*ఒడిశాలోని పురాతన జగన్నాథస్వామి ఆలయం ఖజానా రత్నభండార్ 34 ఏండ్ల తర్వాత తెరుచుకోనున్నది. మొత్తం ఏడుగదుల్లో విస్తరించిన ఈ ఆభరణ భాండాగారాన్ని 1984లో తెరిచేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ అది మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత ఎవరూ ఆ ప్రయత్నం చేయలేదు. 2016 నుంచి ఆలయ పునరుద్ధరణ పనుల్ని పర్యవేక్షిస్తున్న ఒడిశా హైకోర్టు తాజాగా జారీ చేసిన ఆదేశాల మేరకు రత్నభండార్‌ను తెరువాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. 12వ శతాబ్దంనాటి ఈ పురాతన ఆలయంలోపల ఉన్న రత్నభండార్ భవనం ఏమేరకు పటిష్టంగా ఉందో పరిశీలించి నివేదిక అందించండి అని భారత పురావస్తు పర్యవేక్షణ శాఖను ఒడిశా హైకోర్టు ఈనెల 22న ఆదేశించింది. రత్నభండార్ ఎంత పటిష్టంగా ఉందో పరిశీలిస్తామని, అయితే ఖజానాలో ఉన్న సంపదను లెక్కించాలని తాము భావించడంలేదని ఆలయ ప్రధానాధికారి పీకే జెనా అన్నారు.
**10మందితో పరిశీలన బృందం
జగన్నాథుడి ఆభరణ భాండాగారం పటిష్టతను పరిశీలించేందుకు 10మందికి అనుమతి లభించింది. గురువారం రాత్రి జరిగిన పూరి ఆలయ పరిపాలనాధికారులు, ఛతీసా నిజోగ్ (పూజారుల అత్యున్నత మండలి) సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. రత్నభండార్ పరిశీలనకు పదిమందితో కూడిన బృందాన్ని ఎంపిక చేస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఆలయ ప్రధానాధికారి పీకే జెనా తెలిపారు. పూరి రాజు గజపతి దిబ్యసింగ్ దేబ్ లేదా ఆయన తరఫు ప్రతినిధి, నలుగురు ఉద్యోగులు, పురావస్తు శాఖ కోర్‌కమిటీ నుంచి ఇద్దరు అధికారులు, ఇద్దరు నిపుణులు, ఒడిశా హైకోర్టు అమికస్ క్యూరీగా నియమించిన న్యాయవాది ఎన్కే మొహంతీ ఉన్నారు. తనిఖీల అనంతరం బృందంలోని సభ్యులందరూ విడివిడిగా తమ నివేదికలను అందజేస్తారని పీకే జెనా వెల్లడించారు. రత్నభండార్ గచ్చు, గదుల పైభాగం, గోడలను మాత్రమే వారు పరిశీలిస్తారు. అందులోని నగల పెట్టెల్ని తాకేందుకు ఎవరినీ అనుమతించం. పరిశీలనకు వీలుగా గదుల్లో తగిన లైట్లు, ఆక్సిజన్ ఏర్పాటు చేయనున్నాం. ప్రవేశానికి ముందు సభ్యులందరికీ టవల్స్ ఇస్తాం అని ఆయన వివరించారు. 2011లో తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయ సంపదను లెక్కించేందుకు సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, నాగబంధం ఉన్న కారణంగా నేలమాళిగలోని ఆరవగదిని నేటికీ పరిశీలించలేదు.
**1984లో ఏం జరిగింది?
జగన్నాథ స్వామి ఆలయానికి శతాబ్దాలుగా ఒడిశా రాజవంశాలు, గజపతులు సమర్పిస్తూ వచ్చిన విలువైన కానుకలు, ఆభరణాలు ఎన్నో ఉన్నాయి. రత్నభండార్ అని పిలిచే ఏడుగదుల ఖజానాలో వాటిని దాచారు. ఆ కానుకలను ఒకసారి లెక్కించి, తిరిగి దాచాలని 1984లో దేవాలయ అధికారులు భావించారు. 1984లో ఆలయ అధికారిగా పనిచేసిన ఆర్ఎన్ మిశ్రా మాట్లాడుతూ.. అప్పట్లో ఏడు గదుల్లో మూడింటిని మాత్రమే తెరువగలిగాం. ఒక్కో గదిని తెరుస్తూ వచ్చాం. తనిఖీల కోసం నాల్గవ గదిదగ్గరకు వెళ్లగానే పాములు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించడంతో మధ్యలోనే ఆగిపోయాం. తర్వాత మరే గదినీ తెరిచే ప్రయత్నం చేయలేదు అని తెలిపారు.