రంజాన్ రుచులు

ముస్లింలు అంత్యత పవిత్రంగా భావించే మాసాల్లో రంజాన్‌ ఒకటి. నెలంతా నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఉపవాసదీక్షలను పాటిస్తారు. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికత తొణకిసలాడుతుంటుంది. తెల్లవారు జాము నుంచి సూర్యాస్తమయం వరకు పచ్చి మంచినీరు కూడా తాగకుండా దీక్షలు పాటించే ముస్లింలు, సాయంత్రం వేళ ఇఫ్తార్‌ అనంతరం బలవర్ధకమైన ఆహారాన్ని, విభిన్న రకాల రుచులను ఆస్వాదిస్తుంటారు. అందుకే రంజాన్‌ మాసం అనగానే ఉపవాసాలు.. ప్రార్థనలే కాదు, నోరూరించే పసందైన వంటకాలు గుర్తుకొస్తాయి. వాటికి ప్రతి ఒక్కరూ గులామ్‌ కావాల్సిందే.
***మాంసాహార వంటకాలు అనేకం..
చికెన్‌ స్టిక్స్‌ ఎముకలు లేని మెత్తటి కోడి మాంసాన్ని ఒక పుల్లకు చుడతారు. మాంసానికి సన్నటి సేమియాలు, మొక్కజొన్న పిండి, పాప్‌కార్న్‌, అటుకులు, క్యాప్సికమ్‌, ఉల్లిపాయలు ఇలా వివిధ రకాలుగా ఒక్కో దానికి ఒక్కో వెరైటీ అద్దుతున్నారు. అవి మాంసానికి అతుక్కుపోతాయి. మనకు ఏది కావాలంటే వాటిని నూనెలో వేయించి ఇస్తారు. కరకరలాడుతూ..ఎంతో కమ్మగా ఉంటాయి.
* పొట్టేలు, కోడి మాంసంతో శనగపిండిని, మసాలాలు, కొత్తిమీర, పొదీనా కలిపి వడలు, లడ్బూలు, సమోసాలు కూడా తయారు చేసి అందిస్తున్నారు.
* బ్రెడ్‌ ముక్కల మధ్యలో కోడిగుడ్డు, మాంసం ముక్కలు వేసి శనగపిండి పూసి, నూనెలో వేయిస్తున్నారు.
**మటన్‌ బైదా రోటి, చికెన్‌ బైదా రోటి
పొట్టేలు మాంసాన్ని చిన్న, చిన్న ముక్కలుగా కైైమా చేసుకొని, మసాలా దినుసులను బాగా కలిపి వండుతారు. అనంతరం మైదా, గోధుమ పిండితో కలిపిన రోటీని తయారు చేసి పెనం మీద వేస్తారు. రోటీ మధ్యలో మాంసం, దానిపై కోడిగుడ్డు వేసి, రోటిని నాలుగువైపులా చుట్టేస్తారు. పెనంపై నూనె వేసి వేయిస్తారు. ఇదే విధంగా కోడిమాంసంతోను తయారు చేస్తారు.
**మటన్‌ రోల్‌..
పొట్టేలు మాంసాన్ని చిన్న, చిన్న ముక్కలుగా చేసి, వాటిని ఉడికించి, వివిధ రకాల మాసాలాలు కలిపి వేయిస్తారు. రోటీలో పొట్టేలు మాంసం ముక్కలను వేసి, రోల్‌ చేసి, దాన్ని నూనెలో వేయిస్తారు.
**చికెన్‌ రోల్‌..
కోడిమాంసాన్ని చిన్న, చిన్న ముక్కలుగా చేసి, వాటిని ఉడికించి, మసాలాలు జోడించి వేయిస్తారు. అనంతరం రోటిలో చుట్టేసి నూనెలో వేపుతారు.
