షాజహాన్ సంతకం చేసిన సేల్ డీడ్ వారం లోపల దాఖలు చేయాలి

ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ తమకే చెందుతుందని ఉత్తరప్రదేశ్‌ సున్నీ వక్ఫ్‌ బోర్డు వాదించగా.. అయితే షాజహాన్‌ సంతకాలు చూపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వక్ఫ్‌ బోర్డుకు వ్యతిరేకంగా భారత పురావస్తు శాఖ 2010లో దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారించింది. తాజ్‌మహల్‌ను నిర్మించిన షాజహాన్‌ తాజ్‌ మహల్‌ను వక్ఫ్‌ బోర్డు ఆస్తిగా ప్రకటించారని వక్ఫ్‌ బోర్డు చెప్తోంది. అయితే ఈ మేరకు షాజహాన్‌ సంతకాలు చేసిన పత్రాలు సమర్పించండి అని కోర్టు వక్ఫ్‌ బోర్డును ఆదేశించింది. వారం రోజుల్లోగా ఆ పత్రాలు సమర్పించాలని చెప్పింది. మొగల్‌ చక్రవర్తి అయిన షాజహాన్‌ తన భార్య ముంతాజ్‌ కోసం ఈ కట్టడాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా షాజహాన్‌ దీన్ని నిర్మించిన 18ఏళ్ల తర్వాత 1666లో మరణించారు. అయితే 2005లో వక్ఫ్‌ బోర్డు తాజ్‌ను తమ ఆస్తిగా వెల్లడించింది. దీన్ని వ్యతిరేకిస్తూ భారత పురావస్తు శాఖ 2010లో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ‘తాజ్‌ మహల్‌ వక్ఫ్‌ బోర్డుకు చెందుతుంది అంటే భారతదేశంలో ఎవరు నమ్ముతారు? ఇలాంటి విషయాలతో సుప్రీంకోర్టు సమయాన్ని వృథా చేయకూడదు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. తాజ్‌ మీదే అయితే షాజహాన్‌ సంతకం చేసిన ఒరిజినల్‌ డీడ్‌ చూపించండి అని ఆదేశించింది. షాజహాన్‌ చివరి సమయంలో ఆయనను అతని కుమారుడు ఔరంగజేబు ఆగ్రా కోటలో గృహనిర్బంధంలో ఉంచారు. మీకు వక్ఫ్‌నామాపై సంతకం ఎలా చేశారు అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అసలు ఆ కాలంలో వక్ఫ్‌నామానే లేదని పురావస్తు శాఖ తరఫు న్యాయవాది తెలిపారు. చివరి మొగల్‌ చక్రవర్తి బహదూర్‌షా జాఫర్‌ నుంచి బ్రిటిష్‌ వాళ్లు స్వాధీనం చేసుకున్న కట్టడాలు, భవనాలను 1948 చట్టం ప్రకారం భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని వెల్లడించారు. వివాదాస్పద అయోధ్య భూమి కూడా తమదేనని ఉత్తరప్రదేశ్‌ వక్ఫ్‌ బోర్డు సుప్రీంకోర్టులో పోరాడుతోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com