వామ్మో…అమెరికా! తెలుగు జాతి పరువు తీస్తున్నారుగా–TNI ప్రత్యేకం

అగ్ర రాజ్యం అమెరికాలో ఇటీవల జరుగుతున్న రాజకీయ సంఘటనలు తెలుగుజాతి పరువును బజారున పడేస్తున్నట్లుగా ఉన్నాయి. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జీవనోపాధి కోసం పొట్ట చేతపట్టుకుని అమెరికా వెళ్ళిన కొందరు చేస్తున్న వెకిలి చేష్టలను తెలుగు ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు.
**సమాజంలో ప్రతి ఒక్కరికి కొన్ని స్పష్టమైన అభిప్రాయాలు ఉంటాయి. తనకిష్టమైన పార్టీని, తనకు ఇష్టమైన నాయకుడిని అభిమానించవచ్చు. తన ఇంట్లో తాను నమ్మిన పార్టీ జెండాను పెట్టుకోవచ్చు. తనకు నచ్చిన రాజకీయ నాయకుడికి ప్రతి రోజు పూజలు చేసుకోవచ్చు. ఇంతవరకు ఎవరికీ ఏవిధమైన అభ్యంతరాలు ఉండవు. ఇటీవల కాలంలో కొందరు యువకుల రాజకీయాభిమానం హద్దులు మీరి మహాసభల పేరుతొ భారీగా విరాళాలను వసూళ్లు చేస్తూ పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకుంటున్నారు. తమ అభిమాన రాజకీయ పార్టీకి ఆ పార్టీ ముఖ్య నేతలకు జేజేలు పలుకుతూ నీరాజనాలు ఇస్తున్నారు. ఇది కూడా ఏమాత్రం అభ్యంతరం కాదు. ఇందులో కూడా ఏవిధమైన తప్పు లేదు. తమకిష్టమైన పనిని మరొకరికి ఇబ్బంది లేకుండా అట్టహాసంగా, బహిరంగంగా గాని, నాలుగు గోడల మధ్య గానీ జరుపుకోవచ్చు.

**ఎందుకీ నిరసనలు ?
అమెరికాలో చట్టాలు చాలా కటినంగా ఉంటాయన్న సంగతి మనవాళ్ళు అందరికి తెలుసు. ఇక్కడిలాగా బహిరంగంగా అక్కడ నిరసన ప్రదర్శనలు చేయడం పై చాలా ఆంక్షలున్నాయి. బయట దేశపు వ్యక్తులు అమెరికాలో నిరసన ప్రదర్శనలు చేయటాన్ని అక్కడి పోలీసులు ఏమాత్రం సహించరు. కానీ ఇటీవల కొన్ని సంఘటనలు పరిశీలిస్తే అక్కడ ఉంటున్న కొందరు తెలుగువారు తమ హద్దులు దాటి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. న్యూజెర్సీలో భాజపా ఎంపీ జీ.వీ.ఎల్.నరసింహారావు వాషింగ్టన్ డీసీలో ఆ పార్టీ అగ్రనేత రాంమాధవ్ లు పర్యటించినపుడు కొందరు తెలుగుదేశం అభిమానులు బహిరంగంగా నిరసనలకు దిగారు. భాజపా అభిమానులు జరుపుకుంటున్న సభలోకి దూసుకువెళ్ళి నిరసనలు వ్యక్తపరిచారు. అమెరికా వంటి దేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం.
**డల్లాస్ లో మహానాడుకు ముందు నిరసన ఎందుకు?
గతవారంలో డల్లాస్ లో తెలుగుదేశం పార్టీకు చెందిన అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆవిధంగా నిర్వహించుకునే స్వేచ్చ వారికి ఉంది. మహానాడు జరుగుతున్న ప్రదేశం ముందు కొద్దిమంది వ్యక్తులు నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల చొక్కాలు వేసుకుని నిరసన వ్యక్తం చేయడం నీతిమాలిన చర్య. తెలుగుదేశం వ్యతిరేకులే కాదు, తెలుగుదేశం అభిమానులైనా సరే ఇటువంటి నిరసన కార్యక్రమాలను అమెరికా వంటి దేశంలో చేపట్టడం పట్ల ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలు సిగ్గుతో తల దించుకుంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డల్లాస్ పర్యటన సందర్భంగా ఇటువంటి నిరసనలు కొందరు వ్యక్తపరచడం అని , పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం, దర్యాప్తులు జరగడం తెలుగు ప్రజల అందరికి అవమానకరం. ఇటీవల అమెరికాలో జరుగుతున్న తెలుగు సంఘాల సభలు , సమావేశాల్లో ఆధిపత్య పోరు కనిపిస్తోంది.
**ఇప్పటి వరకు అమెరికాలో ఉన్న మన తెలుగువాళ్ళు మేధావులని క్రమశిక్షణతో పని చేసుకుంటున్నారని నాలుగు డబ్బులు సంపాదిస్తూ రాష్ట్రం అభివృద్దికి కూడా విరాళాలు పంపుతున్నారని ఇక్కడి ప్రజలు అమెరికాలో ఉన్న మనవాళ్ళందరిని చూసి గర్వపడుతున్నారు. ప్రవాస తెలుగువారిని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ ఉన్న చాలామంది బడుగు బలహీన వర్గాలు తమకు ఉన్నదంతా అమ్ముకుని తమ పిల్లలను ఉన్నత విద్య కోసం అమెరికాకు పంపుతున్నారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళిన విద్యార్ధులకు ఉపాధి కరువవుతుంది. అక్కడ ఉన్న కొంత మంది స్వార్ధ రాజకీయ నాయకులు అక్కడకు వెళ్ళిన విద్యార్ధులను కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

