వ్యాపార దెబ్బ కొట్టిన ట్రంప్

ప్రపంచ వాణిజ్య యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెరతీశారు. స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై భారీ స్థాయిలో సుంకాన్ని విధించే రెండు ప్రతిపాదనలకు ఆయన ఆమోదముద్ర వేశారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం స్టీల్‌ దిగుమతులపై 25శాతం, అల్యూమినియం దిగుమతులపై 10శాతం సుంకాన్ని విధించారు. సవరించిన రేట్లు 15 రోజుల్లో అమల్లోకి రానున్నాయి. కాగా.. ఈ దిగుమతి సుంకాల నుంచి కెనడా, మెక్సికో దేశాలకు మినహాయింపు కల్పించారు. అయితే ఈ మినహాయింపు ఉత్తర అమెరికా వాణిజ్య ఒప్పందాలు(నాఫ్తా) పూర్తయ్యేంతవరకు మాత్రమే అని ట్రంప్‌ స్పష్టం చేశారు. పెన్సుల్వేనియా స్టీల్‌ వర్కర్లు, అమెరికా ఉపాధ్యక్షుడు వైక్‌ పెన్స్‌, కోశాధికార మంత్రి స్టీవెన్‌ ముచిన్‌, వాణిజ్యశాఖ మంత్రి విల్బర్‌ రోస్‌, అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ ఇ. లైటిజర్‌, ఎకనమిస్ట్‌ పీటర్‌ నవారో తదితరుల సమక్షంలో ట్రంప్‌ ఈ ప్రతిపాదనలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. కొన్ని దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతూ దశాబ్దాలుగా తమ ఉద్యోగాలను తీసుకెళ్తున్నాయని వ్యాఖ్యానించారు. అందుకే అలాంటి దేశాలపై ‘పరస్పర పన్నులు’ విధిస్తామన్నారు. ఈ సందర్భంగా భారత్‌, చైనా దేశాల గురించి ట్రంప్‌ ప్రస్తావించారు. భారత్‌, చైనా దేశాలు అమెరికా సుంకాలతో సంబంధం లేకుండా పన్నులు విధిస్తే.. ఆ దేశాలపై పరస్పర సుంకాలను తీసుకొస్తామని ట్రంప్‌ చెప్పారు. వారు ఎంత సుంకాలు విధిస్తే.. తాము కూడా అంతే విధిస్తామన్నారు. ‘అమెరికా ఆర్థిక భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. మా నౌకలను మేమే నిర్మించుకోవాలనుకుంటున్నాం. మా ప్లాంట్లను, మా మిలిటరీ పరికరాలను మేం తయారుచేసుకుంటాం. అది కూడా మా దేశంలో ఉన్న స్టీల్‌, అల్యూమినియంతోనే. మా దేశంలోని కంపెనీలను, సిబ్బందిని మేం రక్షిస్తాం. అంతేకాకుండా ఒక వస్తువును అమెరికాలోనే ఉత్పత్తి చేస్తే దాని మీద ఎలాంటి పన్నులు విధించబోం’ అని ట్రంప్‌ చెప్పారు. ట్రంప్‌ నిర్ణయంతో ప్రపంచ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై అమెరికా సుంకాలను పెంచడం చాలా విచారకరమని, దీని వల్ల అమెరికాతో ఉన్న వాణిజ్య సంబంధాలు దెబ్బతినే అవకాశమున్నాయని జపాన్‌ పేర్కొంది. అంతేగాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఇది ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. అటు ఫ్రాన్స్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అమెరికా నిర్ణయం యూరోపియన్‌ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని ఫ్రాన్స్‌ ఆర్థిక మంత్రి అన్నారు. వాణిజ్య సమస్యల పరిష్కారానికి ఇది సరైన మార్గం కాదని యూకే పేర్కొంది. అమెరికా సుంకాల నుంచి యూరోపియన్‌ యూనియన్‌కు మినహాయింపు కల్పించాలని అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా దిగుమతి సుంకాల నుంచి మినహాయింపు కోరుకునే దేశాలు చర్చలకు రావాలంటూ ట్రంప్‌ ఆహ్వానిస్తున్నారు. ‘దేశాలతో వ్యక్తిగతంగా చర్చలు జరిపి సుంకం రేట్లలో మార్పులు చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అయితే ఆయా దేశాల ఉత్పత్తులు మా దేశ భద్రతకు ముప్పు కాదని నమ్మకం కలిగినప్పుడు మాత్రమే’ అని ట్రంప్‌ మీడియాతో అన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com