రుచులతో మనోభావాలు చెప్పేయచ్చు

‘రుచుల’ వెనుక అసలు ‘రహస్యం’..
‘షడ్రుచులు’, ‘షడ్రసాలు’ ఎలా చెప్పినా మనం నిత్యం అనేక రకాల రుచులను ఆస్వాదిస్తుంటాం. కొందరు తీపి ఎక్కువగా తింటే మరికొందరు కారం పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు. ఏ వ్యక్తికైనా తన అభిరుచిని బట్టి ఒక్కోసారి రుచుల పట్ల ఆసక్తి పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. అయితే ఏ ఆహార పదార్థాన్నైనా మితంగానే తినాలని చెబుతారు. ఎక్కువగా తింటే శరీరం అనారోగ్యాలకు గురి కావల్సి వస్తుంది. ఈ క్రమంలోనే ఇదే సూత్రం రుచులకు కూడా వర్తిస్తుందని ‘ఆయుర్వేదం’ చెబుతోంది. అన్ని రుచుల్ని సమానంగా తీసుకుంటేనే శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. కొన్ని ఎక్కువగా మరికొన్ని తక్కువగా తింటే ఇబ్బందులు పడక తప్పదు. మరి ఏయే రుచులు తింటే ఏం లాభాలు ఉంటాయో , ఎక్కువ తింటే ఏం నష్టాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దామా..!
1. తీపి (మధురం) మనలో ఎక్కువ మందికి తీపి అంటే ఇష్టం. నిత్యం తినే ఆహార పదార్థాల్లో ఉండే పిండి పదార్థాలు తియ్యగా ఉంటాయి. మానవ శరీరంలో ఎక్కువగా ఉండేది ఈ రసమే. శరీర నిర్మాణానికి, శక్తికి, పెరుగుదలకు ఇది ఉపయోగపడుతుంది. శరీరానికి, మనసుకి చక్కని సమన్వయాన్ని కలగజేస్తుంది. శరీరంలోని ద్రవాన్ని ప్రత్యుత్పత్తి చేసే రసాలను ఇది తయారు చేస్తుంది. దేహానికి చల్లదనాన్ని ఇస్తుంది. భూమి, నీరు అనే మూలకాలతో తీపి నిర్మితమై ఉంటుంది. శరీరంలోని వాతాన్ని తగ్గిస్తుంది. పిత్తం కూడా తగ్గుతుంది. కానీ అధికంగా తీసుకుంటే కఫం, బరువులతోపాటు విషపదార్థాలను, క్రిములను, షుగర్ వంటి జబ్బులను, గ్యాస్‌ను, అజీర్ణాన్ని, బద్దకాన్ని కూడా పెంచుతుంది.
2. పులుపు (ఆమ్లం) దీన్ని తీసుకుంటే శరీరానికి ఉత్తేజం కలుగుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్ బయటకి వెళ్లేందుకు ఉపయోగపడుతుంది. శరీర కణాలకు పోషణనిస్తుంది. జ్ఞానేంద్రియాల పుష్టికి దోహదం చేస్తుంది. గ్రంథుల నుంచి స్రవించే ద్రవాలు, జాయింట్స్‌లో ఉండే ద్రవాలను పెంచుతుంది. రోజూ మనం తీసుకునే ఆహార పదార్థాలలో పులుపు కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇది ఔషధాల రూపంలో తక్కువగా లభిస్తుంది. ఎక్కువగా పులుపు తీసుకుంటే కడుపులో మంట, హైపర్ అసిడిటీ, దురద, త్వరగా ముసలితనం, తల తిరగడం, వెంట్రుకలు తెల్లబడడం వంటివి సంభవిస్తాయి.
