రైతులకు మద్దతు ధర ఇలా నిర్ణయిస్తే బాగుంటుంది

సంక్షోభంలో ఉన్న రైతును ఆదుకోవడానికి కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పీ) పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించిన నేపథ్యంలో ఇది ఎలా ఉండబోతుందోనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. రైతు సాగు వ్యయానికి 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధర ఇవ్వాలని కొన్నేళ్లుగా రాజకీయపార్టీలు, రైతు సంఘాలు, స్వచ్చంద సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో జైట్లీ ప్రకటనకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. అయితే సాగు వ్యయాన్ని ఎలా లెక్కిస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు సాగుకయ్యే వ్యయాన్ని లెక్కగట్టిన పద్దతినే కొనసాగిస్తే యాభైశాతం అదనంగా ఇచ్చినా ప్రయోజనం నామమాత్రంగానే ఉండే అవకాశం ఉంది. వాస్తవంగా హెక్టారుకయ్యే సాగు ఖర్చు, ఆ రైతు కుటుంబం భూమిలో చేసిన శ్రమను పరిగణనలోకి తీసుకొని కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుండగా, భూమి కౌలు ధర, సొంత పెట్టుబడి పెట్టినపుడు దానికయ్యే వడ్డీని కూడా లెక్కించాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. ఎం.ఎస్‌.స్వామినాథన్‌ కమిషన్‌ దీనినే సిఫార్సు చేసింది. మరోవైపు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉందని, మార్పులు చేయాలనే అభిప్రాయమూ ఉంది. అన్ని రాష్ట్రాల నుంచి సాగుకు సంబంధించిన వివరాలు తీసుకొని జాతీయ సగటు ఆధారంగా ధర నిర్ణయిస్తున్నారు. దీనివల్ల సాగు ఖర్చు ఎక్కువగా ఉండే రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ఉదాహరణకు 2017లో క్వింటా వరి సాగుకు రూ.2,158 ఖర్చవుతుందని, దీనికి యాభైశాతం కలిపి రూ.3,237 కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని తెలంగాణ కోరింది. కేంద్ర కమిటీ మాత్రం సాగు వ్యయం, కుటుంబ శ్రమకు కలిపి క్వింటాకు రూ.1,117 మాత్రమే ఖర్చవుతుందని తేల్చింది. వరి పండించే అన్ని రాష్ట్రాలను లెక్కలోకి తీసుకొని ఈ నిర్ణయానికి వచ్చింది. కౌలు, సొంత పెట్టుబడి వడ్డీ కలిపితే క్వింటాకు రూ.1,484 అవుతుందని అంచనాకు వచ్చింది. చివరకు క్వింటా ధర రూ.1,550గా నిర్ణయించింది. దీని ప్రకారం సాగు ఖర్చు, కుటుంబ శ్రమకు క్వింటాకైన ఖర్చు కంటే 38.76 శాతం అదనంగా కనీస మద్దతు ధరను నిర్ణయించినట్లు కమిటీ పేర్కొంది. తాజా నిర్ణయం ప్రకారం యాభైశాతం పెంచినా మరో రూ.120 వరకు పెరుగుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో నిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల కనీస మద్దతు ధర కూడా రావడం లేదని, ఈ నేపథ]్యంలో కనీస మద్దతు ధరతో సేకరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్న కమిటీ.. సాగు వ్యయం, కుటుంబశ్రమ, కౌలును కూడా పరిగణనలోకి తీసుకొని ధర నిర్ణయించినట్లుగా పేర్కొంది. అయితే యాభైశాతం గురించి ప్రస్తావించలేదు. జొన్నకు వచ్చే సరికి మార్కెట్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయని, సాగు వ్యయం, కుటుంబ శ్రమను మాత్రమే లెక్కలోకి తీసుకొన్నట్లు పేర్కొంది. ఇలా ఒక్కో పంటకు ఒక్కో విధానాన్ని కమిటీ అనుసరించింది. 2017-18 సంవత్సరానికి కనీస మద్దతు ధర నిర్ణయించినపుడు 2012-13 నుంచి 2014-15 వరకు వాస్తవ అంచనాలను పరిగణనలోకి తీసుకొంది. కొన్ని పంటల్లో సాగు వ్యయం, కుటుంబ శ్రమను మాత్రమే లెక్కించినా 46 శాతానికిపైగా లాభాలు వస్తున్నాయని, కొన్ని పంటలకు మాత్రమే తక్కువ వస్తుందని కూడా పేర్కొంది.

