రోజుకి పావుగంట యోగా చాలా మంచిది

యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని భారతీయ తత్వవేత్తలు ప్రపంచానికి చాటి చెప్పారు. నిజానికి ఒకప్పటి జీవన పరిస్థితులతో పోలిస్తే ఈ ఆధునిక కాలంలోనే దీని అవసరం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవ.. ఐక్యరాజ్యసమితి ఆమోదంతో యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది. దేశదేశాలు జరుపుకొనే పండగైంది. ఐదు వేల ఏళ్లుగా భారతీయ జీవన విధానంలో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న యోగ విద్య నేడు విశ్వవ్యాప్తమైంది. విశ్వమానవాళి సంపూర్ణ ఆరోగ్యానికి సహస్రాధిక వేదికయై వూరూరా ఉత్సవమైంది.
**ప్రాక్‌పశ్చిమాలు ఏకమవుతున్నాయి.. భారతీయ సంస్కృతీ వైభవానికి చిహ్నమైన ప్రాచీన యోగవిద్య ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది.. అమెరికా, చైనా, యూకే, జపాన్‌.. దాదాపు అన్ని దేశాల్లోనూ ప్రజలు యోగసాధకులవుతున్నారు.
**అమెరికా
వాషింగ్టన్‌ నుంచి టెక్సాస్‌ నగరం వరకూ యోగ సాధన ప్రజలను ఆకర్షిస్తోంది. వాషింగ్టన్‌లో, హూస్టన్‌లో భారత కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, స్థానిక సంస్థలతో కలిసి యోగా కార్యక్రమాలను ప్రాచుర్యంలోకి తీసుకువస్తున్నాయి. శాంతి, సామరస్యానికి దోహదపడే యోగాను భారతదేశం ప్రపంచానికి అందించిందని భారత దౌత్యకార్యాలయ అధికార్లు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు ఏర్పాటు చేసిన సన్నాహక కార్యక్రమాల్లో వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, అమెరికా ప్రభుత్వ అధికార్లు, వివిధ నగరాల మేయర్లు పాల్గొన్నారు.
**జపాన్‌
జపాన్‌లో యోగా సందడి ఎప్పుడో మొదలైంది. జపాన్‌ సంస్కృతి, సాంప్రదాయాలకు యోగా దగ్గరగా ఉండటంతో ఈ దేశంలో ప్రజలు పెద్దఎత్తున ముందుకు వస్తున్నారు. ఈ సంప్రదాయ విద్యను ప్రోత్సహించేందుకు ఇప్పటికే జపాన్‌ ఒక పార్లమెంటరీ బృందాన్ని ఏర్పాటు చేసింది. యోగాను ప్రోత్సహించేందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్న తొలిదేశం జపాన్‌.
**ఫ్రాన్స్‌
ఫ్రాన్స్‌ అనగానే ఈఫిల్‌ టవర్‌ గుర్తుకు వస్తుంది. పారిస్‌ నగరంలోని ఈ చారిత్రాత్మక, పర్యాటక ప్రదేశం యోగా సాధకులతో కళకళలాడుతోంది. యోగా పట్ల ఆకర్షితులవుతున్న వారి సంఖ్య పెరుగుతుందనటానికి అక్కడ ఏర్పాటవుతున్న యోగా స్టూడియోలు, శిక్షణ కేంద్రాలే నిదర్శనం. వివిధ రకాలైన భారతీయ యోగా విధానాలను ప్రజలు ఆదరిస్తున్నారు.
**ఈజిప్టు
ఈజిప్టు రాజధాని కైరోలోనే కాకుండా అలగ్జాండ్రియా, ఇస్మాలియా నగరాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను ఈసారి నిర్వహించనున్నారు. సన్నాహక చర్యల్లో భాగంగా మౌలానా ఆజాద్‌ సెంటర్‌ ఫర్‌ ఇండియన్‌ కల్చర్‌ (ఎంఏసీఐసీ) ‘శాంతియుత సహజీవనానికి యోగా’ అనే పేరుతో ఒక సదస్సు నిర్వహించింది. భారతదేశంలోని కేరళలో శిక్షణ పొందిన ఈజిప్టు యోగా శిక్షకుడు హలా బరాకత్‌ ఈజిప్టులో యోగా సాధకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
**చైనా
అంతర్జాతీయ యోగా దినోత్సవం మనదేశంలో ఎంత ఘనంగా జరుగుతుందో అంతే ఘనంగా చైనాలో నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా చైనాలో యోగా ఎంతో ప్రజాదరణ పొందుతోంది. భారతదేశం నుంచి వెళ్లిన యోగా శిక్షకులు ఇక్కడ యోగా సాధకులను తయారు చేస్తున్నారు. అందుకే అంతర్జాతీయ యోగా దినోత్సం చైనాలో పెద్ద పండుగ. దీన్ని పురస్కరించుకొని కేవలం బీజింగ్‌లోనే కాకుండా పలు నగరాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకమైన, ఎంతో పురాతనమైన చైనా గోడ వద్ద నిర్వహించే యోగా కార్యక్రమాలు అతిపెద్ద ఆకర్షణగా నిలుస్తున్నాయి.
**యూకే
మూడో అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహక కార్యాక్రమాలు బ్రిటన్‌లోని ప్రముఖ నగరాల్లో సందడిగా జరుగుతున్నాయి. లండన్‌లోని ట్రఫాల్గర్‌ స్వైర్‌ ఈ అంతర్జాతీయ దినోత్సవానికి ప్రధాన వేదికగా ఉంది. ఇక్కడ యోగాభ్యాసాలు, భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు పెద్దఎత్తున నిర్వహించబోతున్నారు. లండన్‌ మేయర్‌, ఈ ప్రముఖులు ఈ కార్యక్రమాలకు హాజరుకానుండటం ప్రధాన ఆకర్షణ.
**పాకిస్థాన్‌
ముస్లిం దేశమైనప్పటికీ పాకిస్థాన్‌లో యోగా ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతోంది. పాకిస్థానీ బాబా రామ్‌దేవ్‌గా పేరొందిన షంషాద్‌ హైదర్‌ అక్కడ యోగా సంస్కృతిని విస్తరింపజేయటంలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నారు. లాహోర్‌ నగరంలో ఇటీవల కాలంలో ఎన్నో యోగా శిక్షణ కేంద్రాలు, క్లబ్‌లు వెలిశాయి. ఆత్మశాంతి, శారీరక దృఢత్వం కోసం యోగా చేసే మేలును పరిగణలోకి తీసుకొని ఆ దేశంలో మతానికి అతీతంగా ఎంతోమంది యోగా వైపు ఆకర్షితులు అవుతున్నారు. పాకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com