**తెలుగు సంఘాల నేతల వైఖరిలో మార్పు రావాలి.
తానా, ఆటా , నాట్స్ వంటి తెలుగు సంఘాలకు గతంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉండేవి. అప్పట్లో వాటికి ఎన్నికైన నేతలు కేవలం అక్కడ ఉన్న తెలుగు ప్రజల సంక్షేమం కోసం ఇక్కడ ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం పైనే దృష్టి పెట్టేవారు. ఈ మహాసభలు అమెరికాలో జరిగే సమయంలో చాలా మంది ప్రముఖులు అమెరికా వెళ్లి ఆ సభల్లో ముఖ్య అతిధులుగా పాల్గొనడం గర్వకారణంగా భావించేవారు. మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, మర్రి చెన్నారెడ్డి, రామోజీరావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి ప్రముఖులు ఈ మహాసభలకు హాజరై అమెరికాలో ఉన్న తెలుగువారిని ప్రసంశలతో ముంచెత్తారు. తెలుగు జాతికి ప్రవాసులు అందిస్తున్న సేవలను కొనియాడేవారు. ప్రస్తుతం పరిస్థితులు తిరగబడ్డాయి. ఇప్పటి తెలుగు సంఘాల నేతలు, పదోతరగతి కూడా పాస్ కానీ మంత్రులు, ఇతర రాజకీయ నేతల వెంట తిరుగుతూ తన పరువును దిగజార్చుకోవడంతో పాటు అమెరికాలో ఉన్న తెలుగువారి పరువును మంటగలుపుతున్నారు. తరచుగా రాష్ట్రానికి వస్తూ రాజకీయ నేతలకు ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారు. ఒకరిద్దరు మంత్రులు మూడునెలలకోసారి అమెరికాలో పర్యటించడం వారికి ఈ తెలుగు సంఘాల నేతలు ఊడిగం చేయడం విమర్శలకు తావిస్తోంది.

