సరైన ప్రణాళిక లేకుండా రద్దు చేశారు

పెద్ద నోట్ల రద్దు చర్య మంచి నిర్ణయం కాదనే విషయాన్ని ముందుగానే ప్రభుత్వానికి సూచించానని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నరు రఘురాం రాజన్‌ వెల్లడించారు. నోట్ల రద్దు చర్యకు ముందు ప్రభుత్వంతో ఆర్‌బీఐ సంప్రదింపులు చేయలేదంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ‘నోట్ల రద్దుపై నేను ప్రభుత్వంతో సంప్రదించలేదనే విషయాన్ని ఎన్నడూ చెప్పలేదు. ఆ నిర్ణయం మంచిది కాదని భావిస్తున్నామని అప్పుడే ప్రభుత్వానికి తెలియచేశామ’ని కేంబ్రిడ్జ్‌లోని హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌లో ప్రసంగిస్తూ ఆయన చెప్పారు. పోనీ నోట్ల రద్దు నిర్ణయాన్ని అయినా సరైన ప్రణాళికతో అమలు చేశారా అంటే అది కూడా లేదని అన్నారు. దేశంలో చలామణిలో ఉన్న 87.5 శాతం నోట్లను రద్దు చేస్తున్నప్పుడు ముందస్తు సన్నద్ధత ఎంతో అవసరమని చెప్పారు. రద్దు చేస్తున్న మొత్తం నోట్ల విలువకు సమానమైన నోట్లను ముందుగానే ముద్రించుకొని ఆ నిర్ణయాన్ని అమల్లోకి తెస్తే బాగుండేదని తెలిపారు. ఇవన్నీ చేయకుండానే భారత్‌ పెద్ద నోట్ల రద్దుకు నిర్ణయం తీసుకుందని అన్నారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. పెద్ద నోట్లను రద్దు చేసేస్తే, అప్పటివరకు పన్నులు కట్టకుండా నేలమాళిగలలో డబ్బును దాచుకున్నవారు రాత్రికి రాత్రే బయటకు వచ్చేసి క్షమించండి… మేం ఈ డబ్బులున్న విషయాన్ని మీ దగ్గర దాచాము. ఇప్పుడు ఈ మొత్తాన్ని పన్ను కింద జమచేసుకోండని అంటారని అనుకోవడం మన భ్రమే అవుతుంది. భారత్‌ గురించి తెలిసిన వారెవరికైనా వ్యవస్థాగత లొసుగులను ఇక్కడ ఎంత త్వరగా వెతికేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవేళ రద్దు చేసిన నోట్లన్నీ తిరిగి వచ్చేసినా కూడా ఈ నిర్ణయం వెనక ఉద్దేశం ప్రత్యక్షంగా నెరవేరకపోయేదే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com