**నోరూరించే బిర్యానీలు..
రంజాన్‌ మాసంలో ఎక్కువగా తినే వంటకాల్లో బిర్యానీ ఒకటి. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా వంటవాళ్లను తీసుకొచ్చి ఇక్కడ బిర్యానీలు తయారు చేయిస్తున్నారు. చికెన్‌ బిర్యానీ, మటన్‌ బిర్యానీ, దమ్‌ బిర్యానీ.. ఇలా విభిన్న రకాలు నగరవాసుల జిహ్వచాపల్యాన్ని తీరుస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా బిర్యానీ ఆరంగించేందుకు వస్తున్నారంటే.. దీనికి ఎంత డిమాండ్‌ ఉందో అర్థం అవుతుంది. ముస్లింలతో పాటు ముస్లిమేతరులు కూడా పార్శిల్స్‌ను ఎక్కువగా తీసుకువెళ్తున్నారు.
**పానీయాలు అనేకం..
శక్తి కోసం తాగే పానీయాలు కూడా రంజాన్‌లో ప్రత్యేకంగా లభిస్తుంటాయి. వాటిలో రోజ్‌ మిల్క్‌, రోజ్‌ సేమియా మిల్క్‌, చాకొలేట్‌ మిల్క్‌షేక్‌, స్ట్రాబెరీ మిల్క్‌షేక్‌, బటర్‌ స్కాచ్‌ మిల్క్‌షేక్‌, బాదమ్‌ మిల్క్‌షేక్‌ ఇలా.. ఎన్నో రకాలు నగరవాసుల కోసం సిద్ధంగా ఉన్నాయి. పానీయాలతో పాటు ఐస్‌క్రీమ్‌లు కూడా అనేక ఫ్లేవర్‌లు, వివిధ రకాల కాంబినేషన్లలో లభ్యమవుతున్నాయి.
**రోటీలు కూడా సిద్ధం..
ఈ మాసంలో ఎక్కువగా అమ్ముడయ్యే వాటిలో రోటీలు కూడా ఉంటాయి. మైదా, గోధుమపిండి కలిపి తయారు చేసే రుమాలి రోటీలకు ఆదరణ ఎక్కువ. పిండిని బాగా కలిపి చిన్న, చిన్న ఉండలు చేసి, వాటిని అట్లకాడతో పల్చటి రోటీని చేస్తారు. పొయ్యిపై తిరగేసి పెట్టిన మూకుడుపై రోటీ వేస్తారు. కాలిన తర్వాత నాలుగైదు మడతలు వేసి వడ్డిస్తారు. రుమాలి రోటీలో పాయ, చికెన్‌ దమ్‌ ముక్కలు, షేర్వా నంజుకొని తింటారు. రుమాలి రోటీతో పాటు తందూరి రోటిని కూడా ఎక్కువగా తింటుంటారు.
**కిళ్లీ.. 50 రకాలు
భోజనం అనంతరం కిళ్లీ తింటే త్వరగా అరుగుతుందని చెబుతుంటారు. దాని కోసమే తినేవారు కొందరైతే.. రుచి కోసం.. తినేవారు మరికొందరు ఉన్నారు. మనకు నాలుగైదు రకాల కిళ్లీల గురించి తెలుసు. కానీ 50 రకాలకు పైగా కిళ్లీలను అందించే స్టాల్స్‌ కూడా పలు చోట్ల ఏర్పాటు చేశారు. విజయవాడ పాతబస్తీలో ఏర్పాటు చేసిన ఒక స్టాల్‌లో ప్రత్యేకంగా వాటిని తయారు చేసేవారిని తీసుకొచ్చి, ప్రజలకు వివిధ రకాల కిళ్లీలను రుచి చూపిస్తున్నారు. ఒక్క రంజాన్‌ మాసంలోనే మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వ్యాపారం జరగుతుందంటే ఎంత డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు.
