సర్వ వేదాల సారం – చిన్ముద్ర

ముద్ర అంటే అభినయం. ‘చిన్‌’ అను పదము ‘చిత్‌’ అనే దానిని సూచిస్తుంది. దీనినే సిద్ధింపజేసేది అని కూడా అంటారు. చిన్ముద్రలో మెలకువతనం నిండుగా కనిపిస్తుంది. ఇందులో చూపుడు వేలు అహంకారాన్ని, బొటనవేలు బ్రహ్మమును, మిగిలిన మూడు వేళ్లు రాజస, తామస, సత్వగుణములను సూచిస్తాయి. చూపుడు వేలు ఎప్పుడూ ఇతరుల తప్పులను చూపించి నిందలు మోపడానికి, భయపెట్టడానికి ఉపయోగిస్తాం. అందుకే జపం చేసే వేళ ఈ వేలుని ఉపయోగించరు. ఈవేలిని అహంకారానికి చిహ్నంగా భావిస్తాం.బొటన వేలు తక్కిన నాలుగు వేళ్లకు ఆధారమైంది. అది లేనిదే రాయడానికి, ఇతర పనులు చేయటానికి వీలుకాదు. మిగిలిన వేళ్లు బొటనవేలు తోడు లేనిదే తమ శక్తిని కోల్పోతాయి. అందుకే బొటనవేలును ఆత్మగా, ఆధార బ్రహ్మముగా చెబుతారు. తక్కిన మూడు వేళ్లు మనం త్రిగుణములను గ్రహించడానికి ఉపయోపడతాయి. చదివి జ్ఞానము పొందుటకు.. తినుటకు, అనుభవించుటకు.. పోట్లాడి జయించుటకు ఇవి ఉపయోగపడుతున్నాయి. త్రిగుణములను అధీనపరిచి, బ్రహ్మమును తెలుసుకొని జీవిత సార్థకత పొందవచ్చని చిన్ముద్ర వెనుకపరమార్థం. బ్రహ్మం తెలిస్తే అహంకారం మాయమవుతుంది. ఇదియే జీవాత్మ పరమాత్మ సంగమం. దీని అంతిమ పరిణామమే సంపూర్ణ జ్ఞాన సిద్ధి. త్రిగుణములను అదుపులో ఉంచి, ఏ జీవుడు పరబ్రహ్మముతో ఐక్యం అవుతాడో అతనికి జ్ఞాన ప్రాప్తి లభిస్తుంది. దీనినే చిన్ముద్ర మనకు తెలియజేస్తుంది. భగవానుని అనుగ్రహం పొందే మార్గము తెలిపే ముద్రగా దీనిని పేర్కొంటారు. ఇక స్వామి ఎడమ చేయి పాదాలను చూపుతున్నట్లుగా ఉంటుంది. అది పరమాత్మలో జీవాత్మ లీనం కావాలంటే ముందుగా స్వామి పాదాలను శరణు కోరాలని సూచిస్తుంది. అంటే స్వామిని త్రికరణ శుద్ధిగా నమ్మి పాదాల వద్ద శరణాగతి చేయడం వల్ల జీవాత్మకు పరమాత్మను చేరే సమర్థత కలుగుతుంది. ‘పట్టబంధము’ అనే సూత్రము స్వామి మోకాళ్ల కింది నుంచి వాటిని కలుపుతూ కట్టబడి ఉంటుంది. నిశ్చలంగా ఆ భంగిమలో కూర్చుని తనను నమ్మి వచ్చే భక్తుల కోర్కెలు తీర్చి వారిలో ఆధ్యాత్మిక చింత పెంపొందేలా చేస్తానంటూ ప్రసన్నమైన ముఖంతో అభయం ప్రసాదిస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com