రక్షణనిధిని తిరువూరు నుండి పామర్రుకు పంపిస్తారా?TNI-ప్రత్యేకం

తిరువూరు నియోజకవర్గ ప్రస్తుత శాసనసభ్యుడు కొక్కిలిగడ్డ రక్షణనిధి స్థానిక ప్రజల్లో మంచి వ్యక్తిగా, వివాదరహితుడుగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు కోట్లకు కోట్లు అక్రమంగా కూడబెట్టుకుంటున్న తరుణంలో రక్షణనిధి మాత్రం అవినీతి మచ్చ లేకుండా గుర్తింపు తెచ్చుకున్నారు. కాని ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో నేతలకు ఉండవలసిన దూకుడు రక్షణనిధిలో లోపించింది దీంతో తిరువూరు నియోజకవర్గ వైకాపాలో నిస్తేజం ఏర్పడింది. గడిచిన నాలుగేళ్లలో వైకాపా పరంగా రక్షణనిధి నేతృత్వంలో ప్రజా సమస్యల కోసం పెద్ద పోరాటాన్ని కూడా నిర్వహించలేకపోయారు. తెలుగుదేశం నేతలు అన్ని ప్రభుత్వ పథకాల్లో అందినకాడికి దోచుకుతింటూ ఉంటే ప్రశ్నించవలసిన ప్రజాప్రతినిధి తమకేమి పట్టనట్లుగా వ్యవహరించారు. రాజకీయాల్లో కేవలం మంచితనమే సరిపోదని ఒక ప్రజాప్రతినిధిగా తనను ఎన్నుకున్న ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో రక్షణనిధి తగిన శ్రద్ధ చూపలేదనే అపవాదు ఉంది. రక్షణనిధి మెతక వైఖరిపై వైకాపా పార్టీ నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ సైతం అసంతృప్తి నెలకొని ఉంది. ఆయన పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండలేకపోతున్నారు.
*** రక్షణనిధికి అడ్డంకిగా మారిన ఆనవాయితీ
తిరువూరు నియోజకవర్గ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే గడిచిన 65 సంవత్సరాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటి, రెండు సార్లు తప్ప ఒకసారి గెలిచిన వ్యక్తి మరొకసారి తిరువూరు నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. ఈ ఆనవాయితీ ప్రకారం రక్షణనిధి ఈసారి తిరువూరు నుండి పోటీ చేస్తే విజయం సాధించలేరేమోనన్న ఆలోచన పార్టీ వర్గాల్లో నెలకొని ఉంది. పార్టీ అధిష్ఠాన వర్గంలో ముఖ్యంగా వై.ఎస్.జగన్ వద్ద రక్షణనిధికి మంచి గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీ నుండి ఎన్ని ప్రలోభాలు వచ్చినప్పటికీ రక్షణనిధి నీతికి కట్టుబడి వైకాపాలోనే కొనసాగారు. తన సహచర వైకాపా ఎమ్మెల్యేలు పదవులకు, ఇతర ప్రలోభాలకు అమ్ముడుపోయినప్పటికి రక్షణనిధి మాత్రం పార్టీ ఫిరాయించకుండా తన విధేయతను చాటుకున్నారు. ఈసారి ఎన్నికల్లో రక్షణనిధి వైకాపా తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడం నూటికి నూరు శాతం ఖాయం అని చెప్పటంలో సందేహం లేదు. రక్షణనిధిని ఆయన స్వస్థలానికి సమీపంలో ఉన్న పామర్రు నియోజకవర్గానికి పంపించాలని ఆ పార్టీ అధిష్ఠానంలో చర్చలు జరుగుతన్నట్లు సమాచారం. ఈ విషయంలో ఇప్పటి వరకు రక్షణనిధి తన మనసులో మాట సన్నిహితులకు చెప్పకపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఆయన తిరువూరులో పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. రక్షణనిధి పామర్రుకు వెళ్తే గడిచిన మూడు ఎన్నికలు లాగానే తిరువూరు ఎన్నికల బరిలో మరొక కొత్త అభ్యర్థి దిగుమతి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.– కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com