శ్రీకృష్ణుడి జన్మస్థలంలో పదేళ్లు గడపనున్న నవాజ్ షరీఫ్

అవినీతి కేసులో పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు నవాజ్‌ షరీఫ్‌కు 10ఏళ్ల జైలుశిక్ష పడింది. ఈ మేరకు జాతీయ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్‌ఏబీ) కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. షరీఫ్‌తో పాటు ఆయన కుమార్తె మరియంకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. పనామా పత్రాల కుంభకోణం వ్యవహారంలో నవాజ్‌ షరీఫ్‌ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి షరీఫ్‌, ఆయన కుటుంబ సభ్యులపై నాలుగు అవినీతి కేసులు దాఖలయ్యాయి. ఇందులో ఒకటి అవెన్‌ఫీల్డ్‌ కేసు. లండన్‌లోని అవెన్‌ఫీల్డ్‌ హౌస్‌లో షరీఫ్‌ అక్రమంగా నాలుగు ఫ్లాట్‌లను సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసులో ఆయనను దోషిగా తేల్చింది. షరీఫ్‌కు 10ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు నేడు తీర్పు వెల్లడించింది. షరీఫ్‌ కుమార్తెకు ఏడేళ్లు, అల్లుడు రిటైర్డ్‌ కెప్టెన్‌ సఫ్దార్‌కు ఏడాది పాటు జైలుశిక్ష ఖరారు చేసింది. దీంతో పాటు షరీఫ్‌కు 10 మిలియన్‌ డాలర్లు, మరియంకు 2.6 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. కాగా.. ఈ తీర్పును వాయిదా వేయాలంటూ షరీఫ్‌ కోర్టును కోరినప్పటికీ న్యాయస్థానం నిరాకరించింది. షరీఫ్‌ సతీమణి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమె చికిత్స నిమిత్తం షరీఫ్‌, ఆయన కుటుంబసభ్యులు ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. ఇలాంటి సమయంలో తాను పాకిస్థాన్‌కు రాలేనని, తీర్పును వచ్చేవారానికి వాయిదా వేయాలని షరీఫ్‌ న్యాయస్థానాన్ని కోరారు. అయితే కోర్టు ఇందుకు తిరస్కరించి.. శుక్రవారమే తీర్పును వెలువర్చింది. కాగా.. పనామా కుంభకోణం వ్యవహారంలోనే షరీఫ్‌ ప్రధాని పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో షరీఫ్‌ భవిష్యత్‌లో ఎన్నికల్లో పాల్గొనకుండా ఆయనపై జీవితకాలం అనర్హత వేటు విధిస్తూ పాక్‌ సుప్రీంకోర్టు గత ఏప్రిల్‌లో తీర్పు వెల్లడించింది. ‘రాజ్యాంగంలోని 62, 63 అధికరణలు పార్లమెంటులోని ప్రతి సభ్యుడూ నిజాయతీ, నిబద్ధతతో మెలగాలని చెబుతున్నాయి. వీటిని ఉల్లంఘించినందున ఆయన పార్లమెంటు సభ్యునిగా అర్హత కోల్పోయారు. అందువల్ల ఆయన ప్రధానమంత్రి పదవిలో ఎన్నటికీ కొనసాగలేర’ని అప్పట్లో ధర్మాసనం పేర్కొంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com