**పిచ్చి అభిమానం వెర్రి తెలలు వేస్తోంది.
అమెరికాలో నాలుగు డబ్బులు సంపాదించిన కొందరు గుర్తింపు కోసం వ్యక్తిత్వాలను చంపుకొని అడ్డదారులు తప్పుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాము ఉన్నత విద్యా వంతులమనే విషయాన్నే మరచిపోయి తాము అభిమానించే రాజకీయ నాయకులకు , సినిమా వాళ్ళకు, జైజైలు పలుకుతుండడం ఇక్కడ ఉన్న తెలుగు వారిని బాధపెడుతోంది. అక్కడున్న తెలుగువారు సైతం కొందరి చర్యల మూలంగా తమ పరువు పోతోందని వాపోతున్నారు.
**వారిని చూసి సిగ్గు తెచ్చుకోండి?
అమెరికాలో మన తెలుగు వారు చాలా రంగాలలో దూసుకువేళ్తున్నారు. చివుకుల ఉపేంద్ర, అరుణ మిల్లర్ వంటి నేతలు అక్కడ రాజకీయాల్లో ప్రముఖ స్థానానికి చేరుకున్నారు. వారి పద్దతులు, నడవడిక తెలుగువారికే కాకుండా యావత్ భారత జాతికే గర్వకారణంగా ఉంటుంది. కాలిఫోర్నియాలో ఉంటున్న ఇరువురు ప్రముఖ డాక్టర్లు వై.ఎస్.రాజశేఖర రెడ్డికి వీరాభిమానులు. వైకాపా పార్టీకి మిలియన్ల కొద్ది విరాళాలు ఇచ్చారు. అయినప్పటికీ వారు ఏనాడు తెలుగుదేశం పార్టీని గానీ, చంద్రబాబు నాయుడిని గానీ ఎక్కడా బహిరంగంగా విమర్శలు చేయలేదు. పైగా చంద్రబాబు , లోకేష్ కాలిఫోర్నియా వచ్చినపుడు ఆ డాక్టర్లను కూడా కలిశారు. రాష్ట్రాభివృద్ధికి తమవంతు విరాళాలు అందించారు. వాషింగ్టన్ డీసీలో ఉంటున్న ఒక ప్రముఖ తెలుగు ప్రొఫెసర్ భాజపాకి వీరాభిమాని ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబుకు , బాలకృష్ణలకు కూడా ఆయన అభిమాని అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ సంఘటనలు దురదృష్ట కరమైనవని ఆ ప్రొఫెసర్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు.
**పురిటి కంపు పోకముందే..
జనసేన పార్టీ ఇంకా పురిటి దశలోనే ఉంది. ఈ పార్టీకి కూడా అమెరికాలో తలనొప్పులు మొదలయ్యాయి. త్వరలో జరగనున్న పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని నిర్వహించడానికి అక్కడ ఉన్న ఆపార్టీ కార్యకర్తలు నాలుగు వర్గాలుగా ఏర్పడినట్లు సమాచారం.

**అమ్మో అమెరికానా..?
ప్రస్తుతం అమెరికాలో మన తెలుగు వారి మధ్య ఏర్పడిన వర్గ పోరు , రాజకీయ కొట్లాటల ప్రభావం ఇక్కడ రాజకీయ నాయకుల పైన తీవ్ర ప్రభావాన్నే చూపుతుంది. అక్కడ జరిగే తెలుగు మహాసభల్లో ముఖ్య అతిధులుగా పాల్గొనటానికి గతంలో తహతహలాడే రాజకీయ ప్రముఖులు ఇప్పుడు అమెరికాలో జరిగే తెలుగు మహాసభలకు వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. ఇటీవల అమెరికాలో పర్యటించిన ఒక తెలుగుదేశం కీలక నేత అక్కడ నెలకొని ఉన్న పరిస్థితుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్త పరిచారు. ఆయన పర్యటనను కుదించుకుని వెనక్కి వచ్చేశారు. ఇప్పటికైనా అమెరికాలో ఉన్న మన తెలుగువారు తెలుగు జాతి, తెలుగు ప్రజలు గర్వించే విధంగా నడుచుకోవాలని మార్గదర్శకులుగా ఉండాలనీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.-కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com