోనూ ఉన్న సమయంలో చాలా సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే వారు. తెదేపా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ పార్టీకి బలాన్ని చేకూర్చారు. మంత్రి అయిన అనంతరం ఉమా వ్యవహార శైలిలో చాలా మార్పు వచ్చింది. ఆయన పార్టీ కార్యకర్తలకే కాకుండా, నాయకులకు కూడా అందుబాటులో ఉండడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో మంత్రి ప్రవర్తన ఆయన మాట్లాడే తీరు దురుసుగా ఉంటోందని ప్రజల్లో అభిప్రాయం వక్తమవుతోంది.
*** దూకుడు పెంచిన వైకాపా
మైలవరం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో మంత్రి ఉమా దూకుడుకు కళ్ళెం వేయాలనీ వైకాపా ఇప్పటి నుండే పావులు కదుపుతోంది. పొరుగు నియోజకవర్గమైన నందిగామ నుండి ఉమా లాగానే ఒక గట్టి అభ్యర్ధిని దిగుమతి చేసుకుంది. ఉమా రాజకీయ గురువు, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు, బడా వ్యాపారవేత్త వసంత కృష్ణప్రసాద్ ను వైకాపా రంగంలోకి దింపింది. కృష్ణప్రసాద్ తో పాటు ఆయన తండ్రి నాగేశ్వరరావు కూడా ఇప్పటి నుండే నియోజకవర్గంలో తమ స్థానాన్ని పదిలం చేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మైలవరం నియోజకవర్గంలో వైకాపాను పెంచు పోషించిన జోగి రమేష్ ను బుజ్జగించి తమకు పోటీలో లేకుండా చేసుకున్నారు.
*** ఉమా వ్యతిరేక శక్తులన్నీ ఏకం!?
దేవినేని ఉమా వ్యవహార శైలి పట్ల వ్యతిరేకంగా ఉన్న తెలుగుదేశం పార్టీలోని అసంతృప్తి వాదులను తమవైపు తిప్పుకునే విధంగా వసంత వర్గం పావులు కదుపుతోంది. ఉమాతో సమానంగా ధనబలాన్ని ప్రయోగించడానికి వైకాపా సిద్దమవుతోంది.
*** కోమటి వర్గం సహకరిస్తుందా?
వాస్తవానికి మైలవరం నియోజకవర్గంలో ఉమా ప్రవేశానికి ముందు కోమటి సుధాకరరావు హవా కొనసాగింది. ఉమా ప్రవేశంతో సుధాకరరావు వర్గం స్తబ్దుగా ఉంటోంది. వచ్చే ఎన్నికల్లో సుధాకరరావు కూడా కీలక పాత్ర పోషించనున్నారు. మరొకపక్క సుధాకరరావు మేనల్లుడు అప్పసాని సందీప్(నన్నూ) కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత సంప్రదాయమైన ఓటింగ్ ఈ నియోజకవర్గంలో ఉంది.
*** లగడపాటి కీలక భూమిక?
రాజకీయాల నుంచి విరమించుకున్నాను అని ప్రకటిస్తున్న విజయవాడ పార్లమెంట్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇటీవల మధ్యాహ్నం నందిగామలో వసంత నాగేశ్వరరావు ఇంట్లో భోజనం చేసి సాయంత్రం అమరావతిలో చంద్రబాబును కలవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం లగడపాటి వైకాపాతోనూ, తెదేపాతోనూ సమాన దూరంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో లగడపాటి పోషించే పాత్ర కూడా మైలవరం ఎన్నికల ఫలితం పై ఉంటుంది.

మైలవరం నియోజకవర్గం రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ మొత్తం 2.35 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మైలవరం, రెడ్డిగూడెం, జీ.కొండూరు, ఇబ్రహింపట్నం మండలాలతో పాటు విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి వంటి ఐదు పెద్ద గ్రామాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. మొత్తం మీద మైలవరం నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలోనే ఆసక్తి కలిగే విధంగా పోటీ జరుగనుంది.—కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com