వెంకన్న సన్నిధిలో అధికారుల పితలాటకం

గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా వెనక్కి వస్తుందో…. తితిదే అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు అంతే వేగంగా వెనక్కు వస్తున్నాయి. కీలక అంశాలపై ఉన్నతాధికారులు సరైన మదింపు లేకుండానే ప్రకటనలు చేయడం, తర్వాత అభిప్రాయాలు మార్చుకోవడంతో వివాదాలకు తావిస్తోంది. కొన్నిసార్లు కోర్టుల వరకూ వెళ్లగా.. కొన్నిసార్లు అమలు చేయకుండా వెనకడుగు వేస్తున్నారు. గత 10 నెలల్లో ఇలా తరచూ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా.. తితిదే ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ‘సమయ నిర్దేశిత సర్వదర్శనం’ ప్రారంభానికీ అవాంతరాలు కన్పిస్తున్నాయి. తొలుత అనుకున్నట్లుగా మార్చిలో ఈ పక్రియ ప్రారంభమయ్యేలా కనిపించడం లేదు. అత్యున్నత న్యాయస్థానం ఆధార్‌ లింకేజీకి తగిన స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో.. దీనిపై వెనక్కి వెళ్లేలా కనిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థాంలోని ప్రతి నిర్ణయం కోట్లాది మంది భక్తులను ప్రభావితం చేస్తుంది. పైగా భక్తుల మనోభావాలతో పాటు.. ఆగమశాస్త్రానికి లోబడి ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. అయితే ఇటీవల తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయన్నది ఉద్యోగ సంఘాలు, ధార్మిక సంఘాల ఆక్షేపణ. ఈ క్రమంలో తితిదే సొమ్ము కూడా వృథా అవుతోంది. మచ్చుకు కొన్ని పరిశీలిస్తే.. గత సంవత్సరం ఆగస్టులో తీసుకున్న కీలక నిర్ణయమిది. ఆలయ వెండివాకిలి సమీపంలో ఇనుపమెట్లు ఏర్పాటు చేసి… భక్తులను దాని ద్వారా ఆలయం బయటకు పంపేలా ఏర్పాటు చేశారు. దీనివల్ల రద్దీని నియంత్రించవచ్చని భావించారు. సుమారు రూ.20 లక్షల ఖర్చు అంచనా వేశారు. మెట్లు ఏర్పాటుకు సమాయత్తం అవుతున్న సమయంలోనే వ్యతిరేకత వచ్చింది. వాస్తు నిపుణులు, ఆగమ పండితులు వ్యతిరేకించడంతో ఆ ప్రక్రియను మధ్యలోనే ఆపేశారు. తేడాది నవంబరులో క్షురకులను అవినీతి ఆరోపణల నేపథ్యంలో తొలగించారు. ఒకేసారి 240 మందిని తొలగించడం వివాదాస్పదమైంది. కల్యాణకట్టలో వీరు భక్తుల వద్ద నుంచి డబ్బులు డిమాండు చేస్తున్నారని… వాటి తాలుకు ఆధారాలు సీసీ టీవీల్లో నమోదు అయ్యాయనే నెపంతో వీరిపై వేటు వేశారు. దీనిపై పలుమార్లు క్షురుకులు, రాజకీయ నేతలు తితిదే అధికారుల్ని కలవడంతో.. మళ్లీ వారిని విధుల్లోకి తీసుకున్నారు. గత సంవత్సరం డిసెంబరు 3న శ్రీవారి లడ్డూలను కోరితే.. ప్రయివేటు సంస్థలకు తమ లెటర్‌హెడ్‌లను అనుసరించి ఇస్తామని ఒక ప్రొసీండింగ్స్‌ను తీసుకొచ్చారు. శ్రీవారి కల్యాణోత్సవాలతో పాటు… ప్రయివేటు సంస్థలకు తగిన ధరను అనుసరించి ప్రసాదాలను ఇస్తామన్నది దాని సారాంశం. ఈ విషయం బయటకు పొక్కి, పత్రికల్లో రావడంతో వెంటనే రద్దు చేశారు. కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రమే ఇస్తామంటూ పొరపాటును సవరించారు. వైకుంఠ ఏకాదశికి ఎన్నడూ లేనట్లుగా ఈసారి తితిదే ఉద్యోగుల కుటుంబాలకు దర్శనాలకు అనుమతి ఇవ్వలేదు. ఇది వారిలో