శుక్రవారం నుండి మేరీమాత ఉత్సవాలు

దేవుడు అన్ని చోట్లా ఉండలేక తల్లిని సృష్టించాడని అంటారు. అలా అమ్మ దేవుడికి ప్రత్యామ్నాయంగా నిలిస్తే… అలాంటి దేవుడికే జన్మనిచ్చిన తల్లి ఎంత గొప్పది! ఆయమ్మే యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన మేరీమాత. క్రీస్తు ప్రబోధాలు, ప్రవచనాలు విస్తరించిన అన్నిచోట్లా ఆయన తల్లి అయిన మేరీమాతపై భక్తులలో ఎంతో ఆదరణ, నమ్మకం, భక్తి కనిపిస్తాయి.
**మెడలో ఉత్తరీయం ధరించి పాదయాత్రలు చేస్తూ తొమ్మిది రోజులూ.. జపాలతో మేరీమాతను పూజించడం ఎప్పట్నుంచో ఉన్నదే. ఫ్రాన్స్‌లోని లూర్థు నగరంలో 1858 ఫిబ్రవరి 11న మేరీమాత బెర్నెదెత్‌ అనే బాలికకు దర్శనమిచ్చిందని చెబుతారు. ఆ దర్శనం స్ఫూర్తిగా 1925లో విజయవాడలోని గుణదలలో ఫాదర్‌ ఆర్లతి అనే మత బోధకుడు మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కొండల నడుమ పచ్చని ప్రకృతికి ఆలవాలంగా ఉన్న ఆ ప్రాంతం 1971 నాటికి మేరీమాత ఆలయంగా రూపొందింది. ప్రతి సంవత్సరం ఆ ప్రాంతంలో జనవరి 31 నుంచి తొమ్మిది రోజులు నవదిన ప్రార్థనలు జరుగుతాయి. ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు మూడు రోజులు జరిగే ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఒక తల్లి గర్భం నుంచే జన్మపాపం లేకుండా జన్మించిన మేరీమాతను ‘అమలోద్భవి’ అని ప్రస్తుతించారు 13వ శతాబ్దానికి చెందిన మతబోధకుడు స్కోతుస్‌. యేసు పునరుత్థానం వరకూ ఆయనతో ఉండి, తిరిగి మోక్షారోహణంతో తన జీవితాన్ని సంపూర్ణం చేసుకుందని.. ఆమెను ‘‘ఉత్థాపిత మాత’గా పేర్కొంటారు విశ్వాసులు. సిలువపై మరణయాతన అనుభవిస్తున్న యేసుక్రీస్తు గుండెల్లో ఓ సైనికుడు ఈటెతో పొడిచాడు. ఆ దృశ్యాన్ని చూసిన మాతృహృదయం, తన గుండెల్లోనే ఖడ్గం దిగినంత బాధపడిందని ఆమెను ‘వ్యాకులమాత’గా ఆరాధిస్తుంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ధైర్యంగా స్వీకరించి అంతులేని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిందాతల్లి. అందుకే పూజనీయురాలైంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com