రాజేంద్రుడి న్యూజెర్సీ రాష్ట్ర పురస్కారం

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌కి అరుదైన పురస్కారం దక్కింది. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించింది. ఇటీవల అమెరికా వెళ్లిన రాజేంద్రప్రసాద్‌ అక్కడి జనరల్‌ అసెంబ్లీ, సెనెట్‌ సంయుక్తంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో రాజేంద్రప్రసాద్‌ని తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకులు సన్మానించారు. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఈ వయసులో కూడా నేను నటిస్తున్నానంటే కారణం నా దర్శకులే. నా కోసం సరికొత్త పాత్రలు రాయడం వల్లే నేనింకా ఉత్సాహంగా పనిచేయగలుగుతున్నా. ఇలాంటి పురస్కారాలు పనిచేయాలన్న కోరికను, స్ఫూర్తిని మరింత కలగ చేస్తాయన్న నమ్మకం ఉంది. న్యూజెర్సీలో తెలుగువాళ్లు ఎక్కువ. అక్కడి రాజకీయ వేత్తలు ఓట్ల కోసం తెలుగువాళ్లని కలిసినప్పుడు ‘మాకు రాజేంద్రప్రసాద్‌ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూసి ఒత్తిడిని దూరం చేసుకుంటాం’ అని చెప్పారట. అలాంటి నటుడ్ని గౌరవించుకోవాలన్న ఉద్దేశంతో నాకు ఈ అవార్డు అందజేశారు. దీన్ని తెలుగు చిత్రసీమకు అంకితం చేస్తున్నా. మిగిలిన రంగాల్లానే తెలుగు సినిమా పరిశ్రమలోనూ మంచీ, చెడూ రెండూ ఉన్నాయి. చెడుని మర్చిపోయి మంచివైపు చూడండి.. మంచి వైపు నిలబడండి’’ అన్నారు. ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ‘‘రాజేంద్రప్రసాద్‌ 237 చిత్రాలు చేస్తే.. అందులో 35 నా దర్శకత్వంలోనే నటించారు. మేమిద్దరం భార్యాభర్తల్లాంటివాళ్లం. ఆయనకు అవార్డు వస్తే నాకు వచ్చినట్టే. తెలుగు చిత్రసీమే కాదు.. భారతీయ పరిశ్రమ కూడా గర్వించే సందర్భం ఇద’’న్నారు. దర్శకురాలు నందినిరెడ్డి మాట్లాడుతూ ‘‘నా బాల్య స్నేహితుడి లాంటివారు రాజేంద్రప్రసాద్‌. ఎందుకంటే తీవ్రమైన ఒత్తిడిలో ఆయన సినిమాలే చూస్తూ పెరిగా. ఇప్పటికీ ఆయన చిత్రాల గురించీ, పాత్రల గురించీ మాట్లాడుకుంటూనే ఉన్నాం’’ అన్నారు. ‘‘నా సినిమాల్లో వినోదాత్మక సన్నివేశాల్ని ఇంత బాగా తీయగలుగుతున్నానంటే కారణం.. రాజేంద్ర ప్రసాద్‌. టైమింగ్‌ అంటే ఏమిటో ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఆయన నట కిరీటి కాదు. ‘నవ’ కిరీటి. నవ రసాల్ని ఆయన సరికొత్తగా పండిస్తుంటార’’న్నారు అనిల్‌ రావిపూడి. ఈ కార్యక్రమంలో సతీష్‌ వేగేశ్న, రమేష్‌ చెప్పల, బందరుబాబి, కాదంబరి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com