యుక్త వయసులో జుట్టు నెరవడం పోషక లోపం కావచ్చు

తల్లో ఒక్క తెల్ల వెంట్రుక కనిపిస్తే.. అమ్మో! ఇంకేమైనా ఉందా… అదేపనిగా అద్దంముందు నిల్చుని తలంతా వెతికేసుకుంటాం. ఇంకెక్కడయినా నెరిసిందేమోనని భయపడతాం. ఈ రోజుల్లో పాతికేళ్లు కూడా నిండని చాలామంది అమ్మాయిలు ఎదుర్కొంటోన్న సమస్య ఇది. దీని నివారించడం కూడా మన చేతుల్లోనే ఉంది. అదెలా అంటారా?
ఒకప్పుడు వయసు మీదపడుతుందని చెప్పడానికి తలనెరుపు ఓ సూచిక. ఇప్పుడు కాలేజీ అమ్మాయిల్లోనూ ఇది సాధారణంగా కనిపిస్తోంది. దాంతో నెరిసిన జుట్టును నల్లగా మార్చేసుకునేందుకు ఎవరేం చెప్పినా ఆ ప్రయోగాలు చేస్తారు. దాంతో మళ్లీ కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటారు. చివరకు ఆత్మవిశ్వాసం పోయి, కనిపించిన హెయిర్‌ డైలను ఆశ్రయించి.. ఇతర దుష్ప్రభావాలకీ లోనవుతారు. కానీ అసలు ఆ సమస్యకు కారణం తెలుసుకునే ప్రయత్నం చేయరు. వైద్యుల్నీ సంప్రదించరు. అదే పెద్ద పొరపాటు. దీనికీ రకరకాల కారణాలుంటాయి.

జుట్టు తెల్లబడటానికి ప్రథమ కారణం మెలనిన్‌ అనే పిగ్మెంట్‌ తక్కువగా ఉండటం. ఆ తరువాత వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య రావొచ్చు. పేనుకొరుకుడూ, విటమిన్‌ బి12 లోపం, థైరాయిడ్‌ సమస్య ఉన్నా జుట్టు త్వరగా తెల్లబడుతుంది. దాంతోపాటు బొల్లి, ల్యూకోడెర్మా, క్షయ, న్యూరో పైథోమ్యాట్రిసిస్‌ అనే సమస్యలూ దానికి దారితీస్తాయి. ఒత్తిడి వల్ల మెలనిన్‌ ఉత్పత్తి తక్కువ కావడం, మానసిక సమస్యలూ, ధూమపానం (పాసివ్‌ స్మోకింగ్‌), ఎండలో ఎక్కువగా తిరిగినా, రేడియేషన్‌ చికిత్సలు చేయించుకున్నప్పుడూ, బీచ్‌కి నిత్యం వెళ్లినా, ఫ్యాషన్‌ కోసం డైలు వేసుకోవడం, సింథటిక్‌ షాంపూలు వాడటం, సబ్బుతో తలస్నానం చేయడం… ఇతర కారణాలు. ఆహారపరంగా చెప్పాలంటే సోడాలూ, శీతలపానీయాలు అధికంగా తీసుకోవడం, తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, పిండిపదార్థాలు తినడం, చాక్లెట్లూ, క్యాండీలూ, జంక్‌ఫుడ్‌ తినడం వల్లా ఈ సమస్య వస్తుంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారుతోందంటే పై వాటిల్లో ఏ కారణమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తదనుగుణంగా జాగ్రత్తలు లేదా నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

చికిత్సలున్నాయా… ! లేవనే చెప్పొచ్చు. ఒకవిధంగా అసంభవమే. సమస్యను నివారించడమే అసలైన పరిష్కారం. ఒకవేళ ఆ ఛాయలు కనిపించినా.. తగిన నియమాలతో అడ్డుకట్ట వేసేలా చూసుకోవాలి. అలా కాకుండా వదిలేస్తే ఇరవై దాటకముందే అరవైల్లోకి వెళ్లిపోయినట్టు కనిపిస్తారు. కాబట్టి ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.
ఆహారంలో మార్పులంటే..: ముందుగా విటమిన్‌ ఎ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. ఆకుకూరలూ, పసుపు రంగు పండ్లకు ప్రాధాన్యమివ్వాలి. విటమిన్‌ బి మాడుపై తగిన నూనెల్ని ఉత్పత్తి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి పెరుగూ, ఆకుపచ్చని కాయగూరలూ, టొమాటోలూ, క్యాలీఫ్లవర్‌, గింజలూ, అరటి వంటి వాటిల్లో ఇవి ఎక్కువగా దొరుకుతాయి. అలానే ఇనుమూ, జింక్‌, రాగి వంటి ఖనిజాల లోపం లేకుండా జాగ్రత్తపడాలి. ఇవి చికెన్‌, మాంసం, గుడ్లూ, ఆకుకూరలూ, ఆప్రీకాట్‌, పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలూ, సముద్ర ఆహారంలో ఎక్కువగా ఉంటాయి. అలానే జుట్టు ఎదుగుదలలోనే కాదు, తెల్లబడకుండా ఉండాలంటే మాంసకృత్తులూ ముఖ్యమే. తృణధాన్యాలూ, సోయా, గింజలూ, మాంసం వంటివి తీసుకోవాలి.