ఎప్పటి నుంచో గూడుకట్టుకున్న అసంతృప్తిని బయటపడేలా చేసింది. ఉద్యోగులు అధికారులపై తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు సన్నద్ధం అవుతున్న వేళ… ప్రచ్ఛన్నయుద్ధాన్ని ‘ఈనాడు’ కథనం రూపంలో బయట పెట్టింది. వెంటనే అధికారులు వారికి ప్రత్యేక దర్శనాలు, లడ్డూలు, గదులను తీసుకునే సౌకర్యాన్ని కల్పించారు. స్విమ్స్‌లో ఉద్యోగులకు ప్రత్యేక వార్డును కేటాయించారు. వెంçËనే క్రీడాపోటీలు నిర్వహించి.. ఉద్యోగులకు తాము అనుకూలమన్న సందేశమిచ్చారు. తితిదే ఉద్యోగుల అన్యమత వివాదం పెద్దదయింది. డిప్యూటీ ఈవో స్నేహలత చర్చికు వెళ్లి బహిరంగంగా కన్పించడం నుంచి మొదలైన వివాదం.. తర్వాత విజిలెన్స్‌ విచారణ వరకు వెళ్లింది. 45 మంది అన్యమతస్థులు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. అయితే, ఉద్యోగులు కోర్టుకు వెళ్లడం, కోర్టు సైతం తితిదేకు మొట్టికాయ వేయడంతో ఈ వివాదాన్ని సర్దుబాటు చేయాలనే భావనలో అధికారులున్నారు. తితిదే ఈవో.. ఎండీగా ఉన్న శ్రీవేంకటేశ్వర భక్తిఛానెల్‌ నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్‌ విచారణ తేల్చింది. గతేడాది సెప్టెంబరులో బయటకు పొక్కిన దీనిపై కోర్టుకు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వడంలో అధికారుల అలసత్వం బయటపడింది. వెంటనే కొత్త సీఈవోకు రెండు నెలల క్రితమే నోటీఫికేషన్‌ ఇచ్చినా… ఇప్పటికీ ఎవరినీ నియమించలేదు. మళ్లీ దీనిపై కొన్ని ప్రజాసంఘాలు తితిదే తీరును కోర్టుకు తెలిపేందుకు సిద్ధమవుతున్నాయి. కొండపై ఇటీవల భారీస్థాయిలో పేలుడు పదార్థాలను విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. తర్వాత దర్యాప్తు ఏమయిందనేది ఎవరికీ తెలియలేదు. దాన్ని పట్టించుకోకపోవడానికి అధికారుల మధ్య జరిగిన కీచులాటే కారణమని తెలుస్తోంది. విజిలెన్స్‌, తిరుమల అధికారులకు మధ్య వివాదం కారణంగానే కేసు పక్కదోవపట్టింది. తాజాగా సమయ నిర్దేశిత దర్శనం ప్రారంభానికి బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆధార్‌తో లింకేజీపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. సమయ నిర్దేశిత దర్శనానికి కచ్చితంగా ఆధార్‌ ఉండేలా.. అప్పుడే టోకెన్‌ బయటకు వచ్చేలా తితిదే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీని కోసం వేసిన ట్రయల్‌ విజయవంతం అయింది. రూ.5 కోట్లు ఇప్పటివరకు ఖర్చు చేశారు. తిరుమలతో పాటు తిరుపతిలోనూ దర్శన కేంద్రాలు పెట్టాలని నిర్ణయించారు. చివర్లో మాత్రం న్యాయనిపుణులు ఆధార్‌ లింకేజీపై అధికారులకు వివరణ ఇవ్వడంతో, లేనిపోని సమస్య వస్తోందనే కోణంలో తితిదే అధికారులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో ఆధార్‌ లింకేజీపై స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాతే ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు సమయ నిర్దేశిత దర్శనంపై హంగామా చేసిన అధికారులు ప్రస్తుతం మిన్నకుండిపోయారు. టిక్కెట్‌ కౌంటర్లు నిర్మించేందుకు ఆసక్తి చూపడం లేదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com