శశికళను వీడని నీడ-ఐటీ

శశికళ కుటుంబం ఆస్తుల లెక్కలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పెట్టుబడులు, డొల్ల సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాలను క్షుణ్నంగా ఆ శాఖ పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా రంగంలోకి దిగనుంది. శశికళ కుటుంబ ఆస్తులను స్తంభింపచేసే అవకాశాలు ఉండటంతో కుటుంబ సభ్యులు, వర్గీయులు బెంబేలెత్తుతున్నారు. జయలలిత మరణానంతరం శశికళ కుటుంబ సభ్యులు, సన్నిహితుల నివాసాలు, కార్యాలయాలలో రాష్ట్రంలోని 215 చోట్ల ఐటీ అధికారులు 2017 నవంబరులో మెరుపు సోదాలు నిర్వహించి విషయం తెలిసిందే. అప్పుడు కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలో మాత్రమే 117 చోట్ల ఈ తనిఖీలు జరగడం గమనార్హం. ఇందులో జయా టీవీ, డాక్టర్‌ నమదు ఎంజీఆర్‌ దినపత్రిక కార్యాలయాలు, కాంచీపురం జిల్లా పడప్పైలోని మిడాస్‌ మద్యం పరిశ్రమ, చెన్నై వేళచ్చేరిలోని జాస్‌ సినిమాస్‌ సంస్థ, జయలలిత సహాయకుడు పూంకుండ్రన్‌ నివాసం, శశికళ మేనల్లుడు వివేక్‌, మేనకోడళ్లు కృష్ణప్రియ, షకిలా తదితరులు నివాసాలు ఉన్నాయి. పోయెస్‌గార్డెన్‌లోని జయలలిత నివాసమున్న వేద నిలయంలోనూ సోదాలు నిర్వహించారు. అక్కడ శశికళ గదిలో నుంచి ల్యాప్‌టాప్‌, పెన్‌డ్రైవ్‌, జయలలితకు డీజీపీ అశోక్‌కుమార్‌ రాసిన లేఖ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయిదు రోజులపాటు సాగిన సోదాల్లో రూ.5 వేల కోట్లకుపైగా పన్ను ఎగవేత జరిగినట్టు గుర్తించారు. తవ్వేకొద్దీ శశికళ కుటుంబ ఆస్తుల వెలుగులోకి వస్తుండటంతో ఐటీ అధికారులు కూడా ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన పరిశీలనలో 1996 తర్వాత శశికళ కుటుంబ సభ్యులు డొల్ల సంస్థలు ప్రారంభించినట్టు తెలిసింది. వాటిలో ఎక్కువగా 2001లో జయలలిత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైనట్లు గుర్తించారు. జయలలిత అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ వ్యవహారాన్ని శశికళ కుటుంబం పకడ్బందీగా నడిపించినట్టు తెలుస్తోంది. కొన్ని సంస్థలు నామమాత్రంగా పని చేయడంతో వాటిని కేంద్రం స్తంభింపచేసింది. ఇప్పటికే ఐటీ సోదాల్లో 20కుపైగా డొల్ల కంపెనీలకు సంబంధించిన దాదాపు 100 బ్యాంకు ఖాతాలపైనా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ సంస్థల బ్యాంకు ఖాతాలు క్షుణ్నంగా పరిశీలించింది. వాటిలో కొన్ని ఖాతాల ద్వారా విదేశాలకు నగదు బదిలీ జరిగినట్టు తెలిసింది. మరింత లోతుగా పరిశీలించే పనులు జరుగుతున్నాయి. విదేశాలకు నగదు బదిలీ వ్యవహారం కావడంతో త్వరలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా రంగంలోకి దిగనుంది. మరింత లోతుగా దర్యాప్తు జరిగితే విదేశాల్లోని పెట్టుబడులు వెలుగులోకి రావడంతోపాటు ఈ వ్యవహారంలో తవ్వేకొద్దీ మరికొన్ని కొత్త ఆస్తులు బయటపడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత వ్యవహారం చిన్నమ్మ కుటుంబ సభ్యులు, వర్గీయుల్లో కలకలం రేపుతోంది. పన్ను ఎగవేత అంశం తమ చుట్టూ ఉచ్చు బిగుస్తుండటంతో బెంబేలెత్తుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com