* 2017-18లో ధరల నిర్ణయ సమయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి అన్ని ప్రధాన పంటలు, ఒడిశా నుంచి వరి, బిహార్‌ నుంచి వరి, మొక్కజొన్న.. పంజాబ్‌ నుంచి వరి, పత్తి పంటలను పరిగణనలోకి తీసుకొంది. ఆంధ్రప్రదేశ్‌ పేర్కొన్న ఖర్చుకు, కమిటీ తీసుకొన్న ఖర్చుకు వ్యత్యాసం ఉండటానికి కారణం దిగుబడి తక్కువగా పేర్కొనడమేనని కమిటీ వ్యాఖ్యానించింది. పత్తిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ తక్కువ దిగుబడి ఉన్నట్లు పేర్కొనడంతోపాటు సాగు ఖర్చులను ఎక్కువగా చూపించినట్లు కమిటీ అభిప్రాయపడింది. కొన్ని రాష్ట్రాల్లో సాగు ఖర్చులు తక్కువగా ఉన్నాయి. ఇలా వాస్తవ సాగు ఖర్చులో తేడాలతో పాటు రాష్ట్రాలు పలు అదనపు ఖర్చులను చేర్చుతున్నాయని కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుతం ఇలాంటి అంశాలన్నింటిపైనా నీతిఆయోగ్‌ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎంఎస్‌పీ నిర్ణయంలోనే సమస్య ఉందని సుస్థిర వ్యవసాయ కేంద్రం డైరెక్టర్‌ రామాంజనేయులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల మధ్య ఉన్న వ్యత్యాసాలను కేంద్రం పరిగణనలోకి తీసుకున్నప్పుడు.. తీసుకోనప్పుడు ఆ తేడాలను రాష్ట్రాలే భరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కనీస మద్దతు ధర నిర్ణయ సమయంలో జీవన వ్యయాన్ని సరిగా లెక్కించడం లేదు.. ఇప్పుడిది చాలా ఎక్కువగా పెరిగింది. ధరల రూపంలోనే కాదు, మిగిలిన అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాలన్నారు. రైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలివ్వాలి. వాస్తవ సాగుదారులకు సాయమందేలా ప్రభుత్వాల నిర్ణయాలుండాలి.బ్యాంకుల రుణాల్లో 21 శాతం మాత్రం సన్న,చిన్నకారు రైతులకు వెళ్తున్నాయి. కానీ సాగుదారుల్లో ఎక్కువమంది వీళ్లే. రైతు బతికేలా విధానాల్లో మార్పు వస్తేనే ప్రయోజనం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

* మొదట పంటల సాగు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకు అవసరమైన సమాచారాన్ని ఆయా రాష్ట్రాల్లోని అర్థగణాంక శాఖ నుంచి సేకరిస్తారు. ఇందులో కూలీలు, ఎద్దులు, యంత్రాల వినియోగం, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, సత్తువ, నీటి తీరువాలను లెక్కలోకి తీసుకుంటారు. వాటి వినియోగాన్ని బట్టి ప్రాధాన్యమిస్తారు. అన్ని రాష్ట్రాల సమాచారాన్ని తీసుకొని కమిటీ ఓ నిర్ణయానికి వస్తుంది. దీనినే ఏ2(వాస్తవ వ్యయం) గా పరిగణిస్తారు.

* సాగుదారు సొంతంగా భూమిలో పని చేస్తారు. ఈ శ్రమను కనీస మద్దతు ధర నిర్ణయ సమయంలో పరిగణనలోకి తీసుకోవడాన్ని ఎఫ్‌2గా పేర్కొంటున్నారు.

* భూమి సాగుకు చెల్లించే మొత్తం, సొంతంగా పెట్టిన పెట్టుబడికి వడ్డీని పరిగణనలోకి తీసుకోవడాన్ని సీ2గా పరిగణిస్తున్నారు. ఈ మూడింటిని కలిపి కనీస మద్దతు ధరగా నిర్ణయించడంతోపాటు, దీనిపై యాభై శాతం అదనంగా చెల్లిస్తేనే వ్యవసాయం లాభదాయకమవుతుందని ఆచార్య ఎం.ఎస్‌.స్వామినాథన్‌ నేతృత్వంలోని జాతీయ రైతు సంక్షేమ కమిషన్‌ సిఫార్సు చేసింది. అయితే ప్రస్తుతం వాస్తవ వ్యయం, కుటుంబ శ్రమను లెక్కలోకి తీసుకొని మద్దతు ధర నిర్ణయిస్తున్నారు.

* కేంద్రప్రభుత్వం 26 పంటలకు కనీస మద్దతు ధరలను నిర్ణయించడానికి ప్రముఖ వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త ఛైర్మన్‌గా కేంద్రం నిపుణుల కమిటీని నియమిస్తుంది. ఈ కమిటీ అన్ని రాష్ట్రాల అర్థగణాంక శాఖల ద్వారా సాగు వివరాలు తీసుకుని, క్షేత్రస్థాయి అంశాలను సాగుదారుల నుంచి సేకరిస్తుంది. ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్రంలో సాగు వ్యయం, భూమి ధరలు ఇలా అన్నింటి ఆధారంగా పంటల వారీగా క్వింటాకు ఎంత ధర నిర్ణయించాలో కోరతాయి. అన్ని రాష్ట్రాల వివరాలు తీసుకోవడంతోపాటు తాము సేకరించిన వివరాల ఆధారంగా కమిటీ కనీస మద్దతు ధరను సిఫార్సు చేస్తుంది. దీని ఆధారంగా క్యాబినెట్‌ కమిటీ ఆన్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌(సీసీఈఏ) నిర్ణయం తీసుకుంటుంది. ఈ కమిటీ మొత్తం 11 అంశాలను లెక్కలోకి తీసుకుంటుంది. ఇందులో ఉత్పత్తి వ్యయం, డిమాండ్‌-సప్లై, మార్కెట్‌పై ధరల ప్రభావం, అంతర్జాతీయంగా ధరల పరిస్థితి ఇలా అనేక అంశాల ఆధారంగా ఈ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com