వినూత్న సాంకేతికతలు

ఒకప్పుడు మాటలకే పరిమితమైన డ్రోన్లు ఇప్పుడు పెళ్లిళ్లలో ఫొటోలు తీసేస్తున్నాయి. అనేక సందేహాలను పటాపంచలు చేస్తూ త్రీడీ ప్రింటింగ్‌ స్టార్టప్‌లు మన దగ్గరే వెలుస్తున్నాయి. వూహించడానికే ఆశ్చర్యంగా అనిపించే ఎన్నో గాడ్జెట్లు గతేడాది వినియోగంలోకి వచ్చాయి. ఈ ఏడాది అంతకుమించిన టెక్నాలజీ మార్కెట్‌ను కమ్మేస్తుందన్నది టెక్‌ నిపుణుల అంచనా. సూపర్‌మేన్‌ గాల్లో ఎగరడం చూసి సినిమాల్లో మాత్రమే అది సాధ్యమనే వాళ్లు, ఆ మాటను వెనక్కి తీసుకోవల్సిన సమయం వచ్చేసింది. ‘జెట్‌ప్యాక్‌ ఇంటర్నేషనల్‌’ అనే సంస్థ మామూలు మనుషుల్ని కూడా తమకు కావల్సిన చోటికి క్షణాల్లో ఎగిరి వెళ్లే అవకాశాన్ని అందించడానికి సిద్ధమైపోయింది మరి. రెండు మూడేళ్ల క్రితం వాళ్లు జెట్‌ప్యాక్‌ని తయారు చేసినప్పుడు కేవలం ఉన్నచోటు నుంచి కొన్నిక్షణాలు మాత్రమే పైకెగిరేలా చేయగలిగారు. క్రమంగా ప్రయోగాల్ని ముందుకు తీసుకెళ్తూ గంటకు 110కి.మీ వేగంతో 40 నిమిషాల పాటు ఎగరగలిగేంత శక్తిమంతమైన జెట్‌ప్యాక్‌లను రూపొందించారు. అద్దాలకి అర్థాన్ని మారుస్తూ ‘పర్సుస్‌’ అనే ఓ సంస్థ, అవసరమైనప్పుడల్లా స్మార్ట్‌ ఫోన్‌లా, టీవీలా, కంప్యూటర్‌ తెరలా వాటిని మార్చుకునే విధంగా తయారు చేసింది. వైఫై ఆధారంగా పనిచేసే ఆ అద్దంలో ఇంటర్నెట్‌ని బ్రౌజ్‌ చేసుకోవచ్చు. తయారవుతూనే అవతలి వాళ్లతో వీడియో చాట్‌ చేయొచ్చు. దాన్ని తాకే పనిలేకుండా నోటి ఆదేశం ద్వారానే ఫొటోలూ తీసుకోవచ్చు. ఈ తరం వాళ్లకు ఫొటోలంటే మొదట గుర్తొచ్చేది సెల్ఫీలే. వాటిని ఇంకాస్త బాగా తీసుకునేందుకు సెల్ఫీ స్టిక్‌లు వచ్చాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ సెల్ఫీడ్రోన్‌లూ రాబోతున్నాయి. ఫోన్‌ అంత పరిమాణంలో జేబులో పట్టే ఈ డ్రోన్‌లకు ఓ బుల్లి కెమెరా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లోని ఓ అప్లికేషన్‌ ఈ డ్రోన్‌లను నియంత్రిస్తుంది. దాదాపు అరవై అడుగుల ఎత్తుకు ఎగిరే ఈ బుల్లి డ్రోన్‌లతో ఎవరి సాయం లేకుండా మనతో పాటు మన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కూడా కలిపి ఫొటోలు తీసుకోవచ్చు. ఇళ్లనే త్రీడీ ప్రింటింగ్‌ ద్వారా సృష్టించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పుడు తినే ఆహారాన్ని మాత్రం ఎందుకు తయారు చేయలేం అనుకున్నారు జర్మనీలోని బయోజూన్‌ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు. వెంటనే దాన్ని ఆచరణలో పెట్టి కొన్ని రకాల బ్రెడ్లూ, బిస్కెట్లూ, కప్‌ కేక్‌లూ, బర్గర్లూ, సాస్‌లను త్రీడీ ప్రింటింగ్‌ ద్వారా సృష్టించడంలో విజయవంతమయ్యారు. బట్టలు వేసుకుంటే బరువు తగ్గొచ్చని ఎప్పుడైనా వూహించారా? అది అసాధ్యం అనే ముందు ఒక్కసారి ‘థిన్‌ ఐస్‌ క్లాతింగ్‌’ గురించి తెలుసుకోవాల్సిందే. టీషర్టులూ, లోదుస్తుల రూపంలో తయారయ్యే థిన్‌ ఐస్‌ దుస్తులూ, బూట్లను వేసుకుంటే అవి శరీరాన్ని కొంతమేర చల్లబరుస్తాయి. దానివల్ల శరీరంలో వేడి ఉత్పత్తి పెరిగి, ఫలితంగా క్యాలరీలూ కరుగుతాయి. బనీన్ల మాదిరిగానే రోజంతా వీటిని ధరిస్తే కనీసం వెయ్యి క్యాలరీలు కరిగే అవకాశం ఉందట. మరీ చలిగా అనిపిస్తే స్మార్ట్‌ఫోన్‌ ఆధారంగా ఉష్ణోగ్రతని నియంత్రించే సౌకర్యమూ ఉంది. తెగిన చర్మాన్ని కుట్లతో పనిలేకుండా అంటించే ‘హీలింగ్‌ లేజర్లూ’, బుల్లెట్‌ ట్రెయిన్‌ల మాదిరిగా భూమికి తాకకుండా వేగంగా ప్రయాణించే ఏరోఫెక్స్‌ బైకులూ, మౌస్‌తో పనిలేకుండా చేతి వేళ్లతోనే కంప్యూటర్‌ కర్సర్‌ను నియంత్రించే అవకాశం కల్పించే ‘లీప్‌ మోషన్‌’ పరికరాలూ, వైర్లు లేకుండా పనిచేసే ఛార్జర్లూ, … ఇలా రాబోయే రోజుల్లో వూహకి అందని సాంకేతికత మార్కెట్‌ని ముంచెత్తనుంది. టెక్నాలజీ ఎంత పెరిగితే జీవితం అంత సౌకర్యంగా మారుతుందన్న మాట.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com