లాల్ బహదూర్ స్టేడియం పూర్వనామం-ఫతే మైదాన్

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను ముట్టడించి శతాబ్దాలు గడుస్తున్నా, ఆనాటి ఆనవాళ్ళు చారిత్రక కథలను చెబుతూనే ఉన్నాయి. కాలగమనంలో తరతరాల వారసత్వానికి వాస్తవాలు కనుమరుగయ్యే విధంగా ఆంధ్రపాలకులు తెలంగాణలోని పలుప్రాంతాల పేర్లు మార్చడంతో కొత్తతరం అదే చరిత్రగా తెలుసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ వాస్తవచరిత్ర ప్రజల ముందుంచాల్సిన అవశ్యకత అవసరమైంది. అంతర్జాతీయ క్రీడలకు వేదికై హైదరాబాద్ క్రీడాస్ఫూర్తిని ద్విగుణీకృతం చేస్తున్న ఎల్‌బి స్టేడియం అంటే అందరికీ అదో ఆటస్థలంగానే తెలుసు. కానీ గోల్కొండ ముట్టడికీ, వేలాది ఔరంగజేబు మెుఘల్ సైన్యం ఇక్కడే విడిది చేసిందని ఎందరికి తెలుసు. అయితే ఈ చరిత్రకోణాల్లోకి వెళ్తే హైదరాబాద్ విధ్వంసానికి ఔరంగజేబు యుద్ధతంత్రానికి నేటి ఎల్.బి స్టేడియమే వేదికైంది. క్రీస్తుశకం 1512లో కులీకుతుబ్ షాహి వంశపాలకులు స్థాపించిన గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు 1687 అక్టోబర్ 3న ధ్వంసం చేసి స్వాధీనం చేసుకున్నారు.రక్తం ఏరులై ప్రవహించిన ఈ యుద్ధంలో పాల్గొన్న మెుఘలు సేనలు నేటి ఎల్.బి. స్టేడియంలోనే విడిది తీసుకున్నారు. నెలల తరబడి సాగిన ఈ యుద్ధం కోసం ఇక్కడ శిబిరాలు వేసుకుని నేటి పబ్లిక్ గార్డెన్ లో మెుక్కలను పెంచుతూ విహరించేవారు. మెుఘలులు చెట్లు పెంచిన ప్రాంతం పబ్లిక్ గార్డెన్‌గా తెలిసిందే కానీ ఇది ఎలా ఏర్పడిందో తెలీదు. అలాగే చక్రవర్తి ఔరంగజేబు ప్రార్థనలకోసం నేటి పబ్లిక్ గార్డెన్‌లో ఆనాడే మసీదు నిర్మాణం జరిగింది. యుద్ధానికి ముందు ఔరంగజేబు గోల్కొండ పాలకుడు అబ్దుల్ హసన్ తానీషాకు షరతులు విధించారు. ఛత్రపతిశివాజితో స్నేహం చేయవద్దు, అక్కన్నమాదన్నలను తొలగించాలి, మెుఘల్ సార్వభౌమ అధికారాన్ని అంగీకరించి కప్పం కట్టాలి అనిమందలించాడు. వీటికి అంగీకరించని తానీషా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. ధిక్కారాన్ని తీవ్రంగా పరిగణించిన ఔరంగజేబు వేలాది సైన్యంతో హైదరాబాద్‌లో మకాంవేసి నెలల తరబడి యుద్ధతంత్రాలను రచించారు.మార్చి1686 లో అక్కన్నమాదన్నలను హత్యచేయించి కోటముట్టడికి యుద్ధం చేశాడు. కోటగోడ రంధ్రాల్లో ఫిరంగి మందులు పెట్టి పేల్చినా చెక్కుచెదరలేదు. పైగా కోటగోడలోని రాళ్ళు లేచి ఔరంగజేబు సైన్యానికి తాకగా 11 వందల మంది చనిపోయారు. నెలల తరబడి కోటను ముట్టడించే ప్రయత్నం విఫలం కావడంతో కుట్రపూరితంగా తానీషాప్రియురాళ్ళు సరుమ, జానేసాహిబ సహకారంతో తెల్లవారంగా 3 గంటలకు గోల్కొండ కోట ఫతే దర్వాజా రక్షకుడు అబ్దుల్లా ద్రోహంతో తలుపులు తెరుచుకున్నాయి. అప్పుడు తానీషా రాజోచిత దుస్తులు ధరించి తనను బంధించేందుకు వచ్చిన సైనికులకు భోజనం వడ్డించమని సేవకులను ఆదేశించినా కరుడుకట్టిన సేనలు తానీషాను బంధించి ఔరంగజేబుకు అప్పగించారు. ఈ సందర్భంగా కోటలో మెుఘల్ సేనలు ప్రముఖులందరిని వధించారు. రక్తం ఏరులుగా ప్రవహింపజేశారు. అంతఃపురకాంతలు శత్రుసేనలకు చిక్కకుండా కోటపైన ఉన్న బావుల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ యుద్ధానికి , రాజతంత్రానికి వేదిక, విడిది అయిన నేటి ఎల్.బి.స్టేడియంకు ఆనాడు పెట్టిన పేరే ఫతే మైదాన్.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com