జీవనశైలిలో: ఒత్తిడితో సతమతమవుతున్నప్పుడు జుట్టు చాలా త్వరగా తెల్లబడుతుంది. అందుకే నిత్యం వ్యాయామాలూ, రెండు పూటలా ధ్యానం చేయాలి. నాడీ సంబంధ సమస్యలూ, మానసిక సమస్యలూ, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లూ, సోరియాసిస్‌ వంటివి ఉన్నా వెంటనే చికిత్స తీసుకోవాలి. గాఢత తక్కువగా ఉన్న షాంపూలు వాడాలి. రోడ్డుల పక్కన ఆహారం, జంక్‌ఫుడ్‌ జోలికి వెళ్లకపోవడం మంచిది. సమయానికి ఆహారం తీసుకుంటూ నిద్రకు వేళలు పాటించాలి. అలానే ఇనుము, బీ12, లోపాలుంటే వైద్యులు మాత్రల్ని సూచిస్తారు. వంశపారంపర్యంగా ఉంటే మాత్రం ఏం చేయలేం.

రంగులు వాడొచ్చా…చిన్న వయసు వారు వీటికి దూరంగా ఉంటేనే మంచిది. అదేపనిగా వాడటం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం లేకపోలేదు. వీటిలోని అమోనియా, పీపీడీ వల్ల అలర్జీలు రావొచ్చు. కొన్ని సార్లు ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. అలానే సింథటిక్‌ డైలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీలున్నంత వరకూ ఆర్గానిక్‌ రంగులు ఎంచుకోవాలి. అందుకే జుట్టు నెరుస్తున్న ఛాయలు కనిపించినప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకుంటే వీటి అవసరం పెద్దగా పడదు. అయితే ఇంట్లో సహజంగా చేసుకునే చికిత్సలు కొన్ని ఉంటాయి. అవేంటంటే…
* కప్పు కొబ్బరినూనెలో గుప్పెడు కరివేపాకు వేసి బాగా మరిగించాలి. చల్లారాక వడకట్టి సీసాలో భద్రపరిచి రాసుకుంటూ ఉండాలి. అలాగే పావుకప్పు కొబ్బరినూనెలో రెండు చెంచాల ఉసిరిపొడీ, కాస్త మెంతి పొడీ కలిసి తలకు పెట్టుకుని అరగంటయ్యాక కడిగేసుకోవాలి.
* నువ్వుల నూనె, క్యారెట్‌ రసం సమపాళ్లలో తీసుకుని అందులో చెంచా మెంతిపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి తలకు మర్దన చేసుకోవాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. ఇది హెయిర్‌ టానిక్‌లా పనిచేస్తుంది. అలానే ఒక గిన్నెలో బ్లాక్‌టీ ఆకులూ, కప్పు నీళ్లూ, కప్పు టీ డికాక్షన్‌, హెన్నా పొడీ, గుంటగలగరాకు పొడి వేసి రాత్రంతా అలా ఉంచాలి. మర్నాడు అన్నింటినీ బాగా కలిపి తలకు పూతలా వేసుకుని రెండు గంటలయ్యాక కడిగేస్తే సరిపోతుంది.
* కప్పు కొబ్బరినూనెలో గుంటగలగరాకు పొడి వేసి బాగా వేడి చేయాలి. చల్లారాక ఆ నూనెను నిల్వ చేసుకుని తలస్నానం చేయడానికి ముందు రోజు రాత్రి రాసుకోవాలి. ఇలా నిత్యం చేస్తుంటే జుట్టు తెల్లబడకుండా వాయిదా వేయడం సాధ్యం అవుతుంది. ఈ నూనె సహజ రంగులా పనిచేస్తుంది. దీంతోపాటు రెండు చెంచాల చొప్పున హెన్నా, ఉసిరి పొడీ తీసుకుని అందులో తెల్ల సొన కలిపి పెట్టుకోవచ్చు. హెన్నా, గుంటగలగరాకు పొడీ, గుడ్డులోని తెల్లసొన, ఉసిరి పొడి కలిపి కూడా వాడుకోవచ్చు. ఇలా వారానికోసారి పూతలా వేసుకుంటూ ఉండాలి. ఈ పూతలు పెట్టుకోవడంతోపాటు సహజ కండిషనర్లకీ ప్రాధాన్యమివ్వాలి. లేదంటే ఫలితం అంతగా
ఉండకపోవచ్చు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com