రోజా మైనస్ రాజకీయం=శ్రీదేవి

రాజకీయాల్లోకి వెళ్లకపోయుంటే రోజా.. శ్రీదేవిలా పేరుతెచ్చుకునేవారని అంటున్నారు ప్రముఖ దర్శకుడు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ‘పరుచూరి పలుకులు’ పేరుతో తాను తీసిన సినిమాల గురించి, ఇతర సినిమాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు పరుచూరి. తాజాగా రోజా సినీ జీవితం గురించి ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘మా రోజా గురించి మీకు ఆసక్తికర విషయాలు చెబుతాను. రోజా అసలు పేరు శ్రీలత. 1950ల్లో నిర్మాత రామానాయుడు గారు నన్ను ఓ సినిమాకు దర్శకత్వం వహించమని అడిగారు. కానీ కుదరలేదు. అలా పలుమార్లు అడగడంతో ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తానని ఒప్పుకున్నాను. ఆ సమయంలో ‘సర్పయాగం’ అనే నవల రాశాను. దాని ఆధారంగానే సినిమా తీయాలని అన్నయ్య(రామానాయుడు) అన్నారు. సరేనన్నాను. అందులో హీరో శోభన్‌బాబు గారు. ఈ సినిమాలో శోభన్‌బాబు కూతురి పాత్రే కీలకం. కూతురి పాత్రలో ఎవర్ని తీసుకోవాలా? అని ఆలోచిస్తున్న సమయంలో ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమా విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ సినిమాతో నటి మీనకు మంచి పేరొచ్చింది. దాంతో శోభన్‌బాబు కూతురి పాత్రలో మీననే తీసుకుందామని అన్నయ్య అన్నారు.’ ‘కానీ నేను వద్దన్నాను. ‘అదేంటండీ మీనకు మంచి పేరుంది. ఆమె కోసమైనా సినిమా చూడ్డానికి వస్తారు’ అని అన్నయ్య చెప్పారు. ఈ సినిమాలో శోభన్‌బాబు కూతురి పాత్ర చనిపోతుంది. ఇలాంటి పాత్రలో మీన నటిస్తే ప్రేక్షకులు రారు అన్నాను. అప్పట్లో వరలక్ష్మి, పూర్ణిమ.. వీరంతా కూతుళ్లు, చెల్లెళ్ల పాత్రలు పోషించేవారు. వారి పాత్రలు చనిపోయినా సినిమాలు ఆడుతూ ఉండేవి. కానీ అన్నయ్య కొత్త అమ్మాయిని తీసుకోవాలి, శోభన్‌బాబు కూతురంటే మోడ్రన్‌గా ఉండాలి అన్నారు. దాంతో నాకు మూడు రోజులు సమయం ఇవ్వండి అని అడిగాను. ఆ సమయంలో దర్శకుడు, శివప్రసాద్‌(ప్రస్తుతం చిత్తూరు ఎంపీ) గారు నన్ను కలిశారు. ‘అన్నా నేను ‘తపస్సు’ అనే సినిమా చూశాను. అందులో పాటలు చూస్తారా’ అని అడిగారు. సరేనన్నా. అందులో ఓ పాటలో రోజాను చూడగానే నేను కనెక్ట్‌ అయ్యాను. ఈ అమ్మాయే నా సినిమాలో శోభన్‌బాబు కూతురిగా నటించాలని నిర్ణయించుకున్నాను. అమ్మాయి నేచురల్‌గా ఉంది. ‘తపస్సు’ సినిమాను మీలో చాలా మంది చూసి ఉండరు. అందులో రోజా చాలా బాగా నటించింది. ‌ఈ సినిమాలో రోజాను చూశాక ఆర్టిస్‌ ముఖంలో ఓ ప్రత్యేకమైన మెరుపు ఉంటుందని తెలిసింది. రోజా ఫొటోను అన్నయ్యకు చూపించా. ఆయన ఫొటో చూసి ‘నల్లగా ఉంది కదా?’ అన్నారు. అప్పుడు నేను..‘శోభన్‌బాబుకు కూతురిగా నటించే అమ్మాయి నల్లగా ఉండకూడదు అని రూలేం లేదు కదా? అని అడిగాను. ఆ తర్వాత సినిమా పట్టాలెక్కింది. రామానాయుడు స్టూడియోస్‌లో రోజాకు విభిన్న దుస్తులు వేసి రిహార్సల్స్‌ చేస్తున్నాం. ఆ సమయంలో రోజా ఒక్కసారిగా స్విమ్‌ సూట్‌ వేసుకుని వచ్చేసింది. ‘అదేంటమ్మా ఇలా వేసుకున్నావు. ఇది నీ పాత్ర కాదు కదా?’ అన్నాను. ‘సర్‌ ప్లీజ్‌’ అంది. తనకి శ్రీదేవిలాగా గ్లామరస్‌ హీరోయిన్‌ అవ్వాలన్న కోరిక ఉండేది. కానీ నేను తీయబోయే సినిమాలో శోభన్‌బాబు కూతురిది సానుభూతి ఉన్న పాత్ర అని నచ్చజెప్పాను. దాంతో రోజా కన్నీరుపెట్టుకుంది.’ ‘ ‘నువ్వు చదువుకుంటున్న పిల్లవి. నువ్వు చేసిన ‘తపస్సు’ సినిమా ఆడలేదు. ఇప్పుడు నేను తీసే సినిమా ఆడుతుందో లేదో తెలీదు. అప్పుడు నువ్వు మళ్లీ చదువుకోవడానికి వెళ్లాల్సి వస్తే పరిస్థితేంటి?’ అని అడిగా. ఇందుకు తను..‘ఆ శ్రీలేత లేదు. ఇది రోజా’ అంది. అప్పుడు అర్థమైంది రోజా ఎంత మొండిపిల్లో. సినిమా చిత్రీకరణ జరిగేటప్పుడు అన్నయ్య నన్ను పక్కన కూర్చోబెట్టుకుని ‘రోజాను తీసేసి మీనాను పెడదాం’ అన్నారు. అప్పుడు నేను.. ‘మీరు రోజాను తీసేటట్లైతే దర్శకుడిగా నన్ను తీసేసి వేరొకరిని పెట్టుకోండి. నా మాట వినండి సర్‌. ఏదో ఒకరోజు రోజా డేట్లు కావాలని మీరే నాకు ఫోన్‌ చేస్తారు’ అన్నాను. ఆ తర్వాత చిత్రీకరణ జరిగిపోయింది. అప్పట్లో రోజా నన్ను డాడీ అని పిలిచేది. ‘డాడీ ‘సర్పయాగం’ సినిమా 100 రోజులు ఆడితే నీ చిటికెన వేలుకు ఉన్న ఉంగరం ఇచ్చేస్తారా?’ అని అడిగింది. సినిమా నిజంగా ఆడితే 100 డేస్‌ ఫంక్షన్‌లోనే ఉంగరం ఇచ్చేస్తాను అన్నాను. అన్నట్లుగానే సినిమా ఆడింది. 100 డేస్‌ ఫంక్షన్‌లో ఉంగరం తీసి ఇచ్చేశాను. రోజా రాజకీయాల్లోకి కాకుండా సినిమాల్లోనే ఉండుంటే కచ్చితంగా శ్రీదేవి అంతటి పేరు తెచ్చుకునేది’ అని చెప్పుకొచ్చారు పరుచూరి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com