శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల సందడి

***మంగళవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రం దేదీప్యమానంగా వెలుగులీనుతోంది. భక్తుల సౌకర్యం కోసం ఉద్యాన వనాల్లో తాత్కాలిక వసతి సదుపాయాలు, తాగునీటి సరఫరా తదితర ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఈవో భరత్‌గుప్తా తెలిపారు. సోమవారం స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
భూలోక కైలాసం, ద్వాదశ జ్యోతిర్లింగ.. అష్టాదశ శక్తి పీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. లక్షలాదిగా భక్తులు తరలివచ్చి ఉత్సవాలను తిలకించనున్న నేపథ్యంలో శ్రీశైల దేవస్థానం, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ఏర్పాట్లను చేస్తున్నాయి. భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించి క్షేమంగా తిరిగి వెళ్లేవిధంగా చర్యలు చేపట్టాలని సంకల్పించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు కల్పించిన ఏర్పాట్లు ఇవీ.
***దర్శనం…
ఆలయం ముందుభాగంలో గల క్యూ కాంప్లెక్స్ నుంచి భక్తులు దర్శనానికి వెళ్లేందుకు అవకాశం కల్పించారు. ఉచిత దర్శనం, రూ.200 అతి శీఘ్ర దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటాయి. శివదీక్షా భక్తులు చంద్రవతి కల్యాణ మండపం నుంచి దర్శనానికి ప్రవేశించాల్సి ఉంటుంది. క్యూ లైన్లలో దర్శనానికి వేచి ఉండే భక్తులకు అల్పాహారం, పాలు, మంచినీటి సదుపాయాలు కల్పిస్తారు. ముఖ్య అతిథులకు మూడు విడతలుగా విరామ దర్శనం ఏర్పాట్లు చేశారు.
**వసతి సదుపాయాలు
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వచ్చిన భక్తులకు క్షేత్ర పరిధిలో దేవస్థానం తాత్కాలిక వసతి సదుపాయాలు కల్పిస్తోంది. ఉద్యాన వనాలు, ఖాళీ ప్రదేశాల్లో షామియానాలు ఏర్పాటు చేశారు. పాతాళగంగ మార్గంలో దేవస్థానం ఆధీనంలోని డార్మెంటరీల్లో భక్తులకు వసతి లభించనుంది. డార్మెంటరీల్లో బెర్ , లాకర్ , ఏసీ గదుల సదుపాయం ఉంది. దేవస్థానం వసతి గదులు ప్రత్యేక విధులకు వచ్చే అధికారులు, సిబ్బందికి కేటాయిస్తున్నందున తాత్కాలిక వసతి సదుపాయాలు మాత్రమే కల్పిస్తారు.
***బ్రహ్మోత్సవ సంబరం ఇలా…
శ్రీశైల మహాక్షేత్రంలో 6న ఉదయం 8.30 గంటలకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. శ్రీస్వామి, అమ్మవార్ల యాగశాల ప్రవేశం, వేద స్వస్తి, శివ సంకల్పం, గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవచనం, చండీశ్వర పూజ, కంకణ పూజ, కంకణధారణ, తదితర పూజలు జరుపుతారు. ఆరోజు రాత్రి 7 గంటలకు సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజ పటాన్ని ప్రధాన ధ్వజ స్తంభంపై ఆవిష్కరిస్తారు. ప్రతి రోజూ శ్రీస్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవం నిర్వహిస్తారు.యజ్ఞ వాటిక వద్ద ఆర్టీసీ బస్టాండ్‌ ఫిల్టర్ బెర్ సమీపంలోని యజ్ఞ వాటిక వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్ వద్ద ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల ఆర్టీసీ బస్సులు నిలుపుతారు. భక్తులు ఇక్కడి నుంచే బస్సుల్లో రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. ఇక్కడ మరుగుదొడ్లు, తాత్కాలిక వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 600లకు పైగా ఆయా ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులను నడుపుతారు. జీపులు, కార్లను ఔటర్ రింగ్ రోడ్డు గుండా శివాజీ స్ఫూరి కేంద్రం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో, హెలిప్యాడ్ వద్ద, న్యూ స్టార్ క్వార్టర్స్ ఏరియాల్లో పార్కింగ్చేసుకోవాల్సి ఉంటుంది. పోలీసు శాఖ అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. కర్ణాటక బస్సులను రింగ్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
**పారిశుద్ధ్య సేవలు
జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో 1300 మంది స్వీపర్లు పారిశుద్ధ్య పనులు చేస్తారు. వీరిలో 300 మంది ప్రత్యేకంగా మరుగుదొడ్లను శుభ్రం చేస్తారు. క్షేత్రంలో అన్నిచోట్లా మరుగుదొడ్లు, స్నానపు గదులు అందుబాటులో ఉన్నాయి. భక్తులకు ఉచితంగా మరుగుదొడ్లను వినియోగించకునే సదుపాయం కల్పించారు. పాతాళగంగ వద్ద జల్లు స్నానం ఏర్పాట్లు చేశారు.
**ఆలయ దర్శన వేళలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 3 గంటలకు మంగళవాయిద్యాలు, 4 గంటలకు సుప్రభాత సేవ, 5 గంటలకు మహామంగళహారతి జరుగుతుంది. భక్తులను తెల్లవారుజామున 4 గంటల నుంచి శ్రీస్వామి, అమ్మవార్ల దర్శనానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. తిరిగి సాయంత్రం 5.20 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు స్వామి, అమ్మవార్లను దర్శించుకోవచ్చు. 13న మహాశివరాత్రి పర్వదినం రోజు అర్ధరాత్రి 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. తిరిగి సాయంత్రం 5.20 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు దర్శనం ఉంటుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు.
