శ్రీలంకపై డ్రాగన్ కన్ను

భారత్‌ చుట్టుపక్కల చిన్నా చితకా దేశాలను వాణిజ్య దాసోహంలోకి నెట్టి వాటిపై పట్టు సాధించాలనుకుంటున్న చైనా ఇప్పుడు శ్రీలంకను మింగేయాలని ఎత్తులు వేస్తోంది. కాకపోతే చైనా ఎత్తులు తెలిసిన లంక మాత్రం వీటిని గట్టిగా అడ్డుకుంటోంది. ఒక వేళ శ్రీలంక చైనా గుప్పెట్లోకి వెళ్లిపోతే మన దేశానికి పక్కలో బల్లెంలా తయారవుతుందని భారత వ్యూహకర్తలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు శ్రీలంక ఆర్థిక పరిస్థితి కూడా దిగజారి పోయే ప్రమాదముంది. ఇప్పటికే శ్రీలంకలోని హంబన్‌తోట రేవులో భారీగా పెట్టుబడులు పెట్టి పెత్తనం చేస్తున్న చైనా ఇప్పుడు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సిద్ధమైపోయింది. ఇప్పటికే అమెరికా వంటి దేశాల ఆర్థికవ్యవస్థలే చైనా ఉత్పతులతో అతలాకుతలమైపోయాయి. దీనిని తట్టుకోలేక అమెరికా చైనా ఉత్పత్తులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇవన్నీ గమనిస్తున్న శ్రీలంకకు ఎక్కడో భయం మొదలైంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే చైనా ఉత్పత్తులు లంక మార్కెట్లను ముంచెత్తడం ఖాయం. దీంతో శ్రీలంక స్థానిక పరిశ్రమలు దెబ్బతిని ఉత్పత్తిలేకుండాపోతుంది. ఇప్పటికే చైనా నుంచి భారీగా అప్పు చేసిన లంక వాటిని తీర్చలేని పరిస్థితి వచ్చి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఒక వేళ చైనాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం చేసుకుంటే 10ఏళ్ల తర్వాత దానిని పునఃపరిశీలించే అవకాశం ఉండాలని లంక అధికారులు గట్టిగా కోరుతున్నారు. ఈ షరతు చైనాకు మింగుడుపడటంలేదు. శాశ్వితంగా తమ ఉత్పతులకు లంక మార్కెట్‌గా ఉండిపోవాలని ఆ దేశం కోరుకుంటోంది. దీంతో చర్చలు దాదాపు ఏడాదిన్నరగా ముందుకు వెళ్లడంలేదు. చైనా వ్యూహకర్తలు కూడా శ్రీలంకను భారీ వాణిజ్యలోటులో పడేసేలా ఒప్పంద ముసాయిదాను తయారు చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. శ్రీలంక-చైనా లు పరస్పరం ఎగుమతి చేసుకునే వస్తువుల్లో 90శాతంపై అసలు ఎటువంటి పన్నులు ఉండకూడదని డ్రాగన్‌ వ్యూహకర్తలు కోరుతున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన చైనాతో ఇటువంటి ఒప్పందం చేసుకోవడం కోరి కొరివితో తలగోక్కున్నట్లే అని శ్రీలంక అధికారులు భావిస్తున్నారు. దీంతో చర్చలు అధికారుల స్థాయి వద్దే నిలిపివేశారు. ఒప్పంద పరిశీలనకు మరికొంత సమయకావాలని శ్రీలంక దానిని పక్కన పెట్టింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com