3. ఉప్పు (లవణం) నాడీ ప్రేరేపణకు, శరీరంలో ద్రవాలను నిల్వ ఉంచడానికి, కండరాల సంకోచ, వ్యాకోచాలకు, అయోడిన్‌ను ఉత్పత్తి చేసేందుకు, సోడియం నిల్వలను పెంచేందుకు ఉప్పు ఉపయోగపడుతుంది. నిత్యం వివిధ ఆహార పదార్థాల్లో ఈ రుచిని మనం ఎక్కువగా ఆస్వాదిస్తున్నాం. కానీ మోతాదుకు మించి తీసుకుంటే రక్తపోటును పెంచి గుండె జబ్బులు వచ్చేలా చేస్తుంది. కిడ్నీలు కూడా దెబ్బ తింటాయి.
4. కారం (కటువు) కారం అంటే మనలో ఎక్కువ మంది ఇష్టంగా తింటారు. పచ్చడి, కూర… ఇలా వంట ఏదైనా కారం ఎక్కువగా తినడం చాలా మందికి అలవాటు. భోజనం చేసేటప్పుడు నాలుకకి కొంచెమైనా కారం తగలకపోతే చాలా మంది అయిష్టంగా తినడం ముగించేస్తారు. నిత్యం మన తినే ఆహారంలో కారంను తగిన మోతాదులో తీసుకుంటే ఆర్థరైటిస్ నొప్పులు, తలనొప్పి వంటి పలు రకాల నొప్పులను తగ్గించవచ్చని పరిశోధనల్లో తెలిసింది. ప్రధానంగా కారం ఎక్కువగా ఉండే మిరపకాయలను తీసుకుంటే అత్యధిక భాగం బి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు శరీరానికి లభిస్తాయి. పలు రకాల క్యాన్సర్లను నిరోధించే గుణం మిరపకాయలకు ఉంది. అయితే కారం ఎక్కువగా తినడం వల్ల కొంతమందిలో నోరు, కడుపులో మంట, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉంది.
5. చేదు (తిక్తం) సాధారణంగా చేదు అంటే మనలో అధిక శాతం మందికి నచ్చదు. చేదుగా ఉండే ఏ ఆహార పదార్థాన్నయినా తినేందుకు అయిష్టతను ప్రదర్శిస్తారు. సుస్తీ చేస్తే మింగే చేదు అల్లోపతి మందు ఔషధంగా మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో, చేదుగా ఉండే ఆహారాన్ని తింటే అదే విధమైన ఫలితాలు మనకు లభిస్తాయి. అయితే కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువగా, మరికొన్ని తక్కువగా చేదును కలిగి ఉంటాయి. ఈ క్రమంలోనే చేదుగా ఉండే పదార్థాలన్నీ ఔషధాలుగా మాత్రం పనిచేయవు. వాటిలో కొన్ని విషాన్ని కూడా కలిగి ఉంటాయి. మనలో ఎక్కువ మంది ఆహారంలో తీసుకునే కాకరకాయతోపాటు వేప ఆకులు, పూత, కాయలు చేదు రుచిని కలిగి ఉంటాయి. క్రిముల నుంచి రక్షణకు, వివిధ రకాల నొప్పులను, వాపులను తగ్గించడానికి, శిరోజాల సంరక్షణకు, యాంటీ బయోటిక్‌గా, రక్తంలోని చక్కెరను తగ్గించేందుకు, మెటబాలిజం ప్రక్రియను మెరుగు పరిచేందుకు, వివిధ రకాల జ్వరాలు రాకుండా, రక్తాన్ని శుద్ధి చేసేందుకు చేదు ఉపకరిస్తుంది. మోతాదుకు మించితే అజీర్ణం, విరేచనాలు కలుగుతాయి.
6. వగరు (కషాయం) పచ్చిగా ఉండే మామిడి పండ్లలో ఈ రుచి ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే విటమిన్ సి ఎక్కువగా అందుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. శరీరానికి బలాన్నిస్తుంది. చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. ఆహారంలో ఇది అధికమైతే అజీర్ణం, విరేచనాలు, పేగులపైన దుష్ప్రభావాలు కలుగుతాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com