**వైద్య సేవలు
బ్రహ్మోత్సవాల్లో 30 మంది ప్రత్యేక వైద్యులు భక్తులకు వైద్యసేవలు అందిస్తారు. వీరితోపాటు 180 మంది వైద్య సిబ్బంది సేవలందిస్తారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద 30 పడకల తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఇక్కడ 24 గంటలూ వైద్యసేవలందిస్తారు. అత్యవసర సేవలను కూడా అందించనున్నారు. నాలుగు 108 అంబులెన్సులు అందుబాటులో ఉంటాయి. పాదయాత్రగా వచ్చే భక్తుల కోసం ఆలయం ముందుభాగంలో, నాగలూటి, పెచ్చెరువు, కైలాస ద్వారం, శివదీక్షా శిబిరాలు, టూరిస్టు బస్టాండు, మల్లమ్మ కన్నీరు, లింగాల గట్టు, ఆర్టీసీ బస్టాంè్ వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
**పోలీసు బందోబస్తు
బ్రహ్మోత్సవాలకు ఇద్దరు ఎస్పీలు, నలుగురు ఏఎస్పీలు, 14 మంది డీఎస్పీలు, 45 మంది సీఐలు, 116 ఎస్సైలు, 330 ఏఎస్సైలు, 900 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 100 మహిళా పోలీసులు, 400 హోంగార్డులు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. వీరితో పాటు 20 ప్లాటూన్ల ఏఆర్ , స్పెషల్‌ పార్టీ పోలీసులు క్షేత్రంలో బందోబస్తు విధులు చేపడతారు. దేవస్థానం ఆధ్వర్యంలో 370 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్నపూర్ణ భవన్‌ వద్ద ఉన్న కమాండ్ కంట్రోల్‌ రూం నుంచి సీసీ కెమెరాల ద్వారా క్షేత్రంలో అన్ని ప్రదేశాల్లో పోలీసు నిఘా పెట్టనున్నారు.
**అటవీ శాఖ ఏర్పాట్లు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు, వెంకటాపురం, బైర్లూటి మీదుగా నాగలూటి, పెచ్చెరువు, కైలాస ద్వారం వరకు ముళ్ల కంపలు తొలగించారు. అటవీశాఖ సిబ్బంది అడవుల్లో ప్రత్యేక విధులు నిర్వర్తించనున్నారు.
**వస్తువులు భద్రపరచుకునే సౌకర్యం
ఆలయ క్యూ కాంప్లెక్స్ వద్ద భక్తులు తమ వస్తువులు, చరవాణులను భద్రపరుచుకునే సౌకర్యం కల్పించారు. సాధారణ రుసుం చెల్లించి వస్తువులను భద్రపరచుకోవచ్చు. పాతాళగంగ మార్గంలోని డార్మెంటరీల్లో కూడా లాకర్ సదుపాయం కల్పించారు.
**శ్రీశైలానికి ఇలా చేరుకోవచ్చు …
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు శ్రీశైలం చేరుకోవాలంటే రోడ్డు, రైలు మార్గం సౌకర్యాలు ఉన్నాయి. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతం వారు ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాల్లో ప్రకాశం జిల్లా దోర్నాల మీదుగా శ్రీశైలం చేరుకోవాల్సి ఉంటుంది. ఆంధ్ర ప్రాంతం భక్తులు విజయవాడ, గుంటూరు నుంచి రైలులో ప్రయాణించి మార్కాపురం(రాయవరం రైల్వే స్టేషన్‌) చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి బస్సులో శ్రీశైలానికి చేరుకోవాలి. తెలంగాణ ప్రాంతం వారు మన్ననూరు, దోమలపెంట మీదుగా శ్రీశైలం చేరుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రాంతం నుంచి రోడ్డు మార్గం ఒక్కటే అవకాశం.
**భోజన సదుపాయం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక విధులకు వచ్చే అధికారులు, సిబ్బందికి, శివదీక్షా, సాధారణ భక్తులకు దేవస్థానం తరఫున నిత్యాన్నదాన భవనంలో భోజన వసతి కల్పిస్తారు. ప్రతి రోజూ సుమారు 15 వేల మందికి భోజన వసతి ఉంటుంది. క్షేత్రంలో ఆయా క్షేత్రాల్లో భక్తులు, దాతలు సొంతంగా అన్నదాన కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఏటా నిర్వహిస్తున్నారు. హఠకేశ్వరం వద్ద సత్ర సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపడతారు.
**సహాయవాణి…
శ్రీశైలంలో ఎలాంటి సమాచారం తెలుసుకోవాలన్న దేవస్థానం కాల్‌ సెంటర్లను ఫోన్‌ ద్వారా సంప్రదించవచ్చు. కాల్‌సెంటర్ల నంబర్లు 83339 01351, 52, 53, 54, 55, 56ను సంప్రదించాలి. మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు శాఖ తరఫున భక్తులకు సేవలందిస్తున్నారు. ఆత్మకూరు డీఎస్పీ 91211 01180, సీఐ 91211 01192, ఒకటో పట్టణ ఎస్సై 91211 01193, రెండో పట్టణ ఎస్సై 91211 01194, పోలీసు స్టేషన్‌ 08524-287133 సంప్రదించాల్సి ఉంటుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com