సర్వం సౌకర్యవంతం – తితిదే యాప్ ద్వారా సాకారం

ఆధునికత ఇప్పుడు ఆధ్యాత్మిక యాత్రలను కూడా సులభతరం చేస్తోంది. యాత్రలకు వెళ్లాలన్న ఆలోచన.. చేతిలో స్మార్ట్‌ చరవాణి.. ఉంటే చాలు మొత్తం ప్రణాళిక ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు. జ్ఞతిరుమల తిరుపతి దేవస్థానం యాప్‌లు భక్తులకు చక్కగా ఉపయోగపడుతున్నాయి. ప్రయాణం.. దర్శనం.. సులభతరంగా సాగిపోయేలా చేస్తున్నాయి. చాలామంది వీటిని చక్కగా వినియోగించుకుంటున్నారు.
***ఇప్పటి వరకు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోడానికి తిరుమల వెళ్లాలంటే వ్యయప్రయాసలు తప్పేవికావు.. ముందుగానే ప్రణాళికను రూపొందించుకుని, ఈ సేవ కేంద్రాల్లోగానీ, తితిదే. ఈ-దర్శన్‌ కేంద్రాలకు గానీ వెళ్లి దర్శన, వసతి టిక్కెట్లను పొందాల్సి వచ్చేది. ఏదైనా సమాచారం కావాలన్నా కొంత ఇబ్బంది కలిగేది. తిరుమలలోని టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్‌చేసినా తగినంత సమచారం లభిస్తుందని నమ్మకం లేదు. చాలాసేపు ప్రయత్నించాల్సి వచ్చేది. గోవింద తిరుమల యాప్‌ ఈ సమస్యలకు పరిష్కారం చూపించింది..
**గోవింద తిరుమల…
ప్రస్తుతం అందరి చేతుల్లో దర్శనమిస్తున్న స్మార్ట్‌ఫోన్లను దృష్టిలో ఉంచుకుని గోవింద తిరుమల పేరిట తితిదే అధికారికంగా యాప్‌ రూపొందించింది. దీంతోపాటు తితిదే. ఆన్‌లైన్‌ సేవకు అనుసంధానంగా పనిచేసే యాప్‌లు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అరిచేతిలో ఇమిడిపోయే సెల్‌ఫోన్‌లో మరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా దర్శన, వసతి, సేవా టిక్కెట్లను పొందే అవకాశం ఉంది.
**ఈ-విధంగా చేయాలి..
* ఈ యాప్‌ను ఎవరైనా సరే గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. గోవింద తిరుమల- తిరుపతి పేరిట ఉండే ఈ యాప్‌ గోవింద నామాల ముఖచిత్రంగా ఉంటుంది.
* యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత ముందుగా వివరాలను నమోదు (రిజిస్ట్రేషన్‌) చేసుకోవాలి.
* పేరు, చిరునామా, పిన్‌కోడ్‌, గుర్తింపుకార్డు, గుర్తింపుకార్డు నెంబరు భర్తీ చేయాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు కోసం పాన్‌కార్డు, రేషన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌ కార్డు ఏదో ఒకదాని నెంబరుతో రిజిస్ట్రేషన్‌ చేసుకునే సౌలభ్యం ఉంది.
* ఈ యాప్‌లో తరుచూ లాగిన్‌ అవటానికి ఉపయోగించే యూజర్‌ ఐడీ కింద మెయిల్‌ ఐడీని మాత్రమే నమోదు చేసుకోవాలి.
* పాస్‌వర్డ్‌ (8 అక్షరాలు) కింద ఆంగ్లపదాలు, అంకెలు, స్టార్‌/యాష్‌ వంటి గుర్తులతో రూపొందించుకోవాలి. ఒకసారి అప్లికేషన్‌లో పూర్తి వివరాలను నమోదు చేసిన తర్వాత లాగిన్‌ ద్వారా లోపలికి ప్రవేశింవచ్చు. లాగిన్‌ అయిన తర్వాత వసతి, దర్శన, సేవా టిక్కెట్ల పొందే అవకాశాన్ని పొందవచ్చు.
