రాజ్యసభకు రమేష్-రవీంద్రలు

తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. రెండు స్థానాలకు గాను సీఎం రమేష్‌, కనకమేడల రవీంద్రకుమార్‌ పేర్లను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. సీఎం రమేష్‌ ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతుండగా, కనకమేడల రవీంద్రకుమార్‌ తెదేపా లీగల్‌ సెల్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. ముందుగా సీఎం రమేష్‌తో పాటు వర్ల రామయ్య పేరు రాజ్యసభ రేసులో వినిపించింది. వారిద్దరి పేర్లు ఖరారైనట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే అనూహ్య పరిస్థితుల మధ్య కనకమేడల రవీంద్రకుమార్‌ పేరు తెరపైకి రావడం.. ఖరారు కావడం చకాచకా జరిగిపోయాయి. రాయలసీమలో ఇప్పటికే కర్నూలు జిల్లా నుంచి టీజీ వెంకటేష్‌ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. అనంతపురం నుంచి ఇద్దరు మంత్రివర్గంలోనూ, మరో ఇద్దరు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పదవుల్లోనూ ఉన్నారు. చిత్తూరు సీఎం సొంత జిల్లా. ప్రతిపక్ష నేత జగన్‌ సొంత జిల్లా కడప తెదేపాకి కీలకం. ఈ దృష్ట్యా అక్కడి నుంచి ప్రస్తుతం రాజ్యసభకి ప్రాతినిథ్యం వహిస్తున్న సి.ఎం.రమేష్‌కి మరోసారి అవకాశమివ్వాలని చంద్రబాబు భావించారు. ఇటీవలి వరకు కేంద్రంలో సహాయమంత్రిగా వ్యవహరించిన సుజనాచౌదరికి రెండేళ్ల కిందట రాజ్యసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన నేపథ్యంలో తాజాగా సీఎం రమేష్‌కి కూడా అదే సూత్రం మేరకు రెండోసారి అవకాశం కల్పించినట్లు పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు కడప జిల్లా నుంచి సీఎం రమేష్‌కు పోటీగా జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ప్రతిపక్ష నేత జగన్‌పై తెలుగుదేశం తరఫున ఎన్నికల్లో పోటీ చేయటంతో పాటు జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన తీరు తనకు తెలుసునని, ఆయన రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటానని సీఎం నుంచి హామీ వచ్చిన కారణంగా శ్రీనివాసులరెడ్డి రేసు నుంచి తప్పుకున్నారు. గత మంత్రివర్గ విస్తరణలో రాయలసీమ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిన ప్రాధాన్యతను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసినట్లు తెలిసింది. చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల నుంచి అమర్‌నాథ్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, అఖిలప్రియకు మంత్రివర్గంలో చోటు కల్పించటంతో పాటు తూర్పు రాయలసీమగా పిలిచే నెల్లూరు నుంచి సోమిరెడ్డికి అవకాశం ఇచ్చిన విషయాలను ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ రెడ్డి సామాజికవర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని.. ఇప్పుడు రాజ్యసభకు రెండు స్థానాలు మాత్రమే ఉండటంతో సమీకరణాల దృష్ట్యా సాధ్యపడటం లేదని చంద్రబాబు ఆయనకు నచ్చజెప్పారు. కోస్తా జిల్లాల నుంచి బీసీ, ఎస్సీ వర్గానికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావించడంతో.. బీసీల నుంచి నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు జిల్లా నాయకులందరితో కలిసి ముఖ్యమంత్రిని కలిసి తనకు అవకాశమివ్వాలని కోరారు. చివరి వరకు ఆయన పేరు పరిశీలనలో ఉన్నా తర్వాత అవకాశాలు సన్నగిల్లాయని సమాచారం. గత ఎన్నికల్లో ఆయనకు పార్టీ టిక్కెట్టు కేటాయించటం, ఆయన సోదరునికి ఎమ్మెల్సీగా అవకాశమివ్వటం తదితర కారణాలు కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. వచ్చే ఎన్నికల్లో బీదా మస్తాన్ రావుకి తగిన ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో బీదా కూడా రేసు నుంచి తప్పుకున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com