శశికళ బంధువులపై ఐటీ దాడులు

తమిళనాడులో ఐటీ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. అన్నాడీఎంకే అధికారిక మీడియా సంస్థ జయ టీవీ కార్యాలయంలో పాటు.. శశికళ బంధువుల ఇళ్లలో గురువారం ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడు, దిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లలోని మొత్తం 187 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. చెన్నై టీనగర్‌లోని శశికళ మేనకోడలు కృష్ణప్రియ నివాసంతోపాటు.. శశికళకు చెందిన జాస్‌ సినిమా హాళ్ల కార్యాలయాలపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేసినట్లు ఆరోపణలతో పాటు.. డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం రావడంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. జయటీవీని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రారంభించారు. ఈ ఛానల్‌ కొన్నేళ్ల నుంచి అన్నాడీఎంకే పార్టీకి అధికారిక మీడియా సంస్థగా ఉంటోంది. జయలలిత మరణం తర్వాత ఈ ఛానల్‌ను శశికళ కుటుంబసభ్యులు నిర్వహిస్తున్నారు. ఆమె మేనల్లుడు వివేక్‌ జయరామ్‌ జయటీవీకి ఎండీగా ఉన్నారు. అయితే ఇటీవల అన్నాడీఎంకేలో చీలికలు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో నాటకీయ పరిణామాల తర్వాత మళ్లీ పార్టీలో విలీనం జరిగింది. ఆ సందర్భంలో శశికళ, ఆమె కుటుంబసభ్యులను పార్టీ నుంచి దూరం పెట్టారు. దీంతో జయటీవీ ఎవరికి చెందుతుందోనన్న విషయంపై శశికళ, అన్నాడీఎంకే మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2017 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com