రేపటి నుండి ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలు

***చినవెంకన్న వైభవం ఏడేడు లోకాలకు తెలిసే సమయం ఆసన్నమైంది. ద్వారకాతిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడి వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలకు ముహూర్తం ఆగమించింది. ఈ వేడుకను కనుల పండువగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు సకల సన్నాహాలు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి వైభవాన్ని చూసి తరించేందుకు భక్తకోటి నిరీక్షిస్తోంది. ఈనెల 25న స్వామి అమ్మవార్లను, పెండ్లి కుమారుడు, పెండ్లికుమార్తెలను చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వచ్చే నెల 2న జరిగే పుష్పయాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.
*****స్వామివారిని దర్శించునేందుకు విశేష సంఖ్యలో భక్తులు ద్వారకాతిరుమల క్షేత్రానికి వస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశముందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయాన్ని రంగులు వేసి సుందరీకరించడంతో పాటు విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ పరిసరాలను, తూర్పు వైపు ఉన్న అనివేటి మండపాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుద్దీపాలతో స్వామి, అమ్మవార్ల రూపాలతో ఉన్న భారీ కటౌట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ తూర్పురాజగోపురం వద్ద ఉన్న శ్రీహరి కళా తోరణంలో నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగు తాయని ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు.
***స్థల పురాణం..
ఈ క్షేత్రం శ్రీరామ చంద్రుని తండ్రి దశరథ మహారాజు కాలంనాటిదని ఆలయ పండితులు చెబుతున్నారు. ద్వారకుడనే మహర్షి స్వామివారి పాదసేవ కోసం ఉత్తరాభిముఖంగా కూర్చొని తపస్సు చేశారని.. దీంతో ఆయనకు దక్షిణాభిముఖంగా స్వామివారు ప్రత్యక్షమై సేవ చేసుకునే భాగ్యం కల్పించారు. అందుకే ఈ ఆలయంలో మూల విరాట్టు దక్షిణముఖంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. ద్వారకా మహర్షి చాలాకాలం తపస్సు చేయడం వల్ల ఆయనపై పుట్ట ఉద్భవించింది. దీంతో స్వామివారి నాభి దిగువ భాగం పుట్టలోనే నిగూఢమై ఉంటుంది. దీంతో భక్తులకు స్వామివారి పాద పూజ చేసుకునే భాగ్యం కల్పించేందుకు స్వయంవ్యక్త మూర్తి వెనుక వైపున పీఠంపై మరోమూర్తిని ప్రతిష్ఠించినట్లు పండితులు పేర్కొంటున్నారు. స్వయంభువుగా వెలసిన స్వామిని కొలిస్తే భక్తులకు మోక్షం సిద్ధిస్తుందని, ప్రతిష్ఠించిన మూర్తిని పూజిస్తే ధర్మార్థ, కామ పురుషార్థాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఇద్దరు ధ్రువమూర్తులు ఉండటం వల్ల ఏడాదికి రెండుసార్లు బ్రహోత్సవాలు నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో స్వయంభువుగా వెలసిన స్వామికి, ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠించిన స్వామివారికి కల్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది.
****ఉత్సవాల్లో ముఖ్యకార్యక్రమాలు
* ఏప్రిల్‌ 25న ఉదయం 7గంటలకు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు,పెండ్లి కుమార్తెలుగా అలంకరిస్తారు. అదే రోజు రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది.
* 26న రాత్రి 7గంటల నుంచి అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగుతాయి.రాత్రి 9 గంటలకు హంసవాహనంపై స్వామివారి గ్రామోత్సవం.బీ 27న ఉదయం 7 గంటలకు సూర్యప్రభవాహనంపై, రాత 7 గంటలకు చంద్రప్రభవాహనంపై శ్రీవారి గ్రామోత్సవం.
* 28న ఉదయం 7 గంటలకు హనుమద్వాహనంపై, రాత్రి 8.30 గంటలకు వెండిశేషవాహనంపై గ్రామోత్సవం. అదేరోజు రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది.
*29న ఉదయం 7 గంటలకు సింహవాహనంపై శ్రీవారి గ్రామోత్సవం. రాత్రి 9గంటల నుంచి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం. అనంతరం వెండి గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం.బీ 30న రాత్రి 7గంటలకు రథోత్సవం.
* మే 1న ఉదయం 10.30 గంటలకు చక్రవారి-అవభృథోత్సవం. మధ్యాహ్నం 3 గంటలకు వేద సదస్సు. రాత్రి 7గంటలకు పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజ అవరోహణ. రాత్రి 8 గంటలకు అశ్వవాహనంపై స్వామివారి గ్రామోత్సవం.
* 2న ఉదయం 9 గంటల నుంచి చూర్ణోత్సవం, వసంతోత్సవం.
* రాత్రి 7 గంటల నుంచి ద్వాదశకోవెల ప్రదక్షిణలు, శ్రీవారి పుష్ప యాగోత్సవం.
****నేత్రపర్వంగా అలంకారాలు..
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అంతరాలయంలో స్వామివారిని దర్శించుకుని తిరిగి వచ్చే భక్తులు సైతం ప్రత్యేక అలంకారంలో ఉన్న ఉత్సవమూర్తులను దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ఆలయ ముఖ మండపంలో ధ్వజస్తంభం పక్కన స్వామివారిని రోజుకో అవతారంలో అలంకరిస్తారు.
*****సందర్శనీయ ప్రదేశాలు..
* శేషాచలంపైన శ్రీభ్రమరాంబమల్లేశ్వర స్వామి ఆలయం, శేషాకారంలో నిర్మించిన ఘాట్‌ రోడ్డు, ఫలభాయంత్రం, శ్రీవారి గోశాల, ఉద్యాన వనాలు ఉన్నాయి.
* ఆలయ ప్రాంగణంలో అన్నమాచార్యుని భారీ విగ్రహం, క్షేత్ర ప్రారంభంలో గరుత్మంతుని భారీ విగ్రహం, ఎంఎస్‌ సత్రం వద్ద హనుమంతుని విగ్రహం ఉన్నాయి.
* శ్రీవారి ఉపాలయాలైన లక్ష్మీపురం శ్రీవేంకటేశ్వర జగన్నాథస్వామి, కుంకుళ్లమ్మ, శ్రీవల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఐఎస్‌ జగన్నాథపురం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలను, శ్రీవారి నృసింహసాగర్‌ను భక్తులు సందర్శించవచ్చు. ఈ క్షేత్రాలను సందర్శించేందుకు దేవస్థానం ఉచిత బస్సును ఏర్పాటు చేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com