శశికి గడ్డు కాలం

ముఖ్యమంత్రి పన్నీరుసెల్వంకు శశికళకు మధ్య సయోధ్య లేదనే వాస్తవం, అనుమానాలు ఒకవైపు ఆయనను సీఎంగా ఎన్నుకున్నప్పటి నుంచి కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా జయలలిత మేనకోడలు దీప మంగళవారం బాహాటంగా బయటకు వచ్చి రాజకీయ రంగ ప్రవేశానికి సన్నద్ధమవుతున్నట్లు ప్రకటించిన నేపథ్యం శశికళను ఆత్మ రక్షణలోకి నెట్టేసిందనడంలో సందేహం లేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనుమానాలు.. శశికళపై వ్యతిరేకతను పెంచుతున్న తరుణంలో చాలా మంది పార్టీ నాయకులు, సభ్యులు దీప నాయకత్వాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆహ్వానిస్తున్నారు. శశికళకు బదులు దీపాను వారు పార్టీ నాయకురాలిగా, ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. అయితే దీప శశికళకు వ్యతిరేకంగా ఎలాంటి తిరుగుబాటు బావుటా ఎగరేయకపోవడం ఆశ్చర్యం కలిగించినా, ఆమె రాజకీయాల్లోకి రావడానికి స్పష్టమైన అజెండాను ఎంచుకోలేదని, పార్టీలో ఆమెను బలపరిచే నాయకులు, శాసనసభ్యుల విషయంలో కూడా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఎవరికైనా విధేయతను ప్రదర్శించడంలో వెనుకాడని పన్నీరుసెల్వం దీప వైపు మొగ్గు చూపకుండా చూసుకుంటేనే తన కంచుకోటకు ముప్పురాదని శశికళకు కూడా తెలుసు. అందుకే ఇప్పుడు చాలా వారాల తరువాత పన్నీరు సెల్వంకు శశికళ వర్గం మద్దతు ప్రకటించి తన బలం తరిగిపోకుండా చూసుకుంటోంది. పేరుకు ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం అయినా జయలలిత హయాంలోప్రభుత్వ యంత్రాంగం యావత్తు విధేయతతో ఉన్న సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ అధికారం యావత్తూ శశికళ గుప్పిట్లోనే ఉందనే అభిప్రాయం కలిగిస్తున్నారు. ముఖ్యమంత్రికి లాంఛనంగా ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా ఇవ్వకుండా అగ్రతాంబూలం శశికళకే ఇస్తూ ప్రభుత్వ, ప్రైవేటు ప్రముఖులంతా ఆమెను కలవడం.. అదేదో ప్రభుత్వ వ్యవహారమైనట్లు ప్రకటనలు వెలువడటం కొనసాగుతోంది. అయితే దీపకు మద్దతు పెరుగుతుండడం, జయలలిత మరణంపై ధృఢపడుతున్న అనుమానాలు శశికళ పట్ల వ్యతిరేకత పెల్లుబుకడానికి దోహదం చేస్తున్నాయి. అందువల్ల పన్నీరుసెల్వాన్ని మంచి చేసుకోవడం ప్రధానమని భావించి శశికళ భర్త ఎం.నటరాజన్‌ పన్నీరుకు మద్దతు ప్రకటిస్తూ ప్రసంగించారు. తమకు పన్నీరుసెల్వానికి మధ్య భాజాపా శక్తులే విభేదాలు సృష్టిస్తున్నాయని ఆయన సోమవారం ఆరోపించారు. అంతేకాదు మారుతున్న సమీకరణాల నేపథ్యంలో శశికళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం వెంటనే జరగక పోవచ్చునని కూడా నటరాజన్‌ ప్రకటన సృష్టం చేస్తోంది. ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం సత్పరిపాలనను అందజేస్తున్నారు. అందువల్ల నాయకత్వాన్ని వెంటనే మార్చే అవసరం మాకు లేదని నటరాజన్‌ పేర్కొన్నారు. పార్టీలో వివిధ వర్గాలు శశికళ అనుకూలంగా, వ్యతిరేకంగా రంగులు మారుస్తున్న నేపథ్యంలో పన్నీరుసెల్వం మాత్రం తాను ప్రజలకు విధేయుడైన ముఖ్యమంత్రిగా ప్రస్తుతం వారి తక్షణ సమస్యలు పరిష్కరించడమే తన లక్ష్యంగా తనపని తాను చేసుకుపోతున్నారు. నగరానికి కృష్ణ నదీ జలాలు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి అమరావతికి వెళ్లారు. రాష్ట్రానికి కరవు సాయంగా రూ.39,565 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరడం వంటి చర్యలను మనం ఆయన నిశ్శబ్ద వ్యూహంలో ఒక భాగంగానే పరిగణించాలి. ముఖ్యమంత్రిగా ఉంటూ శశికళకు అంత విధేయంగా ఎందుకు ఉండాలని ఆయన వర్గంలో కొందరు నిలదీస్తున్నా చిరునవ్వుతో సమాధానం ఇస్తున్న పన్నీరుసెల్వం క్రమంగా ప్రజల్లోనూ, పార్టీలోనూ తనకంటూ ఒక బలమైన వర్గాన్ని పెంచుకుంటూ పోతున్నారు. దీప ద్వారా పార్టీలో ఏర్పడుతున్న వ్యతిరేకత కారణంగా శశికళ ముఖ్యమంత్రి పీఠానికి దూరంగా ఉంటారని, అలా ఉన్నంత కాలం పన్నీరుసెల్వం పదవికి ఎసరురాదనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇలా పూర్తి పదవీకాలం ఆయనే అధికారంలో కొనసాగినా ఆశ్చర్యం లేదని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నెల 29న ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనే కల నిజం అవడం, కాకపోవడం ఏమోగానీ ప్రస్తుతానికి మాత్రం శశికళ ఆత్మరక్షణలో పడ్డారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com