రెండు రోజులు కావాలని అడిగిన భాజపా. కర్ణాటక పీఠంపై జేడీఎస్.

కన్నడ నాట రాజకీయం రసవత్తరంగా మారింది. 104 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ సాధించకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో 78 స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ తమ సంపూర్ణ మద్దతును జేడీఎస్‌కు ప్రకటించింది. సీఎంగా జేడీఎస్‌ ఎవరిని నియమించినా పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ముఖ్యనేతలు గులాంనబీ ఆజాద్‌, మల్లిఖార్జున ఖర్గే, సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ సహా పలువురితో కలిసి కుమారస్వామి గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం కల్పించాలని కోరారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం వారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆపద్ధర్మ సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు జేడీఎస్‌కు సంపూర్ణంగా మద్దతు ప్రకటించినట్టు చెప్పారు. కాంగ్రెస్‌ మద్దతుతో జేడీఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ తీర్మానాన్ని లేఖ ద్వారా గవర్నర్‌కు వివరించినట్టు తెలిపారు. జేడీఎస్‌ అగ్రనేత దేవెగౌడకు కూడా లేఖ ద్వారా మద్దతు విషయాన్ని తెలిపినట్టు వివరించారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని కోరినట్టు సిద్ధరామయ్య తెలిపారు. తమ మద్దతును జేడీఎస్‌ అంగీకరించిందన్నారు. అనంతరం జేడీఎస్‌ సీఎం అభ్యర్థి కుమారస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ మద్దతుకు సంబంధించి తమ పార్టీ జాతీయ అధ్యక్షుడికి లేఖ ఇచ్చిందన్నారు. ఇరు పార్టీల నేతలు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని కోరినట్టు ఆయన వివరించారు. కాంగ్రెస్‌తోపాటు.. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు తమకే ఉందని గవర్నర్‌కు స్పష్టం చేసినట్లు కుమారస్వామి వివరించారు. ఈసీ నుంచి వివరాలు వచ్చాక నిర్ణయం తీసుకుంటానని గవర్నర్‌ తమతో అన్నట్లు తెలిపారు. భాజపా నేతలు గవర్నర్‌ని రెండు రోజుల గడువు ఎందుకు అడిగారో తమకు తెలియదని చెప్పారు. 2008లో ‘ఆపరేషన్‌ కమల’ చేసినట్లు ఈ సారి చేయాలని భాజపా చూస్తోందని ఆరోపించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com