రైతుల సంక్షేమ జెండా ఎగురవేసిన తెలంగాణా ప్రభుత్వం

అన్నదాతకు వెన్నుదన్ను.. బడుగు బలహీనులకు భరోసా… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదే ఈ ఏటి తెలంగాణ ప్రభుత్వ పద్దు సారాంశం! ‘అపనమ్మకం నుంచి ఆత్మవిశ్వాసంలోకి, అణగారిన స్థితిలోంచి అభ్యున్నతిలోకి.. వలస బతుకుల నుంచి వ్యవసాయ ప్రగతిలోకి’.. అంటూ ఆరంభమైన ఈటల బడ్జెట్‌.. సూటిగా ప్రజల అవసరాలనే తాకింది. తెలంగాణ పల్లె గడ్డ మీద జీవజలం పరవళ్లు తొక్కేలా.. రైతు ఇంట పచ్చదనం ప్రభవించేలా చూడటమే లక్ష్యంగా వ్యవసాయం, సాగునీటి రంగాలకు భారీగా కేటాయింపులు చేసింది. మరోవైపు మైనారిటీలకూ కొండంత అండగా నిలిచింది. మిగతా సంక్షేమ రంగాలకు ఏ లోటూ లేనంతగా పట్టం కట్టింది. రైతన్నకు పెట్టుబడిసాయం చేసే ‘రైతు లక్ష్మి’ పథకానికి రూ.12 వేల కోట్లను ప్రకటించింది. ప్రాధాన్య పథకాలుగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ, కాకతీయ, రెండు పడక గదుల ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌.. తదితరాలన్నింటికీ సముచితంగా కేటాయించింది. వ్యవసాయ, సంక్షేమ రంగాలకు పెద్ద పీట వేస్తూ.. మౌలిక వసతులు, రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 2018-19 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ పద్దులను ఆవిష్కరించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, వాటికి తోడుగా నిలిచే సాగునీరు, విద్యుత్‌ రంగాలకు రాష్ట్ర బడ్జెట్‌లో 26 శాతం నిధులు దక్కాయి. ఏటా రెండు పంటలు పండించే రైతులకు ఎకరాకు ఎనిమిదివేల రూపాయలు చొప్పున పెట్టుబడి ప్రోత్సాహం అందించడానికి వీలుగా కేటాయింపులు చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరం వరకూ రూ.17,000 కోట్ల రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం వ్యవసాయ పునరుజ్జీవం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు పెట్టుబడి ప్రోత్సాహం పేరిట మలి అడుగు వేసింది. వ్యవసాయరంగానికి గతంలో ఎన్నడూలేనంతగా కేటాయింపులు దక్కాయి. గత బడ్జెట్‌కంటే ఒకటిన్నర రెట్లు పెంచుతూ రూ.12,601 కోట్లను కేటాయించింది. సాగునీటి రంగానికి బడ్జెట్‌ వెలుపల నిధులతో నిమిత్తం లేకుండా బడ్జెట్‌లో రూ.25 వేలకోట్లు ఇచ్చింది. విద్యుత్‌ రంగానికి రూ.4,393 కోట్లను ప్రతిపాదించింది. రైతు కుటుంబాలకు విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచేందుకు రూ.5 లక్షల బీమాసదుపాయాన్ని కల్పిస్తూ రైతు బీమా పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కోసం రూ.500 కోట్లను కేటాయించింది. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.522 కోట్లను కేటాయించిది. రైతులకు వడ్డీలేని రుణాల కోసం రూ.500 కోట్లను ప్రతిపాదించింది. కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలాలను వచ్చే ఏడాది అందించేలా దృష్టి సారించింది. రైతులకు గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర లక్ష్యంగా రైతు సమన్వయ సమితిలు పనిచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ అనుబంధరంగాలపై ఆధారపడిన వారికి గొర్రెల పంపిణీ ద్వారా అండగా నిలిచిన ప్రభుత్వం చేపల పెంపకం, కోళ్ల పరిశ్రమలకు ప్రోత్సాహామిచ్చేలా కేటాయింపులను పెంచింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com