వ్యవసాయ విద్యార్థులు పొలాల్లోకి వెళ్ళాలి

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చినప్పుడు ఆనందించే రైతు.. దేశాన్ని సంతోషపరుస్తాడని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘తెలుగు రాష్ట్రాల్లో 2022కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం’ అనే అంశంపై శనివారం రాజేంద్రనగర్‌లోని భారత వరి పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తలతో ఆయన నేరుగా మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా తీర్చాలి, వ్యవసాయంలో ఆదాయం పెరగడానికి ఏం చేయాలనే అంశాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా పలు సూచనలిచ్చారు. ఆహార ధాన్యాల దిగుబడులు గణనీయంగా పెరిగినా రైతులు పెట్టుబడులకు అనుగుణంగా ఆదాయం పొందలేకపోతున్న పరిస్థితి నేడు కనిపిస్తోందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ‘వ్యవసాయ రంగంలో సమస్యలు మనకు తెలుసు..వాటికి పరిష్కారాలూ తెలుసు. నూతన ఆలోచనలేమిటి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల వద్దకు చేర్చడానికి మార్గమేమిటో చెప్పండి’ అని శాస్త్రవేత్తలను అడిగారు. ‘రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పంటల మార్పిడి సమాచారం ఇవ్వడమే కాకుండా, పాడి పశువులు, చేపలు, కోళ్ల పెంపకం వంటి వ్యవసాయేతర రంగాలకూ సమప్రాధాన్యం ఇవ్వడంపై దృష్టి పెట్టాలి. భూముల రకాలు, సారం, సాగునీటి లభ్యత, వాతావరణ సమాచారం వంటివి పంటల ఉత్పాదకత, దిగుబడులు పెంచడానికి చాలా కీలకమని గుర్తించాలి. ఆహార ధాన్యాల దిగుబడుల కోసం ఇతర దేశాలపై ఆధార పడకుండా చూడాలి. దేశీయ ఆహారం సరిపోయేంతగా ఉత్పత్తయ్యేలా చూడాలి. కృషి విజ్ఞాన కేంద్రాలు రైతుల సేద్యానికి ఉపయోగపడే కేంద్రాలుగా మారాలి. పంటలకు గిట్టుబాటు ధర దక్కేలా ఈ-నామ్‌ పథకానికి ప్రాచుర్యం కల్పించాలి. శాస్త్రవేత్తలు వీలైనంత ఎక్కువ సమయం రైతులతో ఉండటం ద్వారా ఆచరణాత్మక పరిష్కారాల్ని కనుక్కోవచ్చు. వ్యవసాయ కోర్సులు చదివే విద్యార్థులు పొలాల్లో రైతులతో ఉండటాన్ని తప్పనిసరి చేయాలి. రైతులకు అవసరమైన మేర పంట రుణాల్ని సకాలంలో తక్కువ వడ్డీకి అందేలా చూడాలి. రైతుల ఆదాయం పెరిగి, వారు సానుకూల దృక్పథంతో జీవించేలా స్థితిగతులను మార్చే పరిష్కారాలతో ముందుకు రావాలి. పంటల ఉత్పాదకత పెరగాలి. అధునాతన పరిజ్ఞానాన్ని రైతులకు చేర్చాలి. మార్కెట్‌ ధరలు, గోదాములు, శీతల గిడ్డంగులు, బీమా తదితర సమాచారాన్ని రైతులకు అందించాలి. వనరుల లభ్యతను వివరించాలి. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థల పరిశోధనలతో సంతోషంగా ఉంది. ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో అవకాశాలున్నాయి. ప్రయోగశాల నుంచి పొలానికి.. అనే నినాదంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేర్చి వినియోగించుకోవడాన్ని వివరించాలి’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com