శాడిస్ట్ పైలట్ నిర్వాకం. ఎయిర్ఏషియా విమానం నరకం.

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియాకు చెందిన విమానంలో సిబ్బంది ప్రవర్తన కారణంగా గందరగోళ పరిస్థితి ఏర్పడిందని కొందరు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పశ్చిమ్‌బంగా రాజధాని కోల్‌కతా నుంచి బగ్డోగ్రాకు వెళ్లాల్సిన ఎయిర్‌ఏషియా విమానం నాలుగు గంటలకు పైగా ఆలస్యమైందని ఓ ప్రయాణికుడు తెలిపారు. విమాన పైలట్‌ తమతో చాలా అనుచితంగా ప్రవర్తించారని, దాని వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారని వాపోయారు. అదే విమానంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ పశ్చిమ్‌బంగా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దీపాంకర్‌ రే కూడా ఉన్నారు. ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది ప్రవర్తన అనైతికంగా, అనాగరికంగా ఉందని ఆయన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించారు. దీపాంకర్‌ రే వెల్లడించిన వివరాల ప్రకారం.. విమానం ఉదయం 9 గంటలకు బయలుదేరాల్సి ఉండగా 30 నిమిషాలు ఆలస్యమవుతుందని చెప్పారని, కానీ విమానంలో ఎక్కి కూర్చున్న తర్వాత మరో గంటన్నర సేపు ఆహారం, నీరు లేకుండా అలాగే వదిలేశారని తెలిపారు. కాసేపటికి విమాన కెప్టెన్‌ ప్రయాణికులందరినీ దిగాలని సూచించగా.. బయట బాగా వర్షం పడుతున్నందున ప్రయాణికులు దిగడానికి నిరాకరించారని చెప్పారు. సిబ్బందికి, ప్రయాణికుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొందని వివరించారు. దీంతో కెప్టెన్‌ అందరూ దిగిపోవాలనే ఉద్దేశ్యంతో ఏసీ మొత్తం పెంచేశారని, ఈ చర్యతో ప్రయాణికులు బాగా భయపడిపోయారని వెల్లడించారు. కొందరు మహిళా ప్రయాణికులు వాంతులు చేసుకున్నారని, పిల్లలు విపరీతంగా ఏడ్చారని ఆయన చెప్పారు. విమానం లోపల ఏసీ కారణంగా పొగమంచు లాగా ఏర్పడి ఊపిరాడలేదని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. విమానం దిగాక ఫుడ్‌ కోర్టుకు వెళ్లాలని సూచించారని.. అక్కడ కూడా ఎయిర్‌ఏషియా ఎలాంటి సదుపాయాలు చేయలేదని, తామే ఆహారం కొనుక్కున్నామని దీపాంకర్‌ తెలిపారు. ఆ తర్వాత మళ్లీ విమానం ఎక్కినప్పుడు ఓ శాండివిచ్‌, 250ఎంఎల్‌ మంచినీళ్లు ఇచ్చారని చెప్పారు. ఎయిర్‌ఏషియా ప్రవర్తన అస్సలు ఆమోదయోగ్యం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎయిర్‌ఏషియా స్పందించింది. విమానం ఆలస్యమైన విషయాన్ని అంగీకరించింది. సాంకేతిక అవసరాల కారణంగా విమానం ఆలస్యమైందని.. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరింది. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని తెలిపింది. ఎక్కవ తేమ ఉన్నప్పుడు విమానంలో ఏసీ ఆపరేట్‌ చేస్తే అలాగే ఉంటుందని విమానయాన సంస్థ పేర్కొంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com