మోసం చేసే ఎన్నారై శాడిస్ట్ భర్తల ఆస్తులు జప్తు

న్యాయస్థానాల్లో విచారణలకు హాజరుకాని ఎన్నారై భర్తలపై కఠిన చర్యలు తీసుకునే అంశాన్ని కేంద్రప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిలో భాగంగా ఉమ్మడి కుటుంబ ఆస్తుల్లో సదరు ఎన్నారై భర్త వాటాను జప్తు చేయాలనే ప్రతిపాదనను సిద్ధం చేస్తోంది. తద్వార కోర్టు సమన్లకు స్పందించని వారిని దారిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.ఎన్నారై యువకులు ఆకర్షణీయమైన జీవన శైలిని ఎరగా వేసి భారత్‌లోని అమ్మాయిలను పెళ్లి చేసుకొని తర్వాత మొహం చాటేస్తున్న కేసుల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ముఖ్యంగా పంజాబ్‌ వంటి రాష్ట్రాల్లో ఇటువంటి కేసులు ఎక్కువ. ఇటువంటి సందర్భాల్లో బాధిత మహిళలకు న్యాయం చేకూర్చేలా తీసుకోవాల్సిన చర్యలను కేంద్ర మంత్రుల బృందం సిఫార్సు చేసింది.ఈ చర్యల్లో భాగంగా విదేశీ వ్యవహారాల శాఖ ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తుంది. ఎన్నారై భర్తలు సమాధానమివ్వని కోర్టు సమన్లను దీనిలో ఉంచుతారు. ఒక సారి ఈ వెబ్‌సైట్‌లో నోటీసులను ఉంచితే సదరు ఎన్నారై భర్తలకు సమన్లు అందినట్లేనని ప్రభుత్వం పరిగణిస్తుంది. వీటికి సమాధానం ఇవ్వని వారిపై చర్యలను ప్రారంభిస్తుంది. తరచూ దేశాలు మారుతూ ఆచుకీ దొరకని వారితో ఇలానే వ్యవహరించాలని భావిస్తోంది. సమన్లను పట్టించుకోని ఎన్నరై భర్తల పాస్‌పోర్టులను కూడా ప్రభుత్వం రద్దు చేస్తుంది. దీంతోపాటు ఎన్నారైల వివాహాలను 48 గంటల్లోపు కచ్చితంగా నమోదు చేయించే ప్రక్రియను మరింత వేగవంతం చేయనుంది.ఈ సిఫార్సులను చేసిన మంత్రుల బృందంలో సుష్మాస్వరాజ్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌, మేనకా గాంధీ, రవిశంకర్‌ ప్రసాద్‌ ఉన్నారు. ఈ సంఘానికి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షత వహించారు. ఈ సంఘం చేసిన సిఫార్సులు న్యాయ సమీక్షను ముగించుకొన్న తర్వాత మంత్రిమండలి ఆమోదానికి రానున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com