మోక్షం కోసం ఆత్మహత్య చేసుకుంటూ రోటీలు కూడా తిన్నారు

దేశ రాజధాని దిల్లీలో భాటియా కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పలు నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనకు ముందు చివరి నిమిషంలో ఏం జరిగిందో.. వారిని ఎవరు కలిశారో అనే విషయాలపై పోలీసులు ఆరా తీసున్నారు. మృతి చెందిన ఈ 11 మందిని ఓ డెలివరీ బాయ్‌ చివరిసారిగా చూసినట్లు పోలీసులు భావిస్తున్నారు. శనివారం రాత్రి మృతి చెందక ముందు వారంతా రోటీలు తిన్నారు. అయితే వారు ఈ రోటీలను బయట నుంచి ఆర్డర్‌ చేయించుకొని తెప్పించుకున్నారు. 20 రోటీలను రిషి అనే డెలివరీ బాయ్‌ వారికి అందించాడు. వారిని కలిసిన చివరి వ్యక్తి ఇతనే అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి డెలివరీ బాయ్‌ని పిలిచి విచారించారు. అయితే తాను రోటీలను డెలివరీ చేసినప్పుడు.. వారంతా మామూలుగానే ఉన్నారని.. ఎలాంటి ఆందోళనతో ఉన్నట్లు కనిపించలేదని రిషి తెలిపాడు. తాను 20 రోటీలను అందించానని.. అయితే వారు ఎలాంటి కర్రీని ఆర్డర్‌ చేయలేదని చెప్పాడు. రోటీలకుగాను తనకు రూ.200 చెల్లించారని తెలిపాడు. రోటీల కోసం రాత్రి 10.30కు ఆర్డర్‌ చేస్తే తాను 10.45 నిమిషాలకు డెలివరీ చేశానని చెప్పాడు. అయితే వారిలో కొందరే ఈ రోటీలను తిన్నట్లు పోస్టుమార్టం నివేదిక ద్వారా తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఆ రాత్రే ఆ ఇంట్లో 11 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. ఆ ఇంట్లో దొరికిన పత్రాలు, డైరీల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. మూఢ నమ్మకాలతో మోక్షం కోసం వీరంతా సామూహిక ఆత్మహత్యలకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com