**లక్కీడిప్‌కు అవకాశం
తితిదే. గోవింద తిరుమల యాప్‌లో లాగిన్‌ అయిన తర్వాత మనకు అవసరమైన వివరాలను తెలుసుకోవచ్చు. ఇందులో దర్శనం, విరాళాలు, వసతి, సేవ, కల్యాణవేదిక, సేవా టిక్కెట్ల లక్కీడిప్‌ వంటివి దర్శనమిస్తాయి.
* శీఘ్రదర్శనం రూ.300 దర్శన టిక్కెట్లు మాత్రమే ఈ యాప్‌ ద్వారా తీసుకునే సౌలభ్యం ఉంది. లాగిన్‌ ద్వారా మరో 9 మంది వరకు టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు.
* దర్శనానికి వెళ్లే భక్తులందరి ఆధార్‌, ఇతర గుర్తింపు నెంబరును నమోదు చేయాలి. దర్శన టిక్కెట్‌తో పాటు అదనంగా లడ్డూలను పొందే అవకాశం ఉంది. ఒక్కో లడ్డూకు అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి రెండు లడ్డూల చొప్పున అదనంగా పొందవచ్చు. రూ.300 టిక్కెట్‌కు సాధారణంగా తితిదే. 2 లడ్డూలు ఉచితంగా ఇస్తారనే విషయాన్ని గమనించాలి.
* రూ.100 నుంచి రూ.2వేల వరకు గల గదులను యాప్‌ ద్వారా ముందస్తుగా బుక్‌ చేసుకోవచ్చు.
* ప్రత్యేక పూజల కింద కింద భక్తులు సేవా టిక్కెట్లను యాప్‌ ద్వారా పొందవచ్చు. విరాళాలు ఇవ్వాలనుకునే వారు అక్కడకు వెళ్లకుండానే యాప్‌లో ఉండే ‘ఈ-హుండీ’ ఆప్షన్‌లో చెల్లించవచ్చు.
* తితిదే ఆన్‌లైన్‌ సేవా అనే వెబ్‌సైట్‌ ద్వారా లక్కీడిప్‌ సదుపాయాన్ని యాప్‌లో కల్పించారు. ప్రతీ నెలా మొదటి శుక్రవారం ఒక నెలకు సంబంధించిన సేవా టిక్కెట్లను (సుప్రభాతం, నిజరూపదర్శనం, కల్యాణోత్సవం, అష్టదళ పాదపద్మారాధన, విశేష పూజ తదితరవి) నమోదు చేసుకుంటే, లక్కీడిప్‌ ద్వారా లభించే అవకాశం ఉంది.
**తితిదే ఆన్‌లైన్‌ బుకింగ్‌ యాప్‌…
తిరుమలలో వసతి, దర్శన సదుపాయం పొందేందుకు తితిదే. ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఆనే యాప్‌ కూడా ఉంది. దీన్ని కూడా ఉచితంగానే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. గోవింద తిరుమల తిరుపతి యాప్‌ మాదిరిగానే ఈ యాప్‌లో అవే సమాచారం పొందుపరిచి ఉంటుంది. అయితే తి.తి.దే.సేవా పేరిట ఉండే ఈ యాప్‌ తి.తి.దే. ఆన్‌లైన్‌ సేవా వెబ్‌సైట్‌ అనుసంధానంగా పనిచేస్తుంది.
***ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపు…
యాప్‌ ద్వారా నగదు చెల్లించే సమయంలో బ్యాంక్‌ వివరాలు కనిపిస్తాయి. మీ ఖాతా ఉన్న బ్యాంక్‌ను టిక్‌ చేసి, డెబిట్‌కార్డు ద్వారా చెల్లింపులు చేయవచ్చు. నగదు చెల్లించిన తర్వాత మొబైల్‌కు నగదు చెల్లించినట్లుగా సంక్షిప్త సమాచారం వస్తుంది. నగదు చెల్లింపు సక్రమంగా జరగకపోతే, మీరు మొదటి నుంచి యాప్‌ ద్వారా వసతి, దర్శన టిక్కెట్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని గమనించగలరు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com