**హలీంకు.. గులామ్‌..
రంజాన్‌ మాసంలో ప్రతి ఒక్కరి నోటి నుంచి పలికే పేరు.. హలీం. ముస్లింలతో పాటు ముస్లిమేతరులు కూడా దీనిని ఇష్టపడతారు. గతంలో అక్కడక్కడ మాత్రమే కనిపించే హలీమ్‌ బట్టీలు.. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. పొట్టేలు మాంసం, గోధుమలు, పప్పుదినుసులు, మసాలాలను నిర్ణీత పాళ్లల్లో కలిపి రోజంతా ప్రత్యేకమైన తందూరీ పొయ్యిపై ఉడికించి తయారు చేస్తారు. పొట్టేలు మాంసం, మసాలా దినుసులను కలిపి నీటిలో బాగా ఉడికిస్తారు. తర్వాత ఉడికిన మాంసాన్ని వేరు చేసి, మూడు గంటల పాటు నానబెట్టిన గోధుమ రవ్వను ఉడికిస్తారు. మాంసాన్ని బాగా మెత్తగా చేసి, పప్పుదినుసులతో పాటు రవ్వలో వేసి మెత్తగా రుబ్బి హలీం తయారు చేస్తారు. దీనికి ఆరేడు గంటల సమయం పడుతుంది. తయారైన వంటకాన్ని ప్లేట్లలో వేసి, దానిపై కొత్తిమీర, ఉల్లిపాయలు, జీడిపప్పు, నెయ్యి, ఉల్లిపాయ ముక్కలతో అందంగా అలంకరించి వడ్డిస్తారు. ప్లేట్‌ రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. కోడి మాంసంతో తయారు చేసే దాన్ని హరీస్‌ అంటారు. కోడి మాంసంతో పాటు గోధుమలు, పాలు, నెయ్యి, వెల్లుల్లి, సాజీరా, లవంగాలు, బాదం, పిస్తా, జీడిపప్పు, మసాలాలు ఉపయోగిస్తారు. దీనిని ప్లేటు రూ.80 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు.
**తీపి వంటకాలు ఎన్నో..
ఎక్కువగా రంజాన్‌ మాసంలోనే కనిపించే కొన్ని రకాల తీపి వంటకాలకు, చాలా మంది అభిమానులు ఉన్నారు. వాటిలో కుబానీకా మీఠా ఒకటి. కుబానీ పళ్లను ఒక రోజు ముందు నీళ్లల్లో బాగా నానబెట్టి, పండ్లలోని గింజలను వేరుచేస్తారు. వీటిని పగులగొట్టి అందులో బాదం చల్లుతారు. నానబెట్టిన నీటిలోనే పండ్లను ఉడకబెడతారు. తరవాత అందులో పంచదార కలిపి పాకం వచ్చే వరకు ఉంచుతారు. పాకం తయారైన తరువాత చల్లబరిచి అందులో ఐస్‌ క్రీమ్‌, జీడిపప్పు, బర్ఫీవేసి చల్లచల్లగా అందిస్తారు. సొరకాయతో ప్రత్యేకంగా తయరు చేసే పాయసం ఎంతో రుచికరంగా ఉంటుంది. వీటితో పాటు బ్రెడ్‌, క్యారెట్లతో తయారు చేసే హల్వాను కూడా తయారు చేసి వడ్డిస్తున్నారు. వీటి ధరలు రూ.50 నుంచి రూ.100 వరకు ఉన్నాయి.
**ఫలూదాకు.. ఫిదా.. సబ్జా గింజలతో ప్రత్యేకంగా తయారు చేసే ఫలూదాకు ప్రతి ఒక్కరూ ఫిదా కావాల్సిందే. దిల్లీ నగరంలో ప్రాచుర్యం పొందిన ‘ఫలూదా’, హైదరాబాద్‌ మీదుగా ఇక్కడకు వచ్చింది. సబ్జా గింజలను కొన్ని గంటల పాటు నీళ్లల్లో నానబెడతారు. గంట ముందుగా సేమియాను ఉడికించి, వండి తయారు చేసి పెట్టుకుంటారు. సబ్జా గింజలు, సేమియాలను ఒక గ్లాసులో పోసి అందులో ఐస్‌క్రీమ్‌, రోజ్‌ వాటర్‌, టూటీ ఫ్రూటీ, జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా వేస్తారు. వివిధ రకాల ఫ్లేవర్స్‌ను కలుపుతారు. సబ్జా గింజలు ఒంటిలో వేడిని తగ్గించి, చల్లదనాన్ని అందిస్తాయి. అందుకే ఫలూదాను ఎక్కువ మంది తాగుతుంటారు. ఇందులోనూ రాయల్‌ ఫలూదా, డ్రై ఫ్రూట్‌ ఫలూదా, కుల్ఫీ ఫలూదా, గులాబ్‌జామ్‌ ఫలూదా వంటి రకాలు ఉన్నాయి. ఇవి రుచిగా ఉండడంతో పాటు.. శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com