లోక్‌నాయక్ పురస్కారం మరో నోబెల్ కావాలి-జస్టిస్ జాస్తి


‘సమాజంలో పురస్కారాలకు కొదవ లేదు… చాలా ఉన్నాయి. నోబెల్‌ బహుమతి అంటే పెద్ద మొత్తం అందుతుందని అనుకుంటారు…ఇది నిజం కాదు. నిర్దిష్టమైన ప్రమాణాలతో, వివిధ రంగాల్లో నిపుణులు, గొప్పవాళ్లు ఈ విజేతలను ఎంపిక చేస్తారు. ఈ బహుమతి కోసం ఎంపిక చేసిన విధానం గొప్పది. అదే ప్రమాణాలను లోక్‌నాయక్‌ పురస్కార ఎంపికలోనూ అమలు చేయడం గొప్ప విషయం…’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ వ్యాఖ్యానించారు. లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 13వ వార్షిక సాహిత్య పురస్కారాన్ని శనివారం రాత్రి విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయంలోని డాక్టర్‌ అంబేడ్కర్‌ అసెంబ్లీ సమావేశ ప్రాంగణంలో ప్రజా కవి గోరటి వెంకన్నకు అందజేశారు. సభలో జస్టిస్‌ చలమేశ్వర్‌ మాట్లాడుతూ… ‘నోబుల్‌ బహుమతి ఎంతో గొప్పదైనప్పటికీ ఇందులోనూ ఒక తమాషా చోటు చేసుకుంది. 1961-62లో మొహనిరీ అనే పెద్ద రచయితకు ఈ బహుమతి లభించింది. దీన్ని అందుకున్న వ్యక్తులకు అమెరికా అధ్యక్షుడు తనతో కలిసి భోజనానికి ఆహ్వానిస్తుంటారు. అదే విధంగా మోహనిరీకి కూడా అధ్యక్షుడి నుంచి ఆహ్వానం అందింది. దీనిపై 80 ఏళ్ల వయసున్న ఆయన ముక్కు మోహం తెలియని వ్యక్తితో కలిసి భోజనం చేసేందుకు 3 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి రావాల్సిన అవసరం లేదని సమాధానమిచ్చారు. ఇది ఆయనలోని ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి నిదర్శనం. నోబుల్‌ బహుమతి ఎంపికలో పాటించిన ప్రమాణాలకు ఈ సంఘటన అద్దం పడుతోంది..’ అని వివరించారు. సాహిత్య రంగానికే కాకుండా, ఇతర రంగాల్లోని గొప్ప వాళ్లను కూడా గుర్తించి పురస్కారాలు అందించే విషయాన్ని పరిశీలించాలని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను కోరారు. తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి అంతా కలిసి రావాలసి పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ మన పాట, ఆట, భాష గ్రామీణులకు అర్థమయ్యేలా గోరటి వెంకన్న చేస్తున్న కృషిని అభినందించారు. తెలుగు భాషలో గొప్పతనం, అందులోని తీయదనం ఈ సభతో తనకు తెలిసిందని చెప్పారు. జాతీయ న్యాయ అకాడమీ సంచాలకుడు జస్టిస్‌ జి.రఘురాం మాట్లాడుతూ గోరటి వెంకన్న రాతలు, గీతాలు చదవకపోయినా, వినకపోయినా ఆయన గొప్పతనం తెలిసిందన్నారు. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ ఉత్సవ్‌లో భాగంగా ఈ ఏడాది నుంచి వివిధ రంగాల్లో నిష్ణాతులను ఎంపిక చేసి ప్రభుత్వం తరఫున పురస్కారాలు అందజేస్తామన్నారు. లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎంవీవీఎస్‌ మూర్తి, రచయిత డాక్టర్‌ వి.అచ్యుతరామారావు (లండన్‌), తాతా ప్రకాశరావు (చికాగో), కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి మీడియా సలహాదారు ఎ.కృష్ణారావు తదితరులు ప్రసంగించారు. గోరటి వెంకన్న మాట్లాడుతూ ఉత్తరాంధ్రపై తనుకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ పలు పాటలు పాడి నృత్యాలు చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com