మొత్తానికి కలిశారు

ప్రపంచం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రోజురానే వచ్చింది. అమెరికా, ఉత్తరకొరియాల మధ్య చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇరు దేశాధ్యక్షుల మధ్య కీలక సమావేశం జరిగింది. అత్యంత అపురూప, అరుదైన ఈ భేటీకి సింగపూర్‌లోని కేపెల్లా హోటల్‌ వేదికగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌లు దాదాపు 38 నిమిషాల పాటు ముఖాముఖి సమావేశమయ్యారు. అనంతరం తమ దౌత్యాధికారులతో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కొరియా ద్వీపకల్పంలో అణునిరాయుధీకరణ, శాంతి స్థాపనే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణకు అంగీకరిస్తే ఉత్తరకొరియా భద్రతకు హామీ ఇస్తామని అమెరికా తెలిపింది. ఈ భేటీ సానుకూల ఫలితాలు ఇస్తుందని ఇరు దేశాధినేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. కిమ్‌తో జరిగిన ఈ భేటీ ‘వెరీ వెరీ గుడ్‌’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ సమావేశం పూర్తిస్థాయిలో విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘చాలా సానుకూలంగా ఈ భేటీ జరిగింది. అందరూ ఊహించిన దానికంటే అద్భుతంగా ఈ సమావేశం జరిగిందని నేను అనుకుంటున్నా. ఈ సమావేశం ద్వారా చాలా పురోగతి చోటుచేసుకుంది.’ అని ట్రంప్‌ అన్నారు. శాంతి స్థాపనకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నట్లు కిమ్‌ పేర్కొన్నారు. ఎన్నో అడ్డంకుల తర్వాత ఈ సింగపూర్‌ భేటీ సాకారమైందని.. ఎన్నో సంశయాలు, ఊహాజనితాలను ఈ భేటీతో అధిగమించామని పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com