లండన్ తెలుగు సంఘం యువజన విభాగాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్


ఇటీవల లండన్‌ పర్యటనకు వెళ్లిన ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ (తాల్‌) కొత్త విభాగం ‘తాల్‌ యూత్‌’ను ఆవిష్కరించారు. నవంబర్‌ 18న తూర్పు లండన్‌లోని విల్లోస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు తెలుగు యువకులు పవన్‌కల్యాణ్‌తో కలిసి ముఖాముఖిలో మాట్లాడే అవకాశం దక్కిందని తాల్‌ ఛైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి మేడిశెట్టి ఓ ప్రకటనలో తెలిపారు. యూకేలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలైన ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌, యూసీఎల్‌, ఎల్‌ఎస్‌బీ, కేసీఎల్‌ నుంచి సుమారు 200 మంది తెలుగు కుటుంబాలకు చెందిన యువకులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా యూత్‌ తాల్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌ను పవన్‌ కల్యాణ్‌ ఆవిష్కరించారు. యువత సాధికారత, లింగ సమానత్వం, వర్తమాన వ్యవహారాలు, జనసేన రాజకీయ అజెండా, సినిమాలో నటన తదితర అంశాలపై యువకులు అడిగిన ప్రశ్నలకు పవన్‌ ఓపికగా జవాబులు చెప్పారు. సామాజిక సమస్యలపై ఆయన చేస్తున్న పోరాటం, ఉద్ధానం కిడ్నీ సమస్య తదితర అంశాలను పవన్‌ వివరించారు. అనంతరం తాల్‌ మాజీ ఛైర్మన్‌ శ్రీధర్‌ వనం మాట్లాడారు. పవన్‌ కల్యాణ్‌ యూత్‌ వింగ్‌ను ఆవిష్కరించడం ఎంతో సంతోషకరమన్నారు. తాల్‌ చరిత్రలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. పవన్‌ నటుడిగా ప్రేక్షకులను అలరిస్తూనే, బయట ప్రజలకు అనేక సేవలందిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ను తాల్‌ బోర్డు ట్రస్టీలు శాలువాతో సన్మానించి జ్ఞాపికను బహూకరించారు. మధ్యాహ్నం భోజనం అనంతరం తాల్‌ చిల్డ్రన్స్‌ డే కార్యక్రమం నిర్వహించారు. తాల్‌ సాంస్కృతిక కేంద్రానికి చెందిన 50 మంది చిన్నారులు వీణాపాణి కోన నేతృత్వంలో చేసిన కర్ణాటక సంగీతం, ఎం.సి.సుజేంద్రబాబు నేతృత్వంలో శాస్త్రీయ సంగీత ప్రదర్శనలు అలరించాయి. ప్రముఖ సినీగాయకుడు అనుదీప్‌ దేవరకొండ మైమరపించే తెలుగు పాటల కచేరి ఉర్రూతలూగించింది. సౌమ్య వారణాసి, కల్యాణి గేదెల వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి యూకే వ్యాప్తంగా సుమారు 1000 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తాల్‌ సలహాదారులు డాక్టర్‌ రాములు దాసోజు, రామానాయుడు బోయల్ల, సత్యేంద్ర పగడాల, సంజయ్‌ భిరాజు, డాక్టర్‌ వేణు కవర్తాపు, తాల్‌ బోర్డు ట్రస్టీలు శ్రీధర్‌ మేడిశెట్టి (ఛైర్మన్‌), శ్రీధర్‌ సోమిశెట్ట (వైస్‌ ఛైర్మన్‌, కోశాధికారి), భారతి కందుకూరి, నిర్మల దవల, మల్లేశ్‌ కోట, గిరిధర్‌ పొట్లూరి, మురళి తాడిపర్తి, రాజేశ్‌ తోలేటి, శ్రీనివాస్‌రెడ్డి కొన్రెడ్డి, సూర్య కందుకూరి, వంశీ మోహన్‌ సింగలూరి, బాలాజి కల్లూరు, రవి మాచర్ల తదితరులు పాల్గొన్నారు.
























More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2017 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com