శశికళ కల చెదిరిపోనుందా?

స్థానిక ఎన్నికల నిర్వహణ తేదీల ఖరారుకు హైకోర్టు సూచించిన నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు ఎదురవుతున్న సవాళ్లు ఎక్కువవుతున్నాయి. జయలలిత పట్ల చూపిన విధేయతనే తన పట్ల కూడా ప్రదర్శించిన పన్నీర్‌సెల్వంలో వస్తున్న మార్పులు, ఆయన మద్దతుదారులు తన వర్గంపై పరోక్షంగా చేస్తున్న దాడులు ఆమెకు నిద్ర లేకుండా చేస్తుండగా స్థానిక సంస్థల ఎన్నికలు ఆమెలో గుబులు రేపుతున్నాయి. పార్టీలో పెరుగుతున్న తిరుగుబాటు ధోరణి ఒకవైపు వేధిస్తూండగా ముఖ్యమంత్రి వర్గం నుంచి, జయలలిత మేనకోడలు దీప మద్దతుదారుల నుంచి ఆమెకు ఎదురవుతున్న సవాళ్లు భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. మద్రాసు విశ్వవిద్యాలయంలో రాజకీయాలు, పాలన నిర్వహణ శాఖ అధిపతి రాము మణివన్నన్‌ చెప్పినట్లు పార్టీలో పెచ్చుమీరిన ముఠాతత్వం స్థానిక సంస్థలలో అన్నాడీఎంకే విజయావకాశాలను దెబ్బతీయవచ్చు. అదే జరిగితే శశికళ పార్టీ పదవికే ఎసరు వచ్చే ప్రమాదం తలెత్తవచ్చు. ‘శశికళకు ఇప్పుడు నిజమైన సవాలు డీఎంకే కాదు. సొంతపార్టీలోనే చాలామంది ఆమె నాయకత్వాన్ని అయిష్టంగా భరిస్తున్నారు. రాష్ట్రంలో కూడా చాలా మంది ప్రజలు జయలలిత స్థానంలో ఆమెను వూహించలేకపోతున్నారు’ అని మణివన్నన్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలకు ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నట్లు శుక్రవారం మద్రాసు హైకోర్టుకు తెలియజేసింది. కానీ ఏప్రిల్‌లో నిర్వహణకు న్యాయస్థానం అంగీకరించలేదు. మరొక తేదీ చెప్పాలని ఆదేశించింది. ఈ విషయమై ఈ వారంలో ఒక నిర్ణయం జరిగిపోతుంది. ఇక పార్టీ నుంచి శశికళకు అసలు పరీక్ష మొదలవుతుందని భావిస్తున్నారు. పార్టీ అభ్యర్థులను నిర్ణయించడం, వారిపై తిరుగుబాటు తలెత్తకుండా చూసుకోవడం ఒకదానిని మించిన ఒక పరీక్షలే. స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధిస్తే పార్టీపై పట్టు సాధించి క్రమంగా ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవచ్చునన్నది ఆమె వ్యూహంగా కనిపిస్తోంది. జల్లికట్టు ఆందోళన చివరి రోజు అల్లర్లలో తమ వర్గం హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తడం, శుక్రవారం ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఆందోళనలో సంఘ విద్రోహులు, విద్యార్థేతరులు, గూండాలు చొరబడి ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకు మచ్చ తెచ్చే కుట్ర చేశారని ఆరోపించడం, దీనిపై దర్యాప్తులో అసలు నేరగాళ్లు ఎవరో తేలుస్తానని ప్రకటించడం కూడా శశికళ వర్గంలో గుబులు పుట్టిస్తోంది. పన్నీర్‌సెల్వం విధేయతతో ముఖ్యమంత్రి పదవిని బంగారు పళ్లెంలో పెట్టి తనకు అప్పగిస్తారనుకున్న శశికళ ఆశలు అడుగంటినట్లేనని ముఖ్యమంత్రిలో వచ్చిన మార్పు రుజువు చేస్తుండగా, స్థానిక ఎన్నికల వ్యవహారం ఇప్పుడు శశికళకు మరొక అడ్డంకిగా మారినట్లు భావిస్తున్నారు. ఇటీవల శాసనసభలో జయలలితను ప్రశంసిస్తూ జరిగిన ప్రసంగాల పరంపరలో పన్నీర్‌సెల్వం ఆమె పట్ల తన భక్తిప్రపత్తులను చాటారు కానీ శశికళ గురించి ఒక్కముక్క కూడా మాట్లాడకుండా ఆమెను పూర్తిగా విస్మరించడాన్ని అటు పార్టీ శాసనసభ్యులకు, ఇటు ప్రజానీకానికి ఆమెపై తన వైఖరిని చెప్పకనే చెప్పారు. శశికళ భర్త నటరాజన్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ చేసిన ప్రకటన శశికళను ఎదుర్కొనడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఇచ్చిన సంకేతంగా భావిస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీకి రెండాకుల చిహ్నాన్ని సంపాదించడానికి తాను ప్రధానంగా చేసిన కృషే కారణమని నటరాజన్‌ సభలో చేసిన ప్రకటనను పన్నీర్‌సెల్వం అంత ధైర్యంగా ఖండించగలరని ఎవరూ భావించలేదు. పార్టీకి రెండాకుల చిహ్నం దక్కడానికి ఘనత పూర్తిగా జయలలితదే తప్ప మరెవరిదీ కాదు అని పన్నీర్‌సెల్వం స్పష్టం చేయడం గమనార్హం. 1991లో నటరాజన్‌ను జయలలిత పోయెస్‌గార్డెన్‌ నుంచి బయటకు గెంటివేసిన దగ్గర నుంచి ఆయనను అవాంఛనీయ వ్యక్తిగానే ఆమె ప్రకటించిన సంగతి పార్టీలో అందరికీ తెలిసిందే. నటరాజన్‌ను వేలెత్తి చూపడం ద్వారా ఆయన వ్యతిరేకులందరినీ తనవైపు తిప్పుకునే వ్యూహం కూడా పన్నీర్‌సెల్వం అనుసరించారని దీని వల్ల అర్థమవుతోంది. అంతేకాకుండా అన్నాడీఎంకే పార్టీ పత్రిక డాక్టర్‌ నమదు ఎంజీఆర్‌ జయలలిత ప్రసంగాలను తన ప్రత్యేక సంచికలో స్టాలిన్‌, పన్నీర్‌సెల్వం చిత్రాలతో ప్రచురించింది. అందులో కూడా శశికళకు అంత ప్రాధాన్యం కనిపించలేదు. ఈ పరిణామాలు ముఖ్యమంత్రి పదవిని అలంకరించాలన్న శశికళ కల చెరిగిపోయేలా ఉన్నట